రవాణాకు జీఎస్టీ బ్రేకులు
– ఆందోళనలో లారీల యజమానులు
– జిల్లాపై రూ.13.22 కోట్ల అదపు భారం
– ఆకస్మిక తనిఖీలు జరిగితే ఇబ్బందులే
– 3.5శాతం పెరగనున్న స్పేర్ పార్ట్స్ ధరలు
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): రేపటి నుంచి జీఎస్టీ అమలవుతుండటంతో లారీల యజమానుల్లో గుబులు మొదలైంది. జీఎస్టీ సూచిస్తున్న నిబంధనలను చూసి షాక్ అవుతున్నారు. ఒప్పుటికే ఒడిదుడుకుల మధ్య ఉన్న రవాణా రంగంపై జీఎస్టీ పిడుగు పడుతుంటడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా లారీలు ఉన్నాయి. ఒకొక్క ట్రక్కు, లారీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 నుంచి 10 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వాటి విడిభాగాలపై గతంలో ఎక్సైజ్ డ్యూటీ 10 శాతం, వ్యాట్ 14.5 శాతం ఉండేది. అయితే ఇప్పుడు లారీ విడిభాగాలపై 28 శాతం పన్ను విధించారు. దీంతో విడిభాగాల పై 3.5 శాతం పన్ను భారం పెరిగింది. ఒకొక్క లారీకి ఏడాదికి కనీసం రూ. రెండున్నరల లక్షల వరకు విడిభాగాల కింద ఖర్చు చేస్తారు. అంటే పన్ను పెంపుతో ఓ లారీపై సుమారుగా రూ.8,750 వరకు అదనపు భారం పడుతుంది. ఈ లెక్కన ఏడాదికి కనీసం రూ.13.22 కోట్ల వరకు జిల్లా లారీ యజమానులు భరించాల్సి ఉంటుంది. అయితే ఆమేరకు లారీ అద్దెలు పెరగడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఒక వైపు డీజిల్ ధరల పెరుగుదల, మరో వైపు స్పేర్ పార్టులపై పన్నుల భారం మోపితే ఇక వాహనాలను మూలన పెట్టాల్సిందేనని వారు చెబుతున్నారు.
లారీ యజమానుల సమస్యలు..:
ఏటా టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారని జీఎస్టీలో పేర్కొన్నారు. వాస్తవంగా రెండు లారీలు ఉన్న వారు కూడా ఏదికి రూ.20 లక్షల పైనే టర్నోవర్ చేస్తారు. అయితే అందులో డీజిల్ ఖర్చులు, సిబ్బంది జీతాలు, లారీ మెయిన్‌టెన్స్ పోతే రెండు లారీల మీద నెలకు రూ.25 వేలు రావడం గగనంగా ఉంది. అంటే ఏటా మూడు లక్షల కంటే ఆదాయం రాదు. అటువంటి వారిని జీఎస్టీ పరిధిలో చేర్చడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
-
జీఎస్టీ అమలులోకి రాగానే చెక్ పోస్టులు తీసి వేస్తారు అయితే ప్రతి రాష్ట్రంలో 40 నుంచి 50 బృందాలను పెట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. లారీని మధ్యలో ఆపి తనిఖీ పేరుతో డ్రైవర్లను వేధించి వేలాది రూపాయలను లంచాలు వసూలు చేసే ప్రమాదం ఉంది.
-
కొన్ని రాష్ట్రాల్లో ఈ చలనాలు జారీ చేస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు ఇంకా మాన్యువల్‌గానే ఈ వే బిల్లులు ఇస్తున్నాయి. ఇప్పుడు జీఎస్టీ అమలులోకి వస్తే మ్యాన్యువల్ వే–బిల్లులు ఆన్‌లైన్‌లో కనపడవు. దీంతో లారీని సీజ్ చేస్తే సరుకు పాడైపోవడంతో పాటు లారీ దెబ్బతినే ప్రమాదం ఉంది.
-
లారీలో సింగిల్ కన్సయిన్‌మెంట్ ఉంటే దాన్ని నిర్ణీత సమయంలో గమ్య స్థానానికి చేర్చాలనే నిబంధన జీఎస్టీలో పెట్టారు. నిర్ణీత వ్యవధి దాటితే వే బిల్లు ఉన్నప్పటికీ లేదని భావించి లారీని సీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే లారీ మరమ్మతులు, ట్రాఫిక్ ఇబ్బందులు తదితర కారణాలతో ఆలస్యమైనా, దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే లారీయజమానులు కష్టాల పాలవుతారు.
-
గతంలో లారీలో వే బిల్లు లేని సరుకు, అక్రమంగా సరుకు రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకుంటే, లారీ యజమాని సరుకు అప్పజెప్పి లారీని తెచ్చుకునే వారు. అయితే ఇప్పుడు జీఎస్టీ ప్రకారం లారీని కూడా సీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో లారీ యజమానులు నష్టపోయే ప్రమాదం ఉంది.
డీజిల్, పెట్రోల్‌నూ జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలి:
డీజిల్, పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 23 శాతం, వ్యాట్ 34 శాతం ఉంది. అంటే మొత్తం పన్ను 57శాతం అవుతోంది. అదే జీఎస్టీ పరిధిలోకి వస్తే అత్యధికంగా 28 శాతం పన్ను ఉంటుంది. ఈ లెక్కన డీజిల్ ఖర్చులు సగానికి తగ్గిపోతాయి. దీంతో ఈ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకరాలేదు. కాగా వ్యాట్ ఛార్జీలు పెంచినప్పుపడు లీటర్‌కు రెండు రూపాయలు తగ్గిస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం లారీ యజమానులకు హామీ ఇచ్చింది. అయితే అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.
లారీలను అమ్ముకోవాల్సిందే: వై.నారాయణరెడ్డి, లారీ ఓనర్, డోన్
ఓ వైపు జీఎస్టీ, పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలైంది. జీఎస్టీ కారణంగా లారీ విడిభాగాల ధర రెట్టింపు కావడంతో లారీ నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో నష్టాలు భరించలేక లారీలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. లారీపై ఆధారపడి జీవనం సాగించే పలువురు ఉపాధిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.