reservations hike bill
-
రిజర్వేషన్ల అగ్గి
ఏదైనా చేయదల్చుకున్నప్పుడు ఎన్ని వివాదాలు ఎదురైనా నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో తనకెవరూ సాటిరారని నిరూపించుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విద్య, ఉద్యోగావకాశాల్లో వెనకబడిన ముస్లింలు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు పెంచే కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. శాసనసభలో ఆదివారం ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతూ ఆయనన్నట్టు ఇది చరిత్రాత్మకమైనదే. 119మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి చెందిన అయిదుగురు మినహా మిగిలినవారంతా ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. త్వరలో ఎస్సీ, బీసీల కోటాను పెంచే ప్రక్రియ కూడా మొదలుపెడతామని కేసీఆర్ అంటున్నారు. కుల వ్యవస్థ కారణంగా మన దేశంలో శతాబ్దాల నుంచి వేళ్లూనుకున్న అసమానతలను పారదోలడానికి రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన పలు మార్గాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఒకటి. విచారకరమైన అంశమేమంటే, స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఆ వర్గాలవారి స్థితిగతులు పెద్దగా మారింది లేదు. ముఖ్యంగా కొన్ని అణగారిన కులాలవారు, ఆదివాసీలు ఈనాటికీ తమకు లభించిన కోటాను అటు చదువుల్లో కావొచ్చు... ఇటు ఉద్యోగావకాశాల్లో కావొచ్చు సంపూర్ణంగా వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు. మరోపక్క వేరే మతంలో ఉంటున్నా ఇదే తరహా వివక్ష ఎదుర్కొంటున్న వారి ఉద్ధరణను ప్రభు త్వాలు పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ముస్లింలలోగానీ, క్రైస్తవుల్లోగానీ అత్యధిక శాతంమందికి చెందిన పూర్వీకులు హిందూ దళితులు, వెనకబడిన వర్గాలవారేనని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వీరికి ఎలాంటి ఆసరా కల్పించాలన్న విషయంలో అనేక వివాదాలున్నాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగం మాట్లాడలేదు గనుక ఆ వర్గాలకు కోటా వర్తింపజేయడం సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సామాజిక, ఆర్ధిక వెనకబాటు ప్రాతిపదికగా దేశంలోనే తొలిసారి ముస్లిం గ్రూపులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2004లో ఉత్తర్వులు జారీచేశారు. ఒకసారి హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేశాక మరు సటి సంవత్సరం మరోసారి జీవో జారీచేశారు. దాన్ని కూడా కాదన్నాక బీసీ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించి ఆ సిఫార్సుల ప్రాతిపదికన ముస్లింలను బీసీ-ఈ జాబితాలో చేర్చి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో చట్టం తీసుకొచ్చారు. దాన్ని సైతం రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చాక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ రిజ ర్వేషన్లు కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం 2010లో మధ్యంతర ఆదే శాలు జారీ చేసింది. ఇప్పటికీ ఆ ఆదేశాలే అమల్లో ఉన్నాయి. దేశంలో భిన్న వర్గాల్లో చైతన్యం పెరిగింది. సమాజంలో తాము కూడా అందరిలా ఎదగాలని, గౌరవప్రదంగా బతకాలని, అడ్డంకుల్ని అధిగమించాలని ఆకాంక్షిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. తమకూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కాపులు, పటేళ్లు, గుజ్జర్లు, జాట్లు, మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు. వివిధ వర్గాల సామాజిక స్థితిగతులపై లోతైన సమీక్ష జరిపి, లోటుపాట్లను సరిచేయడానికి తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని పదే పదే తలెత్తుతున్న ఈ ఆందోళనలన్నీ తెలియజెబుతున్నాయి. ముస్లింలతోసహా సామాజికంగా, విద్యాపరంగా వెనక బడిన వర్గాల వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవడం అవసరమేనని ఆదివారం భువనేశ్వర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభిప్రాయపడ్డారు. ముస్లింలలో వెనకబడినవారి సంఖ్య ఎక్కువేనని అంగీకరించడమేకాక... ఓబీసీలపై జరిగే చర్చలో ముస్లింలను భాగం చేయాలని కూడా సూచించారు. ఇది కేసీఆర్ ప్రయత్నానికి నైతికబలం ఇచ్చే పరిణామం. పదేళ్లక్రితం జస్టిస్ రాజేంద్ర సచార్ నేతృత్వంలోని కమిటీ వెలువరించిన నివేదిక మన దేశంలో ముస్లింల స్థితిగతులను వెల్లడించింది. సామాజిక వెనక బాటుతనంలో ముస్లింలు షెడ్యూల్ కులాలు, తెగలకన్నా దయనీయంగా ఉన్నారని గణాంక సహితంగా తెలిపింది. సివిల్ సర్వీస్ అధికారుల్లో ఆ వర్గాలవారు మూడు శాతానికి మించిలేరని, ప్రభుత్వోద్యోగాల్లో అయిదు శాతం మించరని తెలిపింది. విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడి చిన్నా చితకా వృత్తులు చేసుకుంటూ పొట్ట పోషించుకునేవారు ముస్లింలలో అధికం. హిందువుల్లోని వెనకబడిన వర్గాలకూ, వీరికీ ఆర్ధిక సామాజిక స్థితిగతుల్లో ఎలాంటి వ్యత్యాసమూ లేదు. అలాంటపుడు కేవలం ముస్లింలన్న కారణంగా ఆ వర్గాల అభ్యున్నతిని విస్మరించడం అమాన వీయం అవుతుంది. ప్రస్తుత రిజర్వేషన్ల బిల్లు చకచకా ముందుకు కదిలి వెనువెంటనే చట్టరూపం తీసుకుంటుందని చెప్పలేం. అందుకు ఎన్నో అవరోధాలున్నాయి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడం కోసం బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రాన్ని కోరతామని కేసీఆర్ చెబుతున్నారు. 69శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న తమిళనాడు, 73 శాతం వరకూ అమలు చేస్తున్న జార్ఖండ్ ఈ బాటనే ఎంచుకున్నాయి. కోటా 50 శాతం మించరాదన్న 1992నాటి సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడమే వాటి ఉద్దేశం. అయితే ఏ చట్టమైనా రాజ్యాంగ మౌలిక స్వరూ పానికి భిన్నంగా ఉన్నదని భావించిన పక్షంలో న్యాయసమీక్ష జరిపేందుకు 9వ షెడ్యూల్ తమకు అవరోధమేమీ కాదని 2007లో సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇదెంత వరకూ అక్కరకొస్తుందో అనుమానమే. పైగా ఏ చట్టాన్నయినా 9వ షెడ్యూ ల్లో చేర్చాలంటే పార్లమెంటు ఆమోదంతోపాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో సగానికిపైగా అందుకు ఒప్పుకోవాలి. బీజేపీ నిరసనల సంగతలా ఉంచి ప్రస్తుత రిజర్వేషన్ల బిల్లు ఇన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. ముస్లింలలో వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతికి తోడ్పడే ఇలాంటి చర్యలు విజయవంతం కావాలని ప్రజాస్వా మికవాదులంతా ఆకాంక్షిస్తారు. -
నేడు అసెంబ్లీ
- ఉదయం 11 గంటలకు శాసన సభ, సాయంత్రం 4 గంటలకు మండలి - ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం - రెండూ కలిపి ఒకే బిల్లుగా ఎలా పెడతారు? - బీఏసీ భేటీలో ప్రశ్నించిన బీజేపీ - ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశట్టనుంది. శనివారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీకి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి హాజరు కాలేదు. ఆ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి హాజరవగా.. బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ పాల్గొన్నారు. రిజర్వేషన్ల పెంపుతోపాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ఆదివారం సభలో ప్రవేశపెట్టనుంది. ఒకే బిల్లుగా పెట్టడంపై బీజేపీ అభ్యంతరం ముస్లిం రిజర్వేషన్ల పెంపు బిల్లును ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి ఒకే బిల్లుగా ప్రవేశపెట్టే ప్రతిపాదనను బీఏసీ సమావేశంలో బీజేపీ వ్యతిరేకించింది. తాము ముస్లింల రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తామని, అదే సమయంలో ఎస్టీల రిజర్వేషన్‌ను సమర్థిస్తామని ఆ పార్టీ శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నట్టు తెలిసింది. ఒకే బిల్లుగా కలిపి పెట్టడం సరికాదన్నారు. అసలు ఆదివారం సమావేశాలు ఎలా పెడతారని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు త్వరలో పార్టీ ప్లీనరీ ఉందని, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయని, పార్టీ పనులు ఉన్నందున త్వరగా సమావేశాన్ని ముగించాలనుకున్నామని అధికార పార్టీ సభ్యులు జవాబిచ్చారని తెలిసింది. కనీసం రెండ్రోజులపాటు సభలు జరపాలని కాంగ్రెస్ కోరగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. సభ్యుల ఇంటికే బిల్లు కాపీలు బిల్లు కాపీ కూడా చూడకుండా ఎలా చర్చలో పాల్గొంటామని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు శనివారం రాత్రే బిల్లు ప్రతులు సభ్యులకు అందజేస్తామని, సభను ఉదయం 10 గంటలకు కాకుండా 11 గంటలకు ప్రారంభిద్దామని, బిల్లును చదవడానికి సమయం సరిపోతుందని అధికార పార్టీ సర్ది చెప్పినట్లు సమాచారం. బిల్లును సభలో టేబుల్ చేయకుండా నేరుగా సభ్యులకు ముందే ఇవ్వడాన్ని నిబంధనలు అంగీకరించవని, కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేశారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు టీడీపీ సభ్యులను బడ్జెట్ సెషన్ నుంచి సస్పెండ్ చేసినందున... బీఏసీలో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్యను బయటకు పంపించారు. ఆహ్వానం పంపి, అక్కడకు వెళ్లాక ఎలా పంపేస్తారని సండ్ర, రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. దీనిపై స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి తమ నిరసన తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మండలి శాసన మండలిలో కూడా చైర్మన్ స్వామిగౌడ్ చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మండలి సమావేశం ప్రారంభం కానుంది. మొదట జీఎస్టీ, తెలంగాణ హెరిటేజ్ బిల్లులపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి రిజర్వేషన్ల చట్టం బిల్లు అందాక.. తిరిగి మండలి సమావేశమవుతుంది. -
ముస్లింలకు 12%.. ఎస్టీలకు 10%
-
ముస్లింలకు 12%.. ఎస్టీలకు 10%
-
ముస్లింలకు 12%.. ఎస్టీలకు 10%
రిజర్వేషన్ల పెంపుపై ముసాయిదా బిల్లుకు రూపకల్పన - నేటి రాష్ట్ర కేబినెట్ భేటీలో తుది నిర్ణయం - రేపు అసెంబ్లీ, మండలిలో బిల్లు - తమిళనాడు తరహాలో అవకాశమివ్వాలని తీర్మానం - రాష్ట్రంలో మొత్తంగా 62 శాతానికి చేరుకోనున్న రిజర్వేషన్లు సాక్షి, హైదరాబాద్ విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 8 శాతం (మొత్తం 12%), గిరిజనులకు 4 శాతం (మొత్తం 10%) చొప్పున రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లు పెంచుకునేందుకు తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు ముసాయిదా బిల్లు రూపొందించింది. వీటిపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోద ముద్ర వేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ శనివారం సమావేశమవనుంది. కేబినెట్ భేటీలో తీసుకునే తుది నిర్ణయం మేరకు రిజర్వేషన్ల శాతం ఖరారవుతుంది. మూడ్రోజుల కిందట బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించి రిజర్వేషన్ల పెంపుపై మంత్రివర్గం విధాన నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ ఆమోదించిన బిల్లును ఆదివారం జరిగే అసెంబ్లీ, మండలి సమావేశంలో ప్రవేశపెడతారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లను పెంచేందుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లింలకు (బీసీ–ఈ కోటా) 4 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తాజా పెంపుతో ముస్లింల రిజర్వేషన్లు 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి చేరతాయి. కేబినేట్లో తీసుకునే నిర్ణయం మేరకు ఒక శాతం అటుఇటుగా ముసాయిదా బిల్లును ఆమోదించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిఫారసు 9 నుంచి 12 శాతం ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఈ నెల 12 జరిగిన భేటీలోనే మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరచినట్లుగా ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లను పెంచి తీరుతామని ముఖ్యమంత్రి అదే రోజున స్పష్టం చేశారు. బీసీ కమిషన్, చెల్ల్లప్ప కమిషన్, సుధీర్ కమిషన్ నివేదికలను పరిశీలిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్రంలోని ముస్లింల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ ముస్లింల రిజర్వేషన్లను కనీసం 9 నుంచి 12 శాతం పెంచాలని సిఫారసు చేసింది. ఎస్టీల సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన చెల్లప్ప కమిషన్ వారి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరింది. ఈ నేపథ్యంలో ముస్లింలు, ఎస్టీలకు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్లను పెంచనుంది? న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది? అన్న ఉత్కంఠ నెలకొంది. 62 శాతానికి రిజర్వేషన్లు..! ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకు మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తాజా ముసాయిదా ప్రకారం ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుతో ఇది 62 శాతానికి చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో ఎస్సీలకు, బీసీలకు సైతం త్వరలోనే రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీలకు ఒక శాతం రిజర్వేషన్ పెంచే అవకాశమున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవలే సూచనప్రాయంగా వెల్లడించారు. బీసీలకు ఎంత మేరకు రిజర్వేషన్లను పెంచాలనే అంశంపై అధ్యయనం చేసే బాధ్యతలను బీసీ కమిషన్‌కు అప్పగించారు. 2011 జనాభానే ప్రాతిపదిక రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం పరిగణనలోకి తీసుకునే 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సూచనల మేరకు తమిళనాడు అనుసరించిన వ్యూహాన్ని పక్కాగా అనుసరించనుంది. ప్రస్తుతం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభాలో 12.7 శాతం ముస్లింలున్నారు. వీరిలో 81 శాతం వెనుకబడిన కేటగిరీలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 9.08 శాతం ఉన్నారు. తమను కూడా ఎస్టీల్లో చేర్చాలని వాల్మీకి బోయ, కాయితీ లంబాడాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు కులాలను ఎస్టీల్లో చేరిస్తే వీరి జనాభా 10 శాతానికి చేరనుంది. ఆరేళ్ల కిందటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు జరుగుతుందా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా..? అనేది కేబినెట్లో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎజెండాలో 40 అంశాలు ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుతో సహా దాదాపు 40 అంశాలు శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. గతేడాది జూలై నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన 3.68 శాతం డీఏ ఫైలుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. మత్స్య కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.లక్ష నుంచి రూ.4 లక్షలకు పెంచే ప్రతిపాదనపై చర్చించనున్నారు. సాయిసింధ్ కేన్సర్ హాస్పిటల్‌కు భూ కేటాయింపు అంశం, హోంశాఖలో కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్న 105 మంది పోలీస్ అధికారుల పదోన్నతుల ప్రతిపాదనలను మంత్రివర్గం పరిశీలించనుంది. కేంద్ర ప్రభుత్వం పంపిన జీఎస్టీ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.