
ముస్లింలకు 12%.. ఎస్టీలకు 10%
రిజర్వేషన్ల పెంపుపై ముసాయిదా బిల్లుకు రూపకల్పన
- నేటి రాష్ట్ర కేబినెట్ భేటీలో తుది నిర్ణయం
- రేపు అసెంబ్లీ, మండలిలో బిల్లు
- తమిళనాడు తరహాలో అవకాశమివ్వాలని తీర్మానం
- రాష్ట్రంలో మొత్తంగా 62 శాతానికి చేరుకోనున్న రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్
విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 8 శాతం (మొత్తం 12%), గిరిజనులకు 4 శాతం (మొత్తం 10%) చొప్పున రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లు పెంచుకునేందుకు తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు ముసాయిదా బిల్లు రూపొందించింది. వీటిపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోద ముద్ర వేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ శనివారం సమావేశమవనుంది. కేబినెట్ భేటీలో తీసుకునే తుది నిర్ణయం మేరకు రిజర్వేషన్ల శాతం ఖరారవుతుంది.
మూడ్రోజుల కిందట బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించి రిజర్వేషన్ల పెంపుపై మంత్రివర్గం విధాన నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ ఆమోదించిన బిల్లును ఆదివారం జరిగే అసెంబ్లీ, మండలి సమావేశంలో ప్రవేశపెడతారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లను పెంచేందుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లింలకు (బీసీ–ఈ కోటా) 4 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తాజా పెంపుతో ముస్లింల రిజర్వేషన్లు 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి చేరతాయి. కేబినేట్‌లో తీసుకునే నిర్ణయం మేరకు ఒక శాతం అటుఇటుగా ముసాయిదా బిల్లును ఆమోదించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సిఫారసు 9 నుంచి 12 శాతం
ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఈ నెల 12 జరిగిన భేటీలోనే మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరచినట్లుగా ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లను పెంచి తీరుతామని ముఖ్యమంత్రి అదే రోజున స్పష్టం చేశారు. బీసీ కమిషన్, చెల్ల్లప్ప కమిషన్, సుధీర్ కమిషన్ నివేదికలను పరిశీలిస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్రంలోని ముస్లింల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ ముస్లింల రిజర్వేషన్లను కనీసం 9 నుంచి 12 శాతం పెంచాలని సిఫారసు చేసింది. ఎస్టీల సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన చెల్లప్ప కమిషన్ వారి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరింది. ఈ నేపథ్యంలో ముస్లింలు, ఎస్టీలకు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్లను పెంచనుంది? న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది? అన్న ఉత్కంఠ నెలకొంది.
62 శాతానికి రిజర్వేషన్లు..!
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకు మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తాజా ముసాయిదా ప్రకారం ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుతో ఇది 62 శాతానికి చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో ఎస్సీలకు, బీసీలకు సైతం త్వరలోనే రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీలకు ఒక శాతం రిజర్వేషన్ పెంచే అవకాశమున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవలే సూచనప్రాయంగా వెల్లడించారు. బీసీలకు ఎంత మేరకు రిజర్వేషన్లను పెంచాలనే అంశంపై అధ్యయనం చేసే బాధ్యతలను బీసీ కమిషన్‌కు అప్పగించారు.
2011 జనాభానే ప్రాతిపదిక
రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం పరిగణనలోకి తీసుకునే 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సూచనల మేరకు తమిళనాడు అనుసరించిన వ్యూహాన్ని పక్కాగా అనుసరించనుంది. ప్రస్తుతం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభాలో 12.7 శాతం ముస్లింలున్నారు. వీరిలో 81 శాతం వెనుకబడిన కేటగిరీలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 9.08 శాతం ఉన్నారు. తమను కూడా ఎస్టీల్లో చేర్చాలని వాల్మీకి బోయ, కాయితీ లంబాడాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు కులాలను ఎస్టీల్లో చేరిస్తే వీరి జనాభా 10 శాతానికి చేరనుంది. ఆరేళ్ల కిందటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు జరుగుతుందా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా..? అనేది కేబినెట్‌లో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఎజెండాలో 40 అంశాలు
ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుతో సహా దాదాపు 40 అంశాలు శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. గతేడాది జూలై నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన 3.68 శాతం డీఏ ఫైలుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. మత్స్య కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.లక్ష నుంచి రూ.4 లక్షలకు పెంచే ప్రతిపాదనపై చర్చించనున్నారు. సాయిసింధ్ కేన్సర్ హాస్పిటల్‌కు భూ కేటాయింపు అంశం, హోంశాఖలో కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్న 105 మంది పోలీస్ అధికారుల పదోన్నతుల ప్రతిపాదనలను మంత్రివర్గం పరిశీలించనుంది. కేంద్ర ప్రభుత్వం పంపిన జీఎస్‌టీ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.