కోటాకు ఓకే
- రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
- ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం ఖరారు
- నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- రాష్ట్ర జీఎస్టీ, హెరిటేజ్ బిల్లులకు గ్రీన్‌సిగ్నల్
- ప్రభుత్వ ఉద్యోగులకు 3.66 శాతం డీఏ పెంపు
- రెండు ఎత్తిపోతల పథకాలకు పచ్చజెండా
- మత్స్యకారుల ఎక్స్‌గ్రేషియా రూ. 4 లక్షలకు పెంపు
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ముస్లింలకు (బీసీ–ఈ కోటా) 4 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ కోటాను పెంచుతూ ‘తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల చట్టం–2017’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆదివారం జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో గంటన్నరపాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ల పెంపుపైనే ప్రధాన చర్చ జరిగింది.
ఇటీవల బీసీ కమిషన్, చెల్ల్లప్ప కమిషన్, సుధీర్ కమిషన్ ఇచ్చిన నివేదికలపైనా చర్చించారు. తాజాగా కోటా పెంపుతో రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మొత్తం రిజర్వేషన్లు 50% నుంచి 62 శాతానికి చేరనున్నాయి. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను పెంచేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్ర హెరిటేజ్ చట్టం, రాష్ట్ర జీఎస్టీ (వస్తు, సేవల) చట్టానికి సంబంధించిన బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వీటిని సైతం అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రవేశపెట్టాలని తీర్మానించింది.
బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపైనా చర్చ
బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఆర్నెల్లలో బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేశారు. అలాగే త్వరలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించాలనే అభిప్రాయం మంత్రుల నుంచి వ్యక్తమైంది.
కొత్తగా రాష్ట్ర జీఎస్టీ చట్టం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్టీ బిల్లు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం వ్యాట్, సేల్స్ ట్యాక్స్, సీఎస్‌టీ వంటి రకరకాల పన్నులకు బదులు దేశవ్యాప్తంగా జీఎస్‌టీ పేరుతో ఒకే పన్ను విధానం అమలవుతుంది. స్టేట్ జీఎస్‌టీ, సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటర్ స్టేట్ జీఎస్‌టీ పేరుతో ఈ పన్నులు వసూలు చేస్తారు. సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్‌టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు గతంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ పరిధిలో వసూలు చేసే పన్నులకు సంబంధించిన రాష్ట్ర జీఎస్టీ చట్టం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూపొందించిన రాష్ట్ర జీఎస్‌టీ బిల్లును ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
రాష్ట్రమంతటికీ వారసత్వ చట్టం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు రాష్ట్ర హెరిటేజ్ చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధికి పరిమితమైన ఈ చట్టాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించటంతోపాటు శిథిలావస్థకు, ప్రజలకు ముప్పు వాటిల్లే దశకు చేరుకున్న కట్టడాలను కూల్చివేసేలా చట్టానికి పలు సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదానికి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మే ఒకటిన చెల్లించే జీతంతో పెరిగిన డీఏ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి గతేడాది జులై నుంచి పెండింగ్‌లో ఉన్న 3.66 శాతం కరువు భత్యం(డీఏ) చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న 18.34 శాతం డీఏ 22 శాతానికి చేరనుంది. మే ఒకటిన చెల్లించే జీతంతో పెరిగిన డీఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ప్రమాదవశాత్తూ మరణించే మత్స్యకారులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను రూ.4 లక్షలకు పెంచేందుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. హోంశాఖలో కొద్దిరోజులుగా పెండింగ్ లో ఉన్న 105 మంది పోలీస్ అధికారుల పదోన్నతుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి రిజర్వాయర్‌కు నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేసే పథకానికి, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఆమోద ముద్ర వేసింది.