republican celebrations
-
ప్రగతిభవన్‌లో గణతంత్ర దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమం త్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో.. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మాలోతు కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రూపొందించిన క్యాలెండర్– 2019ను కేటీఆర్ ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తే దేశానికి శ్రీరామరక్ష: ఉత్తమ్ రాజ్యాంగ స్ఫూర్తే దేశానికి శ్రీరామరక్ష అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశ ప్రజల హక్కులు, కర్తవ్యాల కలబోతగా లిఖిత రాజ్యాంగం ఉండటం దేశ ప్రజల అదృష్టమన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల కింద నిర్మించిన అనేక ప్రజాస్వామ్య సంస్థలను ఈ ప్రభుత్వాలు విధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దనరెడ్డి, ఫిరోజ్‌ఖాన్ పాల్గొన్నారు. అభివృద్ధి ఫలాలు అందడం లేదు: సురవరం దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించినా, వాటి ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందకపోవడం అనేది చేదు వాస్తవంగానే మిగిలిపోయిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మగ్దూంభవన్‌లో నిర్వహించిన 70వ గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. మతోన్మాదం, అసహనం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. లౌకికవ్యవస్థకు ఆటుపోట్లు ఎదురవుతున్నాయన్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, డా.సుధాకర్, బి.ప్రభాకర్, వెంకట్రాములు, ప్రేంపావని పాల్గొన్నారు. ‘ఏదైనా చేయొచ్చన్న భావన వీడాలి’ ‘అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే భావనను పాలకులు వీడాలి’ అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. దేశ భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్ అని పేర్కొన్నారు. శనివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజేఎస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. దేశంలో రాజ్యాంగం సమానత్వపు హక్కు కల్పించినా సామాజిక అసమానతలు మాత్రం దూరం కాలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదని, ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై అడిగే హక్కు తమకుందని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్‌కు ఉందన్నారు. కార్యక్రమంలో బద్రుద్దీన్, యోగేశ్వరరెడ్డి వెదిరె పాల్గొన్నారు. -
పాపం.. బడి పిల్లలు
వల్లూరు: తమ పాఠశాలలో శుక్రవారం జరగనున్న గణతంత్ర వేడుకల్లో జెండాను ఎగురవేసేందుకు సిద్ధం చేస్తుండగా పాఠశాల ముందు భాగంలో ఉన్న విద్యుత్ తీగలు తగులుకుని నలుగురు విద్యార్థులకు గాయాలైన సంఘటన మండలంలోని పెద్దలేబాక ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు మండలంలోని పెద్దలేబాక ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక ( స్పెషల్ ) పాఠశాల ఉపాధ్యాయుడు దీన్ దయాల్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం జరిగే వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుని సూచన మేరకు పాఠశాల తరగతి గదిలో ఉన్న జెండాను ఎగురవేసే ఇనుప పైపును నలుగురు విద్యార్థులు గది బయటకు తీసుకుని వచ్చారు. పైపును నిలబెట్టే క్రమంలో పాఠశాల ఆవరణలో గదికి సమీపంలో వెళుతున్న 11 కేవీ విద్యుత్ తీగలకు పొరబాటున తగిలింది. దీంతో పైపు గుండా విద్యుత్ ప్రవహించడంతో పైపును పట్టుకున్న 5 వ తరగతి విద్యార్థులు ఆది జాషువా పాల్, బి.ఈశ్వర వర్దన్, ఆది రామకృష్ణ , నాలుగవ తరగతి విద్యార్థి పెరికెల అజిత్ చంద్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయుడు దీన్ దయాల్ అప్రమత్తమై వారిని రక్షించాడు. దీంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు , స్థానికులు విద్యార్థులను ఆటోలో కమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఈశ్వర వర్దన్, జాషువా పాల్ అనే విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. కాలికి తీవ్ర గాయమైన జాషువా పాల్ , షాక్‌లో ఉన్న ఈశ్వర వర్దన్‌లు కోలుకుంటున్నారు. తహసీల్దార్ మహాలక్ష్మి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. పరామర్శించిన ఎమ్మెల్యే రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను జెడ్పీటీసీ సభ్యుడు అబ్బిరెడ్డి వీరారెడ్డితో కలిసి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి పరామర్శించారు. వారి తల్లి దండ్రులతో ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ చల్లా రాజారెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు చిట్టిబాబు ఉన్నారు. -
గణతంత్ర వేడుకలు నిర్వహించాలి
► ప్రత్యేక ఆకర్షణగా ప్రభుత్వ శకటాలు ఉండాలి ►ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విద్యుద్దీపాలంకరణ చేయాలి ► సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ.శ్రీధర్ నాగర్‌కర్నూల్ టౌన్ : కొత్త జిల్లాలో మొదటిసారిగా నిర్వహించనున్న గణతంత్ర వేడుకలు అంబరాన్నంటేలా ఉండాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలు కొత్తగా, ఉత్సాహంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ రోజు జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించాలన్నారు. రాష్ట్ర, దేశ ఉన్నతిని చాటే ఈ కార్యక్రమం అభివృద్ధి, సంక్షేమ శకటాల ప్రదర్శన, నగదురహిత లావాదేవీలపై అవగాహన స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీపాలంకరణ, పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ముఖ్య కార్యక్రమాలు, కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్, గాంధీపార్క్, మున్సిపాలిటీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండా ఆవిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అన్ని జిల్లా శాఖల నుంచి అధికారులు అభివృద్ధి, సంక్షేమం, తదితర అంశాలపై ఈనెల 20 కల్లా సీపీఓకు నివేదికలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, జేసీ సురేందర్‌కరణ్, డీఆర్ఓ శ్రీరాములు, సీపీఓ జగన్నాథం పాల్గొన్నారు.