Resident doctors strike
-
చెంపదెబ్బకు నిరసనగా వైద్య సేవలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ (ఆర్డీఏ) గురువారం నిరవధిక నిరసనలకు పిలుపునిచ్చింది. తమ సహ విద్యార్థి (రెసిడెంట్ డాక్టర్)పై సీనియర్ డాక్టర్ చేయిచేసుకున్నారని ఆర్డీఏ ఆరోపించింది. ఆయన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని, దాడికి గురైన విద్యార్థికి లిఖితపూర్వక క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేసింది. ఆయన పరీక్షల నిర్వహణలో, పరిశోధనా పత్రాల మూల్యంకనంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఎయిమ్స్ పరిపాలనా విభాగాన్ని ఆర్డీఏ కోరింది. ఆర్డీఏ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాకు రాసిన లేఖలో.. సదరు సీనియర్ వైద్యుడు రెసిడెంట్ డాక్టర్‌ను అవమానించారు. తన సహోద్యోగులు, ఇతర నర్సింగ్ సిబ్బంది ఎదుటే చెంపదెబ్బ కొట్టాడని పేర్కొంది. ఆయన ప్రవర్తనతో ఎంతోకాలంగా తాము ఇబ్బందులకు గురౌతున్నామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తాడేమోనన్న భయంతో ఇన్నిరోజులు ఆయనపై ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అత్యవసర సేవలు కొనసాగుతాయి.. ఆర్డీఏ నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని ఎయిమ్స్ పరిపాలనా వర్గాలు తెలిపాయి. డాక్టర్లు సరిపడా అందుబాటులో ఉండని కారణంగా సాధారణ శస్త్రచికిత్సల్ని నిలిపి వేశామని వెల్లడించింది. అత్యవసర, ఐసీయూ సేవలు, పరిమిత సంఖ్యలో ఔట్‌పేషెంట్ క్లినిక్‌లు అందుబాటులోఉంటాయని పేర్కొంది. విద్యా సంబంధిత కార్యకలాపాలను, పరీక్షలను తాత్కాలికంగా నిలుపుదల చేశామని తెలిపింది. అన్ని స్పెషలిస్టు డాక్టర్ల సేవలు కొనసాగేలా చర్యలు తీసుకున్నామని ఎయిమ్స్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. డాక్టర్ల అందుబాటుని బట్టి ఇన్‌పేషెంట్ సేవలు కొనసాగుతాయని పేర్కొంది. విద్యార్థిపై దాడి ఘటన బుధవారం చోటుచేసుకుందని, దాడికి పాల్పడిన సీనియర్ డాక్టర్ సదరు విద్యార్థికి క్షమాపణలు చెప్పారని తన ప్రకటలో వెల్లడించింది. -
డాక్టర్ల సమ్మె విరమణ
సాక్షి, ముంబై: పోలీసుల దాడికి వ్యతిరేకంగా రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను శుక్రవారం విరమించి రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్లీ విధుల్లో చేరారు. దాడికి పాల్పడిన ముగ్గురు పోలీసులు లొంగిపోయారని ప్రభుత్వం ప్రకటించడంతో ‘మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్’ (మర్డ్) తమ సమ్మెను విరమిస్తున్న ప్రకటించింది. ఈ నెల 31న షోలాపూర్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒక అత్యవసర కేసుతో బిజీగా ఉన్నప్పుడు ముగ్గురు పోలీసులు వచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యసాయం అందించాలని కోరారు. ఆమెను ప్రసూతి వార్డుకు తీసుకెళ్లాలని సూచించడంతో ఆగ్రహం చెందిన పోలీసులు సదరు డాక్టరును చితకబాదారు. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లంతా సమ్మె బాటపట్టారు. తమ సహోద్యోగిపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనపై సుమోటోగా స్పందించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఈ కేసుపై శుక్రవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించి దాడి ఘటనపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే డాక్టరుపై దాడి చేసిన ముగ్గురు పోలీసులు లొంగిపోయారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో మర్డ్ను కూడా సమ్మెను వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సమ్మెను విరమించి విధుల్లో చేరుతున్నట్టు మర్డ్ ప్రకటించింది. -
రెసిడెంట్ డాక్టర్ల సమ్మె
ముంబై: తమ సహోద్యోగిపై దాడి చేసిన షోలాపూర్ పోలీసులను సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల మంది రెసిడెంట్ డాక్టర్లు గురువారం నుంచి సమ్మెకు దిగారు. షోలాపూర్‌లో ఓ డాక్టర్‌పై గత నెల 31న ముగ్గురు పోలీసులు దాడి చేసి కొట్టినట్టు వార్తలు వచ్చాయి. వీరిపై డాక్టర్ల రక్షణ చట్టం 2008 కింద నాన్-బెయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేయాలని డాక్టర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మినహా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం (ఎంఏఆర్డీ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ హర్షల్ పన్షేవ్దికర్ ఆరోపించారు. షోలాపూర్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒక అత్యవసర కేసుతో బిజీగా ఉన్నప్పుడు ముగ్గురు పోలీసులు వచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యసాయం అందించాలని కోరారు. ఆమెను ప్రసూతి వార్డుకు తీసుకెళ్లాలని సూచించడంతో ఆగ్రహం చెందిన పోలీసులు సదరు డాక్టరును చితకబాదారని హర్షల్ అన్నారు. ఆందోళన కొనసాగినప్పటికీ వైద్యసేవలకు అంతరాయం రాకుండా చూస్తామని ఎంఏఆర్డీ వైద్యాధికారులు తమకు హామీ ఇచ్చారని హర్షల్ వివరించారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సమాచారమూ అందలేదని ఆయన వివరించారు.