ట్రంప్ ఆగడు.. హిల్లరీ దూకుడు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన ‘సూపర్ మంగళవారం’ ఫలితాల్లో డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లు సూపర్ విక్టరీ కొట్టారు. కీలకమైన 12 రాష్ట్రాల్లో ప్రైమరీలు, కాకసస్‌లలో అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియనే సూపర్ ట్యూస్ డే అంటారు. అలబా మా నుంచి అలాస్కా వరకూ జరగనున్న ఈ ప్రైమరీల్లో డెమొక్రాట్ ఫ్రంట్ రన్నర్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థుల్లో ముందున్న డోనాల్డ్ ట్రంప్ స్వీప్ సాధించే అవకాశాలన్నాయన్న సర్వే అంచనాలు నిజమని తేలాయి.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 12 రాష్ట్రాలకుగానూ 7 చోట్ల ట్రంప్ విజయం సాధించారు. కీలకమైన వర్జీనియా స్టేట్ సహా అలబామా, ఆర్కాన్సస్, జార్జియా, మసాచ్యుసెట్స్, టెన్నెస్సీ, వెర్మోంట్ లలో ట్రంప్ క్లీన్ విక్టరీ కొట్టారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ఆయనతో పోటీపడుతోన్న టెడ్ క్రూజ్ తన స్వరాష్ట్రం టెక్సాస్, ఒక్లహామాల్లో మాత్రమే గెలుపొందారు. మిగిలన మూడు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సిఉంది. అయితే వాటిలో రెండు చోట్ల కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
ఇక డెమోక్రాట్ల విషయానికి వస్తే మాజీ మొదటి మహిళ హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి శాండర్స్ పై భారీ ఆధిక్యతను ప్రదర్శించారు. 12 రాష్ట్రాలకుగానూ హిల్లరీ ఏడు చోట్ల భారీ విజయాన్ని నమోదుచేసుకోగా, శాండర్స్ నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటారు. అలబామా, ఆర్కన్సాస్, జార్జియా, మసాచ్చుసెట్స్, టెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో హిల్లరీ తడాఖా చూపగా, పార్టీలో ఆమె ప్రత్యర్థి శాండర్స్ కొరలాడో, మినెసొటా, ఒక్లాహామా, వెర్కౌంట్ లో విజయం సాధించారు. ఇంకా ఒక రాష్ట్రం ఫలితం వెలువడాల్సిఉంది.