వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించేందుకు జరుగుతున్న పార్టీ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం జరిగిన ఇదాహో, మిస్సోరి, మిచిగన్ రిపబ్లికన్ ప్రైమైరీ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు.
ట్రంప్‌నకు మద్దతుగా ఇప్పటి వరకు 244 డెలిగేట్లు ఉండగా ప్రత్యర్థి నిక్కీ హాలేకు మద్దతుగా కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేట్ అవ్వాలంటే మొత్తం 1215 డెలిగేట్‌ల మద్దతు అవసరం. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అతి పెద్ద ఈవెంట్‌గా చెప్పే మార్చి 5 (సూపర్ ట్యూస్‌డే) మంగళవారం రోజు ఏకంగా 16 రాష్ట్రాల్లో ఏక కాలంలో ప్రైమరీ బ్యాలెట్ పోరు జరగనుంది. రెండు పార్టీల్లో సూపర్ ట్యూస్‌డే విజేతలు దేశ తుది అధ్యక్ష పోరులో తలపడతారు.
ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరులో అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల తరపున గతంలో తలపడ్డ అభ్యర్థులు జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారనేది దాదాపు ఖాయమైంది. ఇటు బైడెన్ విషయంలో అధిక వయసు, మతిమరుపు వంటి అంశాలు, అటు ట్రంప్‌ను వేధిస్తున్న న్యాయపరమైన కేసుల చిక్కులు ఉన్నప్పటికీ ఇద్దరే మళ్లీ అధ్యక్ష పదవి రేసులో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment