resankardu
-
నో స్టాక్
అక్టోబర్‌లో దసరా, బక్రీద్, దీపావళి పండుగలు ఆరు నెలలుగా పంపిణీ లేని పామాయిల్ రెండు నెలలుగా అందని కందిపప్పు కర్నూలు: అక్టోబర్ నెలలో దసరా, బక్రీద్, దీపావళి పండుగలు ఉన్నాయి. పండుగ వేళ పిండి వంటలు చేసుకోవడానికి కావాల్సిన వంట నూనె, కంది పప్పు పంపిణీ లేకపోవడంతో పేదలు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ఆరు నెలలుగా వంట నూనె సరఫరా కాకపోయినా పట్టించుకునే వారే లేరు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన ఈ సమస్యను అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో పేదలకు పామాయిల్ అందని పరిస్థితి నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్డు వినియోగదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కందిపప్పు కూడా రెండు నెలలుగా సరఫరా చేయడం లేదు. కందిపప్పు ఎప్పుడొస్తుందోనని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 11.50 లక్షల పేద కుటుంబాల్లో పండుగ కళ కన్పించడంలేదు. జిల్లాలో 11.50 లక్షల తెల్ల రేషన్‌కార్డుదారులుండగా వీరికి ప్రతి నెల బియ్యం, కిరోసిన్, పంచదార, పామాయిల్, కందిపప్పు వంటివి సరఫరా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బియ్యం, కిరోసిన్ యధావిధిగా సరఫరా చేస్తున్న పౌర సరఫరాల శాఖ పామాయిల్, కందిపప్పును మాత్రం పట్టించుకోవడం మానేసింది. కార్డుకు కేజీ పామాయిల్ చొప్పున 11.50 లక్షల కిలోల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ రూ.65 వరకు ధర పలుకుతుండగా రేషన్ దుకాణాల్లో మాత్రం రూ.40కే విక్రయిస్తారు. వీటికి కూడా రాయితీల విధానం ఉంది. సాధారణ ధరకే అంటే బహిరంగ మార్కెట్లో ఎంత ధర ఉందో అంతే ధరకు దీనిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అందులో రూ.10 రాయితీని కేంద్ర ప్రభుత్వం రూ.13 రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. ఇలా రూ.23 పోగా మిగిలిన సొమ్ముకు అంటే రూ.40 కి కిలో పామాయిల్‌ను పేదలకు అందిస్తున్నారు. గత ఆరు నెలలుగా పేదలకు పామాయిల్ అందడం లేదు. సాధారణంగా మలేషియా నుంచి కాకినాడ పోర్టుకు పామాయిల్ దిగుమతి అవుతండగా ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది. కాకినాడ రీఫైనరీల్లో కావాల్సినంత పామాయిల్ అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ రాకపోవడం వల్ల సరఫరా ఆగిపోయింది. కేంద్రం భరించాల్సిన రూ.10 సబ్సిడీపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సమాచారం అందించకపోవడంతో పామాయిల్ సరఫరా జరగడం లేదని ఉన్నతాధికారులు తెలిపారు. కందిపప్పు పరిస్థితి ఇదే.. పేదలకు ఇచ్చే సబ్సిడీ సరుకుల్లో కందిపప్పు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లాలో 11.50 లక్షల కిలోలు సరఫరా చేయాలి. రేషన్ దుకాణంలో కందిపప్పు కిలో రూ.50కి ఇస్తుండగా బహిరంగ మార్కెట్లో ధర రూ.70 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకే కాంట్రాక్టర్‌కు కందిపప్పు సరఫరా అప్పగించారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ కందిపప్పు సరఫరా చేయలేకపోవడంతో పేదలకు అందడం లేదు. పంచదార సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క కార్డుదారునికి అర కిలో చొప్పున పంపిణీ జరుగుతుండగా ముందుగా ఎవరు వస్తే వారికే అనే రీతిలో పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులందరికీ అందడం లేదు. ఇటువంటి చిన్న ఇబ్బందులు పరిష్కరించడం ద్వారా పేదలకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. దీనిపై అధికారులు కూడా దృష్టి సారించడం లేదు. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే దసరా, బక్రీద్, దీపావళి పండుగలకు సబ్సిడీ సరుకులు అందుకోవచ్చునని కార్డుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జన్మభూమిలో నిలదీసేందుకు వామపక్షాలు సిద్ధం.. అధికారుల పర్యవేక్షణ లేక జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో నిలదీసేందుకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. చౌక డిపో డీలర్లు నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో కొంతకాలంగా పామాయిల్, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరగడంలేదు. జన్మభూమిలో అధికార యంత్రాంగాన్ని నిలదీయడం ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం వాటి అనుబంధ ప్రజా సంఘాల నాయకులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి జన్మభూమిలో అధికారులను నిలదీసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. -
రుణమాఫీకి నిబంధనాలు
ఆధార్ కార్డు తప్పనిసరి రేషన్ కార్డూ ఉండాల్సిందే నందికొట్కూరుకు చెందిన సుదర్శన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి 2013లో రుణం తీసుకున్నాడు. ఈయన ఆధార్ కోసం నాలుగు సార్లు వివరాలు నమోదు చేయించుకున్నాడు. కానీ యూఐడీ నంబరు రాలేదు. దీంతో రుణమాఫీకి అర్హత పొందలేకపోయాడు. ప్యాపిలికి చెందిన క్రిష్టన్న అక్కడి పీఎసీఎస్ నుంచి గతేడాది పంట రుణం తీసుకున్నాడు. ఈయనకు రేషన్‌కార్డు లేదు. రేషన్‌కార్డు కోసం గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ కార్యక్రమం జరిగిన ప్రతిసారీ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ కార్డు రాలేదు. రేషన్‌కార్డు రాలేదనే కారణంతో రుణమాఫీకి అర్హత పొందలేకపోయాడు. కర్నూలు(అగ్రికల్చర్): రుణమాఫీకి విధిగా ఆధార్, రేషన్‌కార్డు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీకి దూరమవుతున్నారు. ఎల్డీఎం(లీడ్ డిస్ట్రిక్ మేనేజర్) రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు 5.75 లక్షల మంది ఉన్నారు. అయితే ఆధార్, రేషన్ కార్డు లింకప్ చేయడంతో వారిలో 20 శాతానికి పైగా అనర్హులుగా మిగులుతున్నారు. రేషన్‌కార్డు ఉంటే ఆధార్ లేకపోవడం, ఆధార్ ఉంటే రేషన్‌కార్డు లేకపోవడంతో దాదాపు లక్షల మంది రైతుల వివరాలు నమోదు కాలేదు. గడువు ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం జిల్లాకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట తమ గోడును అర్థం చేసుకొని గడువును పెంచేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఉద్యాన రైతులు ఏం పాపం చేశారు.. ఉద్యాన పంటలకు రుణమాఫీ కల్పించలేకపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వర్షాధారం కింద ఉద్యాన పంటలు అయిన మిరప, ఇతర కూరగాయలు పంటలు సాగు చేస్తారు. వీటికి బ్యాంకులు పంట రుణాలు ఇస్తున్నాయి. కానీ ఉద్యాన పంటలకు రుణమాఫీ లేకపోవడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు. ఉద్యాన రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నిస్తున్నారు. ‘ముప్పై’ తిప్పలు రుణమాఫీ సంబంధించి రైతుల సమాచారాన్ని 31 కాలమ్స్‌లో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. 31 కాలమ్స్ ప్రకారం బ్యాంకులు సమాచారాన్ని సిద్ధం చేశాయి. అయితే మళ్లీ రైతు సాగు చేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలు పంపాలని ఆదేశించింది. దీనిని ఎన్ఐసీ అధికారులు రూపొందించి బ్యాంకులకు ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం ఈనెల 25 సాయంత్రానికి రుణమాఫీ వివరాలను పంపాలని బ్యాంకర్లను ఆదేశించింది. దీంతో బ్యాంకర్లు తలలు పట్టుకుంటున్నారు. వడ్డీ ‘మోత’ 2013 డిసెంబర్ 31 లోపు రుణాలు తీసుకుని అప్పటికి నిల్వ ఉన్న వాటికే మాఫీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2014 జనవరి నుంచి ఇప్పటివరకు అయిన వడ్డీని రైతులే భరించాలి. ఈ వడ్డీని వసూలు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. దీంతో బ్యాంకులు రుణమాఫీ వర్తించే రైతులను సైతం వడ్డీ చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. ఎస్బీఐ, ఏపీజీబీ, కేడీసీసీబీ, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులను సైతం వడ్డీ చెల్లించాలని నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వం నిర్ణయం వల్ల జిల్లా రైతులపై రూ.110 కోట్లు వడ్డీ భారం పడుతోంది. బీమా పాయె.. రుణమాఫీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులను పంటల బీమాకు దూరం చేసింది. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలను చెల్లించవద్దు... అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రైతులు రుణాలు చెల్లించలేదు. అధికారం చేపట్టాక రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు తాత్సారం చేశారు. ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో ఖరీఫ్‌లో రూ.2100 కోట్ల పంట రుణాలకు గాను రూ. 700 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఫలితంగా నాలుగు లక్షల మంది ఈ సారి పంటల బీమాకు దూరమయ్యారు. -
గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దుతా..
గంగదేవిపల్లి స్ఫూర్తితో ముందుకు సాగాలి ప్రతి పంచాయతీకి 10 లెడ్ లైట్లు ఇస్తాం సేంద్రియ వ్యవసాయం మేలు కలెక్టర్ గంగాధర కిషన్ గీసుకొండ : మండలంలోని మిగిలిన 16 పంచాయతీలను ఇదే బాటలో నడిపి రాష్ట్రంలోనే గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కలెక్టర్ గంగాధర కిషన్ హామీ ఇచ్చారు. గీసుకొండ మండలంలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని శనివారం ఆయన తొలిసారిగా సందర్శించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై గ్రామ సమగ్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గంగదేవిపల్లి సాధిం చిన విజయాలను ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ తెలుసుకుని.... తమ గ్రామాలు అలా ఎందుకు కాకూడదని ఆలోచించాలన్నారు. చాలా విషయాల్లో ఆదర్శంగా ఉన్న గంగదేవిపల్లిని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకోసం తన సహకారం ఉంటుందన్నారు. మన ఊరు-మన ప్రణాళిక కింద ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుందని, దీని వల్ల అభివృద్ధి త్వరితగతిన సాగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి పది లెడ్ వీధిలైట్లు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఆధార్‌కార్డు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని... అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. పంచాయతీల్లో ఇంటి, నీటి పన్నును తప్పకుండా చెల్లించాలని, సర్పంచ్‌లకు ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉన్నాయన్నారు. పన్నులు చెల్లిం చని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం చట్టప్రకారం పంచాయతీలకు ఉందన్నారు. పంటలపై పురుగుల మందులను అతిగా వాడితే అనర్థాలుంటాయని, గంగదేవిపల్లె రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ఆకాంక్షిం చారు. కూరగాయల పెంపకం చేపడితే రైతు బజార్లో గ్రామస్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రతి ఇంటివద్ద వర్మీ కంపోస్టు బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి... గంగదేవిపల్లిగ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, లింక్‌రోడ్లు వేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పందుల కుంటను స్టోరేజ్ ట్యాంకుగా ఏర్పాటు చేస్తామని, డంపింగ్ యార్డు తప్పనిసరిగా ఉండాలని.. ఈ మేరకు సర్వే చేసి ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రజావసరాలకు ఉపయోగించేలా చూడాలని గీసుకొండ తహసీల్దార్ మార్గం కుమారస్వామిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలకు రెండు అదనపు తరగతి గదులు మంజూరు చేస్తానని, వీటికి సంబంధించిన ఎస్టిమేట్లను త్వరలో వేసి తీసుకుని రావాలని అధికారులు, సర్పంచ్‌కు సూచించారు. కాగా, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, అపార్డు ట్రైనింగ్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. సమావేశంలో ఎంపీడీఓ పారిజాతం, ఈఓపీఆర్డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి, గ్రా మ అదర్శ అధికారి తిలక్‌గౌడ్, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ వేల్పుల సురే స్, సర్పంచ్ కూసం లలిత, ఉపసర్పంచ్ కూసం రాజమౌళి, పంచాయతీ కార్యదర్శులు శైలజ, వేణుప్రసాద్, ఐకేపీ సీసీ ర వీందర్‌రాజు, సింగిరెడ్డి జ్యోతి, గోనె కు మారస్వామి,చల్ల మలయ్య పాల్గొన్నారు.