Republican primaries
-
Us Elections: ప్రైమరీల్లో ట్రంప్ హవా.. ఖాతాలో మరో మూడు విజయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించేందుకు జరుగుతున్న పార్టీ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం జరిగిన ఇదాహో, మిస్సోరి, మిచిగన్ రిపబ్లికన్ ప్రైమైరీ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్‌నకు మద్దతుగా ఇప్పటి వరకు 244 డెలిగేట్లు ఉండగా ప్రత్యర్థి నిక్కీ హాలేకు మద్దతుగా కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేట్ అవ్వాలంటే మొత్తం 1215 డెలిగేట్ల మద్దతు అవసరం. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అతి పెద్ద ఈవెంట్‌గా చెప్పే మార్చి 5 (సూపర్ ట్యూస్డే) మంగళవారం రోజు ఏకంగా 16 రాష్ట్రాల్లో ఏక కాలంలో ప్రైమరీ బ్యాలెట్ పోరు జరగనుంది. రెండు పార్టీల్లో సూపర్ ట్యూస్డే విజేతలు దేశ తుది అధ్యక్ష పోరులో తలపడతారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరులో అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల తరపున గతంలో తలపడ్డ అభ్యర్థులు జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారనేది దాదాపు ఖాయమైంది. ఇటు బైడెన్ విషయంలో అధిక వయసు, మతిమరుపు వంటి అంశాలు, అటు ట్రంప్‌ను వేధిస్తున్న న్యాయపరమైన కేసుల చిక్కులు ఉన్నప్పటికీ ఇద్దరే మళ్లీ అధ్యక్ష పదవి రేసులో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి.. టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం -
ట్రంప్ వర్సెస్ హిల్లరీ!
♦ అమెరికా అధ్యక్ష పోరు వీరిద్దరి మధ్యే? ♦ ‘సూపర్ ట్యూస్డే’ ప్రైమరీల్లో ఇరువురు నేతల విజయ ఢంకా వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు.. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్ల మధ్యే జరిగే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఇరు పార్టీల ‘సూపర్ ట్యూస్డే’ ప్రైమరీల్లో వారిద్దరూ తమ తమ పార్టీల్లో భారీ విజయాలు సాధించారు. అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పార్టీ నామినేషన్లు పొందేందుకు తమ తమ పార్టీల్లో ప్రత్యర్థులకన్నా చాలా ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం నాడు జరిగిన ఈ ప్రైమరీల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ రేసులో ముందున్న ట్రంప్.. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెన్నెసీ, వెర్మాంట్, వర్జీనియా - ఏడు రాష్ట్రాల్లో విజయ బావుటా ఎగురవేశారు. డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ రేసులో ముందున్న హిల్లరీ.. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెన్నెసీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్ల నుంచి ఆమెకు గట్టి మద్దతు లభించింది. రిపబ్లికన్ పార్టీలో టెడ్ క్రూజ్.. టెక్సాస్‌లో అతిపెద్ద విజయం సాధించటంతో పాటు, ఓక్లహామా, అలాస్కాల్లోనూ గెలుపొం దారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి కూడా.. హిల్లరీ ప్రధాన ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందారు. ఏకైక లక్ష్యంతో హిల్లరీతో తలపడతా.. ఈ ఫలితాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని పాం బీచ్‌లోని తన రిసార్ట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన రాత్రి అని హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ రేసు ముగిసిన తర్వాత తాను పార్టీని సమైక్యం చేసి ఏకైక లక్ష్యంతో హిల్లరీతో తలపడతానని పేర్కొన్నారు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా చేయటమే తన లక్ష్యమన్న ఎన్నికల నినాదాన్ని పునరుద్ఘాటించారు. -
ట్రంప్ ఆగడు.. హిల్లరీ దూకుడు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన ‘సూపర్ మంగళవారం’ ఫలితాల్లో డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లు సూపర్ విక్టరీ కొట్టారు. కీలకమైన 12 రాష్ట్రాల్లో ప్రైమరీలు, కాకసస్‌లలో అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియనే సూపర్ ట్యూస్ డే అంటారు. అలబా మా నుంచి అలాస్కా వరకూ జరగనున్న ఈ ప్రైమరీల్లో డెమొక్రాట్ ఫ్రంట్ రన్నర్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థుల్లో ముందున్న డోనాల్డ్ ట్రంప్ స్వీప్ సాధించే అవకాశాలన్నాయన్న సర్వే అంచనాలు నిజమని తేలాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 12 రాష్ట్రాలకుగానూ 7 చోట్ల ట్రంప్ విజయం సాధించారు. కీలకమైన వర్జీనియా స్టేట్ సహా అలబామా, ఆర్కాన్సస్, జార్జియా, మసాచ్యుసెట్స్, టెన్నెస్సీ, వెర్మోంట్ లలో ట్రంప్ క్లీన్ విక్టరీ కొట్టారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ఆయనతో పోటీపడుతోన్న టెడ్ క్రూజ్ తన స్వరాష్ట్రం టెక్సాస్, ఒక్లహామాల్లో మాత్రమే గెలుపొందారు. మిగిలన మూడు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సిఉంది. అయితే వాటిలో రెండు చోట్ల కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఇక డెమోక్రాట్ల విషయానికి వస్తే మాజీ మొదటి మహిళ హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి శాండర్స్ పై భారీ ఆధిక్యతను ప్రదర్శించారు. 12 రాష్ట్రాలకుగానూ హిల్లరీ ఏడు చోట్ల భారీ విజయాన్ని నమోదుచేసుకోగా, శాండర్స్ నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటారు. అలబామా, ఆర్కన్సాస్, జార్జియా, మసాచ్చుసెట్స్, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో హిల్లరీ తడాఖా చూపగా, పార్టీలో ఆమె ప్రత్యర్థి శాండర్స్ కొరలాడో, మినెసొటా, ఒక్లాహామా, వెర్కౌంట్ లో విజయం సాధించారు. ఇంకా ఒక రాష్ట్రం ఫలితం వెలువడాల్సిఉంది.