
నేడు అసెంబ్లీ
- ఉదయం 11 గంటలకు శాసన సభ, సాయంత్రం 4 గంటలకు మండలి
- ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- రెండూ కలిపి ఒకే బిల్లుగా ఎలా పెడతారు?
- బీఏసీ భేటీలో ప్రశ్నించిన బీజేపీ
- ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశట్టనుంది. శనివారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన చాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ భేటీకి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి హాజరు కాలేదు. ఆ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి హాజరవగా.. బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ పాల్గొన్నారు. రిజర్వేషన్ల పెంపుతోపాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ఆదివారం సభలో ప్రవేశపెట్టనుంది.
ఒకే బిల్లుగా పెట్టడంపై బీజేపీ అభ్యంతరం
ముస్లిం రిజర్వేషన్ల పెంపు బిల్లును ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి ఒకే బిల్లుగా ప్రవేశపెట్టే ప్రతిపాదనను బీఏసీ సమావేశంలో బీజేపీ వ్యతిరేకించింది. తాము ముస్లింల రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తామని, అదే సమయంలో ఎస్టీల రిజర్వేషన్‌ను సమర్థిస్తామని ఆ పార్టీ శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నట్టు తెలిసింది. ఒకే బిల్లుగా కలిపి పెట్టడం సరికాదన్నారు. అసలు ఆదివారం సమావేశాలు ఎలా పెడతారని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు త్వరలో పార్టీ ప్లీనరీ ఉందని, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయని, పార్టీ పనులు ఉన్నందున త్వరగా సమావేశాన్ని ముగించాలనుకున్నామని అధికార పార్టీ సభ్యులు జవాబిచ్చారని తెలిసింది. కనీసం రెండ్రోజులపాటు సభలు జరపాలని కాంగ్రెస్ కోరగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.
సభ్యుల ఇంటికే బిల్లు కాపీలు
బిల్లు కాపీ కూడా చూడకుండా ఎలా చర్చలో పాల్గొంటామని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు శనివారం రాత్రే బిల్లు ప్రతులు సభ్యులకు అందజేస్తామని, సభను ఉదయం 10 గంటలకు కాకుండా 11 గంటలకు ప్రారంభిద్దామని, బిల్లును చదవడానికి సమయం సరిపోతుందని అధికార పార్టీ సర్ది చెప్పినట్లు సమాచారం. బిల్లును సభలో టేబుల్ చేయకుండా నేరుగా సభ్యులకు ముందే ఇవ్వడాన్ని నిబంధనలు అంగీకరించవని, కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేశారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు టీడీపీ సభ్యులను బడ్జెట్ సెషన్ నుంచి సస్పెండ్ చేసినందున... బీఏసీలో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్యను బయటకు పంపించారు. ఆహ్వానం పంపి, అక్కడకు వెళ్లాక ఎలా పంపేస్తారని సండ్ర, రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. దీనిపై స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి తమ నిరసన తెలిపారు.
సాయంత్రం 4 గంటలకు మండలి
శాసన మండలిలో కూడా చైర్మన్ స్వామిగౌడ్ చాంబర్‌లో బీఏసీ భేటీ జరిగింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మండలి సమావేశం ప్రారంభం కానుంది. మొదట జీఎస్టీ, తెలంగాణ హెరిటేజ్ బిల్లులపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి రిజర్వేషన్ల చట్టం బిల్లు అందాక.. తిరిగి మండలి సమావేశమవుతుంది.