రాణించిన మోహిత్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో టీఎన్ఆర్ మోహిత్ (5/41) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ... బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో డేనియల్ క్రికెట్ అకాడమీ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో జరుగుతోన్న రెసిడెన్షియల్ క్రికెట్ ట్రెయినింగ్ క్యాంప్ టోర్నీలో భాగంగా సోమవారం వర్డ్లీ క్రికెట్ అకాడమీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డేనియల్ జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వర్డ్లీ జట్టు మోహిత్ ధాటికి 38 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. గోవింద్ (45) రాణించాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన మోహిత్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 220 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన డేనియల్ క్రికెట్ అకాడమీ జట్టు 30 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. చరణ్ (42), సచిత్ (30) పర్వాలేదనిపించగా... మిగతా బ్యాట్స్‌మన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు.