రుణమాఫీకి నిబంధనాలు | Runamaphiki Conditions | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి నిబంధనాలు

Published Wed, Sep 24 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

రుణమాఫీకి నిబంధనాలు

రుణమాఫీకి నిబంధనాలు

ఆధార్ కార్డు తప్పనిసరి రేషన్ కార్డూ ఉండాల్సిందే
 
 నందికొట్కూరుకు చెందిన సుదర్శన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి 2013లో రుణం తీసుకున్నాడు. ఈయన ఆధార్ కోసం నాలుగు సార్లు వివరాలు నమోదు చేయించుకున్నాడు. కానీ యూఐడీ నంబరు రాలేదు. దీంతో రుణమాఫీకి అర్హత పొందలేకపోయాడు.
 
 ప్యాపిలికి చెందిన క్రిష్టన్న అక్కడి పీఎసీఎస్ నుంచి గతేడాది పంట రుణం తీసుకున్నాడు. ఈయనకు రేషన్‌కార్డు లేదు. రేషన్‌కార్డు కోసం గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ కార్యక్రమం జరిగిన ప్రతిసారీ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ కార్డు రాలేదు. రేషన్‌కార్డు రాలేదనే కారణంతో రుణమాఫీకి అర్హత పొందలేకపోయాడు.
 
 కర్నూలు(అగ్రికల్చర్):
 రుణమాఫీకి విధిగా ఆధార్, రేషన్‌కార్డు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీకి దూరమవుతున్నారు. ఎల్‌డీఎం(లీడ్ డిస్ట్రిక్ మేనేజర్) రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో రుణమాఫీకి అర్హత కలిగిన  రైతులు 5.75 లక్షల మంది ఉన్నారు. అయితే ఆధార్, రేషన్ కార్డు లింకప్ చేయడంతో వారిలో 20 శాతానికి పైగా అనర్హులుగా మిగులుతున్నారు. రేషన్‌కార్డు ఉంటే ఆధార్ లేకపోవడం, ఆధార్ ఉంటే రేషన్‌కార్డు లేకపోవడంతో దాదాపు లక్షల మంది రైతుల వివరాలు నమోదు కాలేదు. గడువు ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం జిల్లాకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట తమ గోడును అర్థం చేసుకొని గడువును పెంచేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.   
 ఉద్యాన రైతులు ఏం పాపం చేశారు..
 ఉద్యాన పంటలకు రుణమాఫీ కల్పించలేకపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వర్షాధారం కింద ఉద్యాన పంటలు అయిన మిరప, ఇతర కూరగాయలు పంటలు సాగు చేస్తారు. వీటికి బ్యాంకులు పంట రుణాలు ఇస్తున్నాయి. కానీ ఉద్యాన పంటలకు రుణమాఫీ లేకపోవడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు. ఉద్యాన రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నిస్తున్నారు.
 ‘ముప్పై’ తిప్పలు
 రుణమాఫీ సంబంధించి రైతుల సమాచారాన్ని 31 కాలమ్స్‌లో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. 31 కాలమ్స్ ప్రకారం బ్యాంకులు సమాచారాన్ని సిద్ధం చేశాయి. అయితే మళ్లీ రైతు సాగు చేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలు పంపాలని ఆదేశించింది. దీనిని ఎన్‌ఐసీ అధికారులు రూపొందించి బ్యాంకులకు ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం ఈనెల 25 సాయంత్రానికి రుణమాఫీ వివరాలను పంపాలని బ్యాంకర్లను ఆదేశించింది. దీంతో బ్యాంకర్లు తలలు పట్టుకుంటున్నారు.
 వడ్డీ ‘మోత’
 2013 డిసెంబర్ 31 లోపు రుణాలు తీసుకుని అప్పటికి నిల్వ ఉన్న వాటికే మాఫీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2014 జనవరి నుంచి ఇప్పటివరకు అయిన వడ్డీని రైతులే భరించాలి. ఈ వడ్డీని వసూలు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. దీంతో బ్యాంకులు రుణమాఫీ వర్తించే రైతులను సైతం వడ్డీ చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. ఎస్‌బీఐ, ఏపీజీబీ, కేడీసీసీబీ, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులను సైతం వడ్డీ చెల్లించాలని నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వం నిర్ణయం వల్ల జిల్లా రైతులపై రూ.110 కోట్లు వడ్డీ భారం పడుతోంది.
 బీమా పాయె..
 రుణమాఫీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులను పంటల బీమాకు దూరం చేసింది.   ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలను చెల్లించవద్దు... అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రైతులు రుణాలు చెల్లించలేదు. అధికారం చేపట్టాక రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు తాత్సారం చేశారు. ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో ఖరీఫ్‌లో రూ.2100 కోట్ల పంట రుణాలకు గాను రూ. 700 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఫలితంగా నాలుగు లక్షల మంది ఈ సారి పంటల బీమాకు దూరమయ్యారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement