సాక్షి, ముంబై: పోలీసుల దాడికి వ్యతిరేకంగా రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను శుక్రవారం విరమించి రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్లీ విధుల్లో చేరారు. దాడికి పాల్పడిన ముగ్గురు పోలీసులు లొంగిపోయారని ప్రభుత్వం ప్రకటించడంతో ‘మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్’ (మర్డ్) తమ సమ్మెను విరమిస్తున్న ప్రకటించింది. ఈ నెల 31న షోలాపూర్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒక అత్యవసర కేసుతో బిజీగా ఉన్నప్పుడు ముగ్గురు పోలీసులు వచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యసాయం అందించాలని కోరారు. ఆమెను ప్రసూతి వార్డుకు తీసుకెళ్లాలని సూచించడంతో ఆగ్రహం చెందిన పోలీసులు సదరు డాక్టరును చితకబాదారు.
ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లంతా సమ్మె బాటపట్టారు. తమ సహోద్యోగిపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనపై సుమోటోగా స్పందించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఈ కేసుపై శుక్రవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించి దాడి ఘటనపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే డాక్టరుపై దాడి చేసిన ముగ్గురు పోలీసులు లొంగిపోయారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో మర్డ్‌ను కూడా సమ్మెను వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సమ్మెను విరమించి విధుల్లో చేరుతున్నట్టు మర్డ్ ప్రకటించింది.
డాక్టర్ల సమ్మె విరమణ
Published Fri, Jan 3 2014 10:48 PM | Last Updated on Mon, Oct 22 2018 8:37 PM
Advertisement
Advertisement