ఐఫోన్ ఎక్స్ అద్దె రూ.4,299
ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌ను అద్దెకు తీసుకుని వాడుకోవడం తెలిసే ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్ అద్దెకు తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కన్జ్యూమర్ రెంటల్ వెబ్సైట్ రెంటోమోజో, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్‌తో పాటు స్మార్ట్ఫోన్లను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్ ఫ్లాగ్షిప్ డివైజ్‌లు ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8లను ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు అద్దెకు ఇవ్వడం ఆఫర్ చేస్తోది. ఈ స్మార్ట్ఫోన్ల అద్దె నెలకు రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు ఉంది. రెండేళ్ల అద్దె తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ సొంతం కూడా చేసుకునే ఆప్షన్‌ను రెంటోమోజో ఆఫర్ చేస్తోంది.
రెంటోమోజో వెబ్సైట్లో ఐఫోన్ ఎక్స్ అద్దె నెలకు 4,299 రూపాయలుగా ఉంది. ఒకవేళ 24 నెలలు పాటు అద్దెకు దీన్ని బుక్ చేసుకోవాలంటే 4,299 రూపాయలను నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలలకు దీన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటే, నెలకు రూ.9,299ను చెల్లించాలి. ఎక్కువ కాలం పాటు అద్దెలు, వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ 24 నెలల తర్వాత ఈ ఐఫోన్ ఎక్స్ మీకు కావాలంటే అదనంగా రూ.15,556ను చెల్లించాలి. తొలుత రీఫండబుల్ డిపాజిట్‌గా 9,998 రూపాయలను కూడా రెంటోమోజో తీసుకుంటోంది.
అత్యంత తక్కువ అద్దె గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌పై ఉంది. 24 నెలల కాలానికి నెలవారీ 2,099 రూపాయలను చెల్లించాలి. ఆరు నెలలకు దీని అద్దె నెలవారీ 5,398 రూపాయలుగా ఉంది. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,398 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ నోట్ 8లు కూడా అద్దెకు అందుబాటులో ఉన్నాయి. రెంటోమోజో అద్దెకు ఉంచిన డివైజ్‌లన్నీ ఖరీదైనవే. కొంత కాలమైనా ఆ ఫోన్లను వాడాలనే ఆశ కలిగి వారికి, రెంటోమోజో ఈ బంపర్ కానుకను అందిస్తుంది.