ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
-ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్
ఒంగోలు టూటౌన్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పి. వంశీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామిని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
అధికారంలోకి వచ్చి ఒకటిన్న సంవత్సరం దాటినా నేటికీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. మొత్తం 13 జిల్లాల్లో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని భర్తీచేయడంలో సర్కార్ మీనమేషాలు లెక్కించడం తగదని సంఘం కార్యదర్శి ఎన్. గోవిందరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.