e.sridhar
-
గణతంత్ర వేడుకలు నిర్వహించాలి
► ప్రత్యేక ఆకర్షణగా ప్రభుత్వ శకటాలు ఉండాలి ►ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విద్యుద్దీపాలంకరణ చేయాలి ► సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ.శ్రీధర్ నాగర్‌కర్నూల్ టౌన్ : కొత్త జిల్లాలో మొదటిసారిగా నిర్వహించనున్న గణతంత్ర వేడుకలు అంబరాన్నంటేలా ఉండాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలు కొత్తగా, ఉత్సాహంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ రోజు జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించాలన్నారు. రాష్ట్ర, దేశ ఉన్నతిని చాటే ఈ కార్యక్రమం అభివృద్ధి, సంక్షేమ శకటాల ప్రదర్శన, నగదురహిత లావాదేవీలపై అవగాహన స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీపాలంకరణ, పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ముఖ్య కార్యక్రమాలు, కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్, గాంధీపార్క్, మున్సిపాలిటీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయజెండా ఆవిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అన్ని జిల్లా శాఖల నుంచి అధికారులు అభివృద్ధి, సంక్షేమం, తదితర అంశాలపై ఈనెల 20 కల్లా సీపీఓకు నివేదికలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, జేసీ సురేందర్‌కరణ్, డీఆర్ఓ శ్రీరాములు, సీపీఓ జగన్నాథం పాల్గొన్నారు. -
బినామీల పేరిట నిధుల భోజ్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ కుటుంబ లబ్ధి పథకం (ఎన్ఎఫ్బీఎస్) అమలులో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌పై వేటు పడింది. పథకం కింద అర్హులకు ఇవ్వాల్సిన సాయాన్ని బినామీల ఖాతాలోకి మళ్లించిన ధారూరు మండల తహసీల్దార్ ఎం.శ్రీనివాస్‌రావును కలెక్టర్ ఎన్.శ్రీధర్ బుధవారం సస్పెండ్ చేశారు. శ్రీనివాసరావు గతంలో శామీర్‌పేట్ తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఎన్ఎఫ్బీఎస్ కింద మండలానికి రూ.ఐదు లక్షలు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 13 మంది లబ్ధిదారులకు రూ.65వేలు చెక్కుల రూపంలో అందించారు. మిగతా లబ్ధిదారులకు ఈ నిధులు ఇవ్వకుండా బినామీ పేర్లతో ప్రభుత్వ ఖాతా నుంచి దారిమళ్లించారు. రూ.4.35లక్షలు అక్రమంగా డ్రా చేశారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులందడంతో మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్‌రెడ్డితో విచారణ చేయించారు. ఆర్డీఓ విచారణ అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఎన్ఎఫ్బీఎస్ పథకం అమలులో అక్రమాలు రుజువు కావడంతో కలెక్టర్ ఎన్.శ్రీధర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరు.. జిల్లా రెవెన్యూ శాఖలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్లు సస్పెన్షన్‌కు గురికావడం రెవెన్యూ వర్గాలను కలవరపెడుతోంది. మల్కాజిగిరి మండలంలోని ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ నరసింహరావును గత ఆదివారం సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూమిని ప్రైవేటు పర్వం చేయడంలో కీలకభూమిక పోషించిన అంశంపై పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డితో విచారణ జరిపించిన కలెక్టర్.. ఆదివారం సస్పెన్షన్ ఉత్తర్వులిచ్చారు. తాజాగా శామీర్‌పేట మండలంలో ఎన్ఎఫ్బీఎస్ పథకానికి సంబంధించి నిధులను అక్రమంగా బొక్కిన అప్పటి తహసీల్దార్ శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేశారు. తాజా విచారణ కూడా మల్కాజిగిరి ఆర్డీఓ నేతృత్వంలోనే జరిగింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్ల అక్ర మభాగోతం బట్టబయలు కావడం రెవెన్యూ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. అక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా రెవెన్యూ శాఖలో తాజా పరిణామాలు అధికారులకు మింగుడు పడడం లేదు. వరుసగా అధికారుల లీలలు ఒ క్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమం లో అక్రమాలకు పాల్పడిన మరికొందరు అధికారుల భాగోతం త్వరలో వెలుగుచూడనుందని ఆ శాఖలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. -
రుణమాఫీ రూ.1032.60 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 10 వేల 252 మందికి రూ.1032.62 కోట్ల మాఫీ కానున్నట్లు యంత్రాంగం నిర్ధారించింది. దాదాపు 20 రోజులపాటు రుణమాఫీ అంశం కుస్తీపట్టి లెక్కలు తేల్చగా, శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ)లో ఆమోదం లభించింది. కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకుల వారీగా వచ్చిన వివరాలను క్రోడీకరించి తయారు చేసిన నివేదికను సమర్పించగా.. వాటిని కమిటీ సభ్యులు ఆమోదించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వివరాల ప్రకారం పంట రుణాలకు సంబంధించి 2,04,330 రైతులకు రూ.1130.33 కోట్లు, బంగారు ఆభరణాలపై రుణాలకు సంబంధించి 6,169 రైతులకు గాను రూ.101.39 కోట్లుగా గుర్తించారు. అయితే డీసీసీ మాత్రం 2,10,252 రైతులకుగాను రూ. 1032.60 కోట్లు మాత్రమే మాఫీకి ఆమోదించింది. సమావేశ అనంతరం రుణమాఫీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రీషెడ్యూల్‌పై దృష్టి పెట్టండి: కలెక్టర్ శ్రీధర్ ప్రభుత్వ ఆదేశాలమేరకు రుణమాఫీ కసరత్తు పూర్తిచేసిన బ్యాంకర్లు ప్రస్తుతం రుణాల రీషెడ్యూల్‌పై దృష్టి సారించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్‌బ్యాంకు ఇచ్చిన పంట రుణాల రీషెడ్యూల్ మార్గదర్శకాలను అన్ని బ్యాంకులకు అందజేయనున్నట్లు తెలిపారు. పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రూ.442 కోట్ల రుణ లక్ష్యానికి గాను కేవలం రూ.112 కోట్లు మాత్రమే మంజూరు చేశామని, రీషెడ్యూల్లో భాగంగా మిగతా రుణాలను రీషెడ్యూల్ చేసి వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో ఉన్న గ్రామాలను గుర్తించి.. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఒక్కో గ్రామ రైతులకు నిర్దేశిత సమయాన్ని కేటాయించి ఆరోజు ఆ గ్రామంలోని రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. రైతులను బ్యాంకుకు తీసుకొచ్చే బాధ్యత సంబంధిత వ్యవసాయ, విస్తరణ అధికారులకు అప్పగించాలని జేడీఏ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు. సోమవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ఉందని, ఈ కార్యక్రమంలో రుణమాఫీ అమలుకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత వస్తుందన్నారు. ఈ సమావేశానికి బ్యాంకు ప్రతినిధులు హాజరుకావాలన్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, ఎల్డీఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.