సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 10 వేల 252 మందికి రూ.1032.62 కోట్ల మాఫీ కానున్నట్లు యంత్రాంగం నిర్ధారించింది. దాదాపు 20 రోజులపాటు రుణమాఫీ అంశం కుస్తీపట్టి లెక్కలు తేల్చగా, శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ)లో ఆమోదం లభించింది. కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకుల వారీగా వచ్చిన వివరాలను క్రోడీకరించి తయారు చేసిన నివేదికను సమర్పించగా.. వాటిని కమిటీ సభ్యులు ఆమోదించారు.
క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వివరాల ప్రకారం పంట రుణాలకు సంబంధించి 2,04,330 రైతులకు రూ.1130.33 కోట్లు, బంగారు ఆభరణాలపై రుణాలకు సంబంధించి 6,169 రైతులకు గాను రూ.101.39 కోట్లుగా గుర్తించారు. అయితే డీసీసీ మాత్రం 2,10,252 రైతులకుగాను రూ. 1032.60 కోట్లు మాత్రమే మాఫీకి ఆమోదించింది. సమావేశ అనంతరం రుణమాఫీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
రీషెడ్యూల్‌పై దృష్టి పెట్టండి: కలెక్టర్ శ్రీధర్
ప్రభుత్వ ఆదేశాలమేరకు రుణమాఫీ కసరత్తు పూర్తిచేసిన బ్యాంకర్లు ప్రస్తుతం రుణాల రీషెడ్యూల్‌పై దృష్టి సారించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్‌బ్యాంకు ఇచ్చిన పంట రుణాల రీషెడ్యూల్ మార్గదర్శకాలను అన్ని బ్యాంకులకు అందజేయనున్నట్లు తెలిపారు. పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఖరీఫ్ సీజన్‌లో రూ.442 కోట్ల రుణ లక్ష్యానికి గాను కేవలం రూ.112 కోట్లు మాత్రమే మంజూరు చేశామని, రీషెడ్యూల్‌లో భాగంగా మిగతా రుణాలను రీషెడ్యూల్ చేసి వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో ఉన్న గ్రామాలను గుర్తించి.. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఒక్కో గ్రామ రైతులకు నిర్దేశిత సమయాన్ని కేటాయించి ఆరోజు ఆ గ్రామంలోని రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. రైతులను బ్యాంకుకు తీసుకొచ్చే బాధ్యత సంబంధిత వ్యవసాయ, విస్తరణ అధికారులకు అప్పగించాలని జేడీఏ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు.
సోమవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ఉందని, ఈ కార్యక్రమంలో రుణమాఫీ అమలుకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత వస్తుందన్నారు. ఈ సమావేశానికి బ్యాంకు ప్రతినిధులు హాజరుకావాలన్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, ఎల్‌డీఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ రూ.1032.60 కోట్లు
Published Sat, Sep 13 2014 12:00 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement