
ప్రతి బుధవారం పీలేరు పశువుల సంతలో పశువులను కొన్న మనుషులు వాటిని తరలించేందుకు మాత్రం రాక్షసత్వాన్ని వాడుతున్నారు. పశువులను ఇతర ప్రాంతాలకు తరలించేటపుడు లారీలలో 10 నుంచి 12, మినీలారీలో 8, క్యాబ్‌లో 4, ఇతర వాహనాల్లో అయితే వాటి కెపాసిటీ మించకుండా పశువులను తరలించాల్సి ఉంటుంది. అయితే పీలేరు మార్కెట్ కమిటీ అధికారులు నిబంధనలకు తిలోదకాలు వదలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక గేట్ నిర్వాహకులేమో ‘ఎవరేమనుకుంటే మాకేంటి..ఇవ్వాల్సింది ఇచ్చేయండి..లోడ్ మీ ఇష్టం’ అన్న తరహాలో వ్యవహరిస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు.
పీలేరు: వారపు సంతకెళ్లి రకరకాల కూరగాయలు కొని సంచిలో వేసుకున్నట్టు పశువులను కొని మూట చుట్టేస్తున్నారు. పశువులను ఒకదానిపై ఒకటి కట్టిపడేసి ఎవరికీ అనుమానం రాకుండా వాహనాల చుట్టూ టార్పాలిన్æ పట్టలు, ప్లాస్టిక్ కవర్లతో కప్పివేస్తున్నారు. దీంతో ఊపిరి ఆడక పశువులు నరకం చూస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పీలేరు మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది తీరుపై ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు గుప్పుమంటున్నాయి.
మూగవేదన వినబడదా?
పీలేరు మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రతి బుధవారం పశువుల సంత నిర్వహిస్తున్నారు. వారపు సంతకు వచ్చే పశువుల రేటులో ఒక శాతం గేటు వసూలు చేసేవారు. అయితే ఇష్టారీతిన పశువులను తరలించడానికి వీలు లేదు. కానీ లారీల్లో ఊపిరి ఆడక పశువులు కొట్టుమిట్టాడుతూ చేసే మూగవేదన మార్కెట్ అధికారులకు, వ్యాపారులకు వినబడడం లేదు. చేయి తడిపితే చాలు ఒక్కో వాహనంలో ఎన్ని పశువులు లోడ్ చేసినా ఫర్వాలేదన్న రీతిలో అధికారుల వ్యవహరించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
‘మాకేం కొత్తకాదు’
నిబంధనలకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో పశువులను తరలిస్తున్నారేంటని ప్రశ్నిస్తే ‘మీకు ఏం కావాలి, ఎవరు మీరు, ఇదేం మాకు మొదటి సారి కాదు’ అంటూ వాహనదారులు ప్రశ్నల పరంపర కురిపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అదునుగా భావించిన పలువురు తమిళనాడుకు చెందిన వ్యాపారులు కారు చౌకగా పశువులను కొని వేలూరు, గుడియాత్తం, పుంగనూరు తదితర ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. అదిగాక వారపు సంతలో ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని నామమాత్రపు బిల్లులు రాసి పంపేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యాపారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కెపాసిటీ మేరకే...
వారపు సంతలో కొనుగోలు చేసిన పశువులను వాహనాల కెపాసిటీ మేరకే తరలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పశువులను లోడ్ చేస్తే ఒప్పుకోం. ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఎవరూ చేతివాటం చూపినట్లు నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా. -ఎస్. అక్బర్‌బాషా, సెక్ర టరీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పీలేరు
Comments
Please login to add a commentAdd a comment