ట్రంప్ వర్సెస్ హిల్లరీ!
♦ అమెరికా అధ్యక్ష పోరు వీరిద్దరి మధ్యే?
♦ ‘సూపర్ ట్యూస్‌డే’ ప్రైమరీల్లో ఇరువురు నేతల విజయ ఢంకా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు.. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్‌ల మధ్యే జరిగే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఇరు పార్టీల ‘సూపర్ ట్యూస్‌డే’ ప్రైమరీల్లో వారిద్దరూ తమ తమ పార్టీల్లో భారీ విజయాలు సాధించారు. అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పార్టీ నామినేషన్లు పొందేందుకు తమ తమ పార్టీల్లో ప్రత్యర్థులకన్నా చాలా ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం నాడు జరిగిన ఈ ప్రైమరీల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.
రిపబ్లికన్ పార్టీ నామినేషన్ రేసులో ముందున్న ట్రంప్.. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెన్నెసీ, వెర్మాంట్, వర్జీనియా - ఏడు రాష్ట్రాల్లో విజయ బావుటా ఎగురవేశారు. డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ రేసులో ముందున్న హిల్లరీ.. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెన్నెసీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్ల నుంచి ఆమెకు గట్టి మద్దతు లభించింది. రిపబ్లికన్ పార్టీలో టెడ్ క్రూజ్.. టెక్సాస్‌లో అతిపెద్ద విజయం సాధించటంతో పాటు, ఓక్లహామా, అలాస్కాల్లోనూ గెలుపొం దారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి కూడా.. హిల్లరీ ప్రధాన ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందారు.
ఏకైక లక్ష్యంతో హిల్లరీతో తలపడతా..
ఈ ఫలితాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని పాం బీచ్‌లోని తన రిసార్ట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన రాత్రి అని హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ రేసు ముగిసిన తర్వాత తాను పార్టీని సమైక్యం చేసి ఏకైక లక్ష్యంతో హిల్లరీతో తలపడతానని పేర్కొన్నారు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా చేయటమే తన లక్ష్యమన్న ఎన్నికల నినాదాన్ని పునరుద్ఘాటించారు.