ఆర్బీఐ గౌరవానికి ఢోకాలేదు..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి పై వస్తున్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది. డీమానిటైజేషన్ తరువాత దేశ అత్యున్నత బ్యాంక్ ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కోల్పోతోందున్న విమర్శలపై స్పందించిన కేంద్రం...బ్యాంకు గౌరవానికి ఢోకాలేదని హామీ ఇచ్చింది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని, స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్ బీఐ ఉద్యోగులు సంఘం చేసిన ఆరోపణలు తప్పని కొట్టిపారేసిన మంత్రిత్వ శాఖ ఆర్బీఐ పూర్తి స్వయం ప్రతిపత్తిని కాపాడుతామని ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రజా ప్రాముఖ్యత కలిగిన వివిధ విషయాలపై చట్ట ప్రకారం తప్పనిసరి, లేదా ఇప్పటివరకు ఆచరణలో పద్ధతుల్లో ప్రభుత్వం, ఆర్ బీఐ మధ్య సంప్రదింపులు జరిగినట్టు పేర్కొంది. వీటిని స్వయంప్రతిపత్తి ఉల్లంఘన గా తీసుకోకూడదని వివరణ ఇచ్చింది.
కాగా నోట్ల రద్దు తరువాత ఆర్ బీఐ వ్యవహారాల్లో కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరమ్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కి ఒక లేఖ రాశారు. కేంద్రం అనవసర జోక్యాన్ని తాము అవమానంగా భావిస్తున్నామని ఘాటుగా విమర్శించారు. కరెన్సీ మేనేజ్మెంట్ పూర్తిగా ఆర్బీఐ పరిధిలోదని.. దీని కోసం ప్రభుత్వం ఆర్థిక శాఖకు చెందిన అధికారిని నియమించడం అనవసర జోక్యమని పేర్కొంది. 1935 నుంచి ఆర్బీఐ కరెన్సీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోందని, ఈ విషయంలో ఆర్థిక శాఖ జోక్యం శోచనీయమైందని.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు వెల్లడించారు. అలాగే ఆర్బీఐ పనితీరుపై ముగ్గురు మాజీ గవర్నర్లు మన్మోహన్సింగ్, వైవీ రెడ్డి, బిమల్ జలాన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.