ఇళ్ల అద్దెలూ ఆకాశానికి | hike to House rentals | Sakshi
Sakshi News home page

ఇళ్ల అద్దెలూ ఆకాశానికి

Published Fri, Aug 8 2014 3:12 AM | Last Updated on Sat, Aug 11 2018 5:53 PM

ఇళ్ల అద్దెలూ  ఆకాశానికి - Sakshi

ఇళ్ల అద్దెలూ ఆకాశానికి

రాజధాని ప్రచారంతో రెట్టింపైన ఇళ్ల అద్దెలు
విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో జోరుగా అద్దెల వ్యాపారం
అద్దె పెంచేందుకు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్న యజమానులు
ఏదో ఒకసాకుతో ఖాళీ చేయించడం, లేకుంటే అవస్థలు పెట్టడం
ఇంటి యజమాని,కిరాయిదారుల మధ్య పెరుగుతున్న వివాదాలు

 
విజయవాడ బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కొత్త రాజధాని ప్రచారం అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో రెండు నెలలుగా ఇళ్ల అద్దెలు మెట్రో నగరాలతో పోటీ పడుతున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల కోసం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాదిరే ఇప్పుడు రెంటల్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు పుట్టుకొచ్చాయి. విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నుంచి రాష్ర్ట మంత్రుల వరకు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీసు పెడితే చంద్రబాబు బస చేసేందుకు గురునానక్ కాలనీలో ఒక ఇంటిని ఇటీవల పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమ ఇప్పటికే క్యాంపు ఆఫీసు పెట్టారు. జిల్లాలోని మరో ఇద్దరు మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్రలు క్యాంపు ఆఫీసుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కూడా విజయవాడలో ఇంటి వేటలోపడ్డారు. దీనికి తోడు కొన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విజయవాడ, గుంటూరు నగరాలకు క్యూ కడుతున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులు విపరీతంగా ఇంటి అద్దెలు పెంచేశారు. రెండు నెలల్లోనే అద్దెల భారం పెరగడంతో మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమ సంపాదనలో సగం అద్దె కట్టడానికే సరిపోతోందని ఆవేదన చెందుతున్నారు.విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న విజయవాడ.

ఇప్పుడు రాజధానికి చేరువ కాబోతోందన్న ప్రచారంతో సత్యనారాయణపురం, వన్‌టౌన్, గవర్నర్‌పేట ప్రాంతాల్లో అద్దెలు రెట్టింపయ్యాయి. గతంలో పదివేలు పలికిన అపార్ట్‌మెంట్ ప్లాట్ అద్దె కొన్ని చోట్ల ఏకంగా రూ.20 వేల దాకా పెరిగింది. నగర శివారు కానూరు, పోరంకి, యనమలకుదురు, రామవరప్పాడు, సింగ్ నగర్, భవానీపురంలో గతంలో రూ.3వేలు నుంచి ఐదు వేలున్న ఇంటి అద్దె ఇప్పుడు రూ 8 నుంచి రూ .10 వేలకు చేరింది.

1.విజయవాడలో సుమారు మూడు లక్షల ఇళ్లు ఉండగా నాలుగున్నర లక్షలకుపైగా కుటుంబాలు ఉంటున్నట్టు అంచనా. ప్రస్తుతం నెలకు త్రిబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.12 నుంచి 25వేలు, డబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.10 నుంచి 15వేలు, సింగిల్ పోర్షన్ రూ.4 నుంచి 8వేల అద్దెలు ఉన్నాయి.

2. గుంటూరులో గత మూడు నెలలతో పోల్చితే ఇప్పుడు 30శాతం వరకు అద్దెలు పెరిగాయి. నగరంలో 1.83లక్షల ఇళ్లు ఉంటే7.60లక్షల జనాభా ఉంది. టూ టౌన్ ప్రాంతంలో రెండు పడక గదుల  ప్లాట్ రూ.10వేల నుంచి 15వేలకు అద్దె పలుకుతోంది. గుంటూరు తూర్పు ప్రాంతంలో ఇంటి అద్దె రూ.6వేల నుంచి 8వేల వరకు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.8వేల నుంచి 10వేల వరకు ఉంది.

3. రాజధాని ప్రచారంతో  మంగళగిరిలో సైతం అద్దె ఇళ్లకు డిమాండ్ రావడంతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి, హాయ్‌ల్యాండ్, కొకొకోలా వంటి వాటితో ఇక్కడ అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో 18వేల ఇళ్లు ఉండగా సుమారు 30 వేల కుటుంబాలు ఉంటున్నాయి. గత మూడు నెలల కాలంలో ఇక్కడ అద్దెలు 25 నుంచి 35శాతం పెరిగాయి. ఇల్లు ఖాళీ చేస్తే అద్దెకు మరో ఇల్లు దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో రూ.5వేలు ఉన్న ప్లాట్ ఇప్పుడు రూ.8 నుంచి 9వేలకు పెరిగింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement