గణతంత్ర వేడుకలు నిర్వహించాలి
► ప్రత్యేక ఆకర్షణగా ప్రభుత్వ శకటాలు ఉండాలి
►ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విద్యుద్దీపాలంకరణ చేయాలి
► సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ.శ్రీధర్
నాగర్‌కర్నూల్ టౌన్ : కొత్త జిల్లాలో మొదటిసారిగా నిర్వహించనున్న గణతంత్ర వేడుకలు అంబరాన్నంటేలా ఉండాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలు కొత్తగా, ఉత్సాహంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ రోజు జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించాలన్నారు. రాష్ట్ర, దేశ ఉన్నతిని చాటే ఈ కార్యక్రమం అభివృద్ధి, సంక్షేమ శకటాల ప్రదర్శన, నగదురహిత లావాదేవీలపై అవగాహన స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీపాలంకరణ, పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ముఖ్య కార్యక్రమాలు, కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్, గాంధీపార్క్, మున్సిపాలిటీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండా ఆవిష్కరించాలన్నారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ ఉత్సవాలకు విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అన్ని జిల్లా శాఖల నుంచి అధికారులు అభివృద్ధి, సంక్షేమం, తదితర అంశాలపై ఈనెల 20 కల్లా సీపీఓకు నివేదికలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, జేసీ సురేందర్‌కరణ్, డీఆర్‌ఓ శ్రీరాములు, సీపీఓ జగన్నాథం పాల్గొన్నారు.