‘పబ్లిక్‌హెల్త్’కు పట్టణ నీటి బాధ్యత!
మున్సిపాలిటీలను తప్పించనున్న ప్రభుత్వం
‘పబ్లిక్ హెల్’్తకు నీటి పథకాల ఆస్తులు, బాధ్యతలూ
బదలాయింపు 3,386 కొత్త పోస్టుల కోసం{పతిపాదనలు
హైదరాబాద్: పట్టణాల్లో నీటి సరఫరా బాధ్యతల నుంచి మున్సిపాలిటీలను పూర్తిగా తప్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నీటి సరఫరాలో మున్సిపాలిటీల ఘోర వైఫల్యం నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాల్లో ఈ బాధ్యతలను ‘పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం’ (పీహెచ్ఈడీ)కు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు పీహెచ్ఈడీ కేవలం తాగునీరు, మురుగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకే పరిమితమైంది. పీహెచ్ఈడీ నిర్మించిన పథకాల నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) బాధ్యతలు మున్సిపాలిటీలు చూసేవి. అయితే, మున్సిపాలిటీల ఇంజనీర్లకు సరైన అర్హతలు, అనుభవం, నైపుణ్యం లేకపోవడంతో పట్టణ నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు మునిసిపాలిటీల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు, ఇతరత్రా పనుల బాధ్యతలు కూడా మున్సిపల్ ఇంజనీర్లే చూస్తుండడంతో నీటి సరఫరాపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారు.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోని నీటి సరఫరా పథకాల సామర్థ్యం క్షీణించింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో నీటి పథకాల పర్యవేక్షణ, నిర్వహణ లోపాల వల్ల ఇంటేక్ వెల్స్ నుంచి ముడి నీటి సరఫరా, శుద్ధి చేసిన నీటి సరఫరా, పైప్లైన్లు, పంపింగ్ వరకు అంతటా లోపాలున్నట్లు వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో నీటి సరఫరాను ‘పీహెచ్ఈడీ’ విభాగానికి బదలాయించాలని ఇటీవల ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు పట్టణ నీటి సరఫరా బాధ్యతలు స్వీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలు, కావాల్సిన అదనపు పోస్టులపై ఇటీవల సీఎంఓకు ప్రతిపాదనలు సమర్పించారు. మునిసిపాలిటీల అధీనంలో ఉన్న ఇంటేక్ వెల్స్, నదులు, కాల్వలు, వేసవి నిల్వ ట్యాంకులు, ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్, పంపింగ్ పరికరాలు, పంపింగ్ మెయిన్స్, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర మౌలిక సౌకర్యాలను పీహెచ్ఈడీకు బదలాయించాలని కోరారు. ఈ అవసరాల కోసం 3,386 కొత్త పోస్టులు కావాలని ప్రతిపాదించింది.
జల మండలి తరహాలో..
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పట్టణాల్లోని నీటి సరఫరాను ‘పీహెచ్ఈడీ’ విభాగాధిపతి, చీఫ్ ఇంజనీర్ నేరుగా పర్యవేక్షిస్తారు. మునిసిపల్ కమిషనర్ల, మునిసిపల్ ఇంజనీర్ల జోక్యం ఉండదు. హైదరాబాద్‌లో నీటి సరఫరా పర్యవేక్షిస్తున్న జల మండలి తరహాలో ఈ వ్యవస్థ పనిచేయనుంది. ప్రతి జిల్లాకో సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను నియమించడంతో పాటు రెండు డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. నల్లా కనెక్షన్ల జారీ, బిల్లుల వసూళ్లు సైతం ఇదే విభాగం చూడనుంది.