జెండా వందనం చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.లక్ష్మణ్, దత్తాత్రేయ, రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి, కోదండరాం, సురవరం, చాడ, తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమం త్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో..
టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మాలోతు కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రూపొందించిన క్యాలెండర్– 2019ను కేటీఆర్ ఆవిష్కరించారు.
రాజ్యాంగ స్ఫూర్తే దేశానికి శ్రీరామరక్ష: ఉత్తమ్
రాజ్యాంగ స్ఫూర్తే దేశానికి శ్రీరామరక్ష అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశ ప్రజల హక్కులు, కర్తవ్యాల కలబోతగా లిఖిత రాజ్యాంగం ఉండటం దేశ ప్రజల అదృష్టమన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల కింద నిర్మించిన అనేక ప్రజాస్వామ్య సంస్థలను ఈ ప్రభుత్వాలు విధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దనరెడ్డి, ఫిరోజ్‌ఖాన్ పాల్గొన్నారు.
అభివృద్ధి ఫలాలు అందడం లేదు: సురవరం
దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించినా, వాటి ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందకపోవడం అనేది చేదు వాస్తవంగానే మిగిలిపోయిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మగ్దూంభవన్‌లో నిర్వహించిన 70వ గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. మతోన్మాదం, అసహనం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. లౌకికవ్యవస్థకు ఆటుపోట్లు ఎదురవుతున్నాయన్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, డా.సుధాకర్, బి.ప్రభాకర్, వెంకట్రాములు, ప్రేంపావని పాల్గొన్నారు.
‘ఏదైనా చేయొచ్చన్న భావన వీడాలి’
‘అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే భావనను పాలకులు వీడాలి’ అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. దేశ భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్ అని పేర్కొన్నారు. శనివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజేఎస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. దేశంలో రాజ్యాంగం సమానత్వపు హక్కు కల్పించినా సామాజిక అసమానతలు మాత్రం దూరం కాలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదని, ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై అడిగే హక్కు తమకుందని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్‌కు ఉందన్నారు. కార్యక్రమంలో బద్రుద్దీన్, యోగేశ్వరరెడ్డి వెదిరె పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment