ఆర్నెల్ల ముందే చేయాల్సింది: బొత్స
ఇప్పుడు రాజీనామా చేస్తే లాభమేంటి?: బొత్స
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకున్నప్పుడే తామంతా రాజీనామా చేయకపోవడం చారిత్రక తప్పిదమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అప్పుడే అందరం రాజీనామా చేద్దామని తాను ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. బుధవారమిక్కడ బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంలో ఇప్పుడు రాజీనామా చేయడం బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుంది తప్ప.. ప్రజలకు ఎలాంటి మేలూ జరగబోదని వ్యాఖ్యానించారు. రాజీనామా చేసే వారికీ ఎలాంటి ప్రయోజనమూ దక్కబోదన్నారు.
ఆర్నెల్ల ముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఉంటే సమైక్యవాదం దేశవ్యాప్తంగా తెలిసేదని.. సమైక్యం కోసం త్యాగం చేసినవారమయ్యేవారమన్నారు. మెజార్టీ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేదని తెలిపారు. అధిష్టానం సీమాంధ్ర నేతలందరినీ పిలిచి మాట్లాడేదని, సమస్యలకు పరిష్కారం లభించేదని వివరించారు. ‘ఒకవేళ అప్పట్లో రాజీనామా చేస్తే, పార్టీ అధిష్టానంవారిలో చీలిక తెచ్చి విభజనకనుకూలంగా ఉండే వేరొకరికి సీఎం బాధ్యతలు అప్పగిస్తే...’ అని విలేకరులు ప్రశ్నించగా... సమైక్య ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న ఆ సమయంలో సీఎం పదవి ఇస్తామని అధిష్టానం ఆశచూపినా ఇంగిత జ్ఞానమున్న వారెవ్వరూ ముందుకొచ్చేవారు కాదని బొత్స అన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరేగా మారిందన్నారు. కాంగ్రెస్ను నాశనం చేయడానికి ఓ ప్రముఖ సామాజిక వర్గం ఆడుతున్న నాటకం వల్లనే.. రాష్ట్రానికీ దుర్గతి ఏర్పడింద న్నారు. అయితే ఆ సామాజిక వర్గం పేరు చెప్పేందుకు నిరాకరించారు.
‘19 తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మె’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు హెచ్ఆర్ పాలసీ అమలు, వేతనం రూ.10 వేలకు పెంపుసహా 10 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19వ తేదీ తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ బుధవారం ప్రకటించింది.