నో స్టాక్ | No stock | Sakshi
Sakshi News home page

నో స్టాక్

Published Wed, Oct 1 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

నో స్టాక్

నో స్టాక్

అక్టోబర్‌లో దసరా, బక్రీద్, దీపావళి పండుగలు
 ఆరు నెలలుగా పంపిణీ లేని పామాయిల్
 రెండు నెలలుగా అందని కందిపప్పు

 
 కర్నూలు: అక్టోబర్ నెలలో దసరా, బక్రీద్, దీపావళి పండుగలు ఉన్నాయి. పండుగ వేళ పిండి వంటలు చేసుకోవడానికి కావాల్సిన వంట నూనె, కంది పప్పు పంపిణీ లేకపోవడంతో పేదలు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ఆరు నెలలుగా వంట నూనె సరఫరా కాకపోయినా పట్టించుకునే వారే లేరు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన ఈ సమస్యను అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో పేదలకు పామాయిల్ అందని పరిస్థితి నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్డు వినియోగదారులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కందిపప్పు కూడా రెండు నెలలుగా సరఫరా చేయడం లేదు. కందిపప్పు ఎప్పుడొస్తుందోనని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 11.50 లక్షల పేద కుటుంబాల్లో పండుగ కళ కన్పించడంలేదు.

 జిల్లాలో 11.50 లక్షల తెల్ల రేషన్‌కార్డుదారులుండగా వీరికి ప్రతి నెల బియ్యం, కిరోసిన్, పంచదార, పామాయిల్, కందిపప్పు వంటివి సరఫరా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బియ్యం, కిరోసిన్ యధావిధిగా సరఫరా చేస్తున్న పౌర సరఫరాల శాఖ పామాయిల్, కందిపప్పును మాత్రం పట్టించుకోవడం మానేసింది. కార్డుకు కేజీ పామాయిల్ చొప్పున 11.50 లక్షల కిలోల పామాయిల్ సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో పామాయిల్ రూ.65 వరకు ధర పలుకుతుండగా రేషన్ దుకాణాల్లో మాత్రం రూ.40కే విక్రయిస్తారు. వీటికి కూడా రాయితీల విధానం ఉంది. సాధారణ ధరకే అంటే బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర ఉందో అంతే ధరకు దీనిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అందులో రూ.10 రాయితీని కేంద్ర ప్రభుత్వం రూ.13 రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి.

ఇలా రూ.23 పోగా మిగిలిన సొమ్ముకు అంటే రూ.40 కి కిలో పామాయిల్‌ను పేదలకు అందిస్తున్నారు. గత ఆరు నెలలుగా పేదలకు పామాయిల్ అందడం లేదు. సాధారణంగా మలేషియా నుంచి కాకినాడ పోర్టుకు పామాయిల్ దిగుమతి అవుతండగా ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది. కాకినాడ రీఫైనరీల్లో కావాల్సినంత పామాయిల్ అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ రాకపోవడం వల్ల సరఫరా ఆగిపోయింది. కేంద్రం భరించాల్సిన రూ.10 సబ్సిడీపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సమాచారం అందించకపోవడంతో పామాయిల్ సరఫరా జరగడం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.

 కందిపప్పు పరిస్థితి ఇదే..
 పేదలకు ఇచ్చే సబ్సిడీ సరుకుల్లో కందిపప్పు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లాలో 11.50 లక్షల కిలోలు సరఫరా చేయాలి. రేషన్ దుకాణంలో కందిపప్పు కిలో రూ.50కి ఇస్తుండగా బహిరంగ మార్కెట్‌లో ధర రూ.70 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకే కాంట్రాక్టర్‌కు కందిపప్పు సరఫరా అప్పగించారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ కందిపప్పు సరఫరా చేయలేకపోవడంతో పేదలకు అందడం లేదు. పంచదార సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క కార్డుదారునికి అర కిలో చొప్పున పంపిణీ జరుగుతుండగా ముందుగా ఎవరు వస్తే వారికే అనే రీతిలో పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులందరికీ అందడం లేదు. ఇటువంటి చిన్న ఇబ్బందులు పరిష్కరించడం ద్వారా పేదలకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. దీనిపై అధికారులు కూడా దృష్టి సారించడం లేదు. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే దసరా, బక్రీద్, దీపావళి పండుగలకు సబ్సిడీ సరుకులు అందుకోవచ్చునని కార్డుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

జన్మభూమిలో నిలదీసేందుకు వామపక్షాలు సిద్ధం..
అధికారుల పర్యవేక్షణ లేక జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో నిలదీసేందుకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. చౌక డిపో డీలర్లు నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో కొంతకాలంగా పామాయిల్, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరగడంలేదు. జన్మభూమిలో అధికార యంత్రాంగాన్ని నిలదీయడం ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం వాటి అనుబంధ ప్రజా సంఘాల నాయకులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి జన్మభూమిలో అధికారులను నిలదీసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు.
 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement