Resugurram
-
సినిమా చూపిస్త మావా..
పేరు సింహా. ‘రేసుగుర్రం’లో ‘సినిమా చూపిస్త మావా’... తెలుసంటే, ఆయన గొంతు మీకు సుపరిచితమే. ‘నేను పెళ్లికి రెడీ’లో ‘నీవు నేను ఒకటేలే..’ అనే మెలోడీ ద్వారా పరిచయమైన సింహా, 12 ఏళ్లలో 200 పాటల వరకూ పాడారు. వాటిలో ‘పిల్లా నీ కళ్లకున్న కాటుకేమో సూపరే’ (లయన్), ‘అరే జంక్షన్లో.. జంక్షన్లో..’ (ఆగడు) లాంటి హిట్స్ అనేకం. తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డందుకున్న ఈ ఉత్తమ గాయకుడితో చిట్‌చాట్... మొత్తం మీ లైఫ్ ఒక పాటలా సాగిపోతున్నట్టుంది... (నవ్వుతూ) గత ఏడాది ఇరవైనాలుగు సినిమాలకు పాడాను. వాటిలో పద్ధెనిమిది సినిమాలు బ్లాక్‌బస్టర్స్. నేను పాడేవన్నీ మాస్ సాంగ్సే. ‘గుమ్మా గుమ్మా పండిస్తావా..’ (అందరూ దొంగలే... దొరికితే) పాట బాగా హిట్ కావడంతో అలాంటివి వస్తున్నాయి. తెర వెనక హుషారుగా పాడతాను. అదే వేదిక మీద పాడుతున్నప్పుడు చిన్న చిన్న స్టెప్పులు కూడా వేస్తాను. సింహా ఉంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని అందరూ అంటుంటారు. ఇంతకూ మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది? ఏదో ప్రోగ్రామ్‌లో నేను పాడిన పాట విని, సంగీతదర్శకుడు చక్రి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచీ ఆయన చివరి శ్వాస వరకూ ఏ సినిమా చేసినా దాదాపు నాకో పాట ఇచ్చేవారు. చక్రిని మర్చిపోవడం అంత సులువు కాదు. ఆయన నాకెంతో ఆత్మీయుడు. ఆత్మీయులు పోయినప్పుడు బాధగా ఉంటుంది. బాధ కలగడంతో పాటు వృత్తిపరంగా అవకాశాలు తగ్గుతాయని అనిపించిందా? లేదు. ఎందుకంటే చక్రి దగ్గర పాడటం మొదలుపెట్టాక గుర్తింపు వచ్చింది. దాంతో మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, తమన్ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తమన్ ఏ సినిమా చేసినా నాతో పాడించాలనుకుంటారు. ఇప్పుడు దేవిశ్రీ, దర్శకుడు సురేందర్ రెడ్డి బాగా ఆదరిస్తున్నారు. అవకాశాల పరంగా కొదవ లేదు కానీ, చక్రి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం బాధ అనిపించింది. ఆయన ఎంతోమంది సింగర్స్‌కి లైఫ్ ఇచ్చారు. దాదాపు రెండొందలు పాటలు పాడిన మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తోంది? నేను ఎవరికీ పెద్దగా టచ్‌లో ఉండను. సి.ఏ. చదివా. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ, మరోవైపు పాడుతుంటాను. గాయకునిగా ఇంత బిజీ అయ్యాక కూడా ఉద్యోగం చేస్తున్నారంటే... సెక్యూర్టీ కోసమా? ప్రసిద్ధ నోవార్టిస్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా చేస్తున్నా. సౌకర్యవంతమైన జీవితం. పైగా, నాకు లైఫ్‌లో రిస్కులు తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఉద్యోగం వదులుకోలేదు. పైగా సాఫ్ట్వేర్ సైడ్ కాబట్టి శని, ఆదివారాలు సెలవు. దాంతో ఆ రెండు రోజులూ పాటల రికార్డింగ్‌కి కేటాయిస్తాను. ఈ విషయంలో సంగీతదర్శకుల సహకారం మరవలేనిది. ఎప్పుడైనా విడి రోజుల్లో పాడాలంటే మా ఆఫీసు నుంచి సులువుగానే అనుమతి లభిస్తుంది. అందుకని రెండు పడవల మీదా వెళుతున్నా. తెలుగులో హిందీ సింగర్స్ కూడా ఎక్కువయ్యారు? అవును. వాళ్ల ఉచ్చారణే బ్యూటీ అని అంటున్నారు. అఫ్కోర్స్ శ్రోతలు కూడా ఇష్డపడుతున్నారు కాబట్టి వాళ్లతో పాడిస్తున్నారు. అదేం తప్పు కాదు. అందుకే నేను కూడా స్టయిల్ మార్చి, ట్రెండ్‌ని అనుసరిస్తూ పాడుతున్నాను. సంగీతంలో శిక్షణ ఏమైనా తీసుకున్నారా? లేదు. మా నాన్న గారు మిలట్రీలో చేశారు. లయన్ అంటే ఇష్టం కాబట్టి, నాకీ పేరు పెట్టారు. మాది సంప్రదాయ కుటుంబం. అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. మా అన్నయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నేనూ బాగా చదువుకుంటూనే, పాటల వైపు వచ్చా. చిన్నప్పటి నుంచి నాకు కిశోర్‌కుమార్, మహమ్మద్ రఫీ పాటలంటే ఇష్టం. వారి పాటలు పాడుకునేవాణ్ణి. హిందీ సాంగ్స ఇష్టంగా పాడుకున్న మీకు అక్కడ పాడాలని లేదా? నా లక్ష్యమదే. అక్కడా మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నా. పెద్ద హీరోతో ప్రముఖ దర్శకుడు తీస్తున్న ఫిల్మ్‌లో ఛాన్సొచ్చింది. ఫలానా సంగీత దర్శకులకు పాడలేదనే కొరత ఉందా? కీరవాణిగారి ట్యూన్‌కి ఇప్పటి వరకూ పాడలేదు. అదే పెద్ద లోటు. ఇళయరాజా, రహమాన్‌ల స్వరాలకు పాడాలని ఆశ. మర్చిపోలేని సంఘటనలేమైనా? ‘సినిమా చూపిస్త మావా..’ పాటను టీవీలో చూస్తూ, ఓ 80 ఏళ్ల వృద్ధురాలు డ్యాన్స్ చేయడం యూ ట్యూబ్‌లో చూసి, ఆనందపడిపోయా. ఈ పాట పెడితేనే అన్నం తింటామని మారాం చేస్తున్న పిల్లలున్నారని తెలిసి, చిన్నపిల్లాడిలా సంబరపడ్డా. ఆ పాటకే మొన్న ఫిల్మ్‌ఫేర్ అందుకున్నా. - డి.జి. భవాని -
ఈ ప్రపంచంలోనే బెస్ట్ కుక్ మా అమ్మ!!
షంషుద్దీన్ ఇబ్రహీం... సినిమాలలో షామ్‌గా మారారు... కిక్ సినిమాతో కిక్ షామ్ అయిపోయారు... రేసుగుర్రం చిత్రంతో తెలుగువారి హృదయాలు దోచుకున్నారు... పంజాబీ అమ్మాయిని భార్యగా చేసుకున్నారు... ఇద్దరు కూతుళ్లు... అమ్మ చేసే దక్షిణాది వంటకాలు... భార్య చేసే ఉత్తరాది వంటకాలు... టు స్టేట్స్ వంటకాలనూ టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారు... షూటింగ్లలో బిజీగా ఉంటూ కూడా అప్పుడప్పుడు గరిటె పట్టుకుని టూ మినిట్స్ రుచులనూ చూపిస్తారు... కిక్ షామ్ చెప్పిన ముచ్చటైన ఇంటి కబుర్లు... వాటికి తోడుగా రంజాన్ పండుగకు వారి ఇంట్లో ఘుమఘుమలాడే వంటింటి కబుర్లు... మీరు శాకాహారం ఇష్టపడతారా? మాంసాహారం ఇష్టపడతారా? నాకు మాంసాహారం అంటే చాలా ఇష్టం. అయితే మా ఆవిడ కామ్నా... పంజాబీ హిందూ కావడంతో ఎక్కువగా పంజాబీ వంటకాలే చేస్తుంది. ముఖ్యంగా చోలే బటూరా చాలా బాగా చేస్తుంది. మీ కుటుంబం గురించి... నేను నటుడిని కాక ముందే నాన్నగారు మరణించారు. అమ్మకు మేం నలుగురు పిల్లలం. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మ అందరికీ కావాలి కనుక మా అందరి దగ్గర తలో మూడు నెలలు ఉంటారు. మాది ప్రేమ వివాహం. మేం తమిళులం. మొదట్లో మా పెళ్లిని మా అమ్మగారు అంగీకరించలేదు. కాని తరవాత అర్థం చేసుకున్నారు. ఉత్తరాది వంటకాలు మా ఆవిడ, దక్షిణాది వంటకాలు అమ్మ చేసి, వారిద్దరూ ఒకరి రుచులను ఒకరు ఆస్వాదిస్తున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పాప సమైరా. ఒకటో తరగ తి చదువుతోంది. రెండో పాప కియారాకు రెండేళ్లు. నాకు ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. బాగా ఆడతాను కూడా. పండుగలెలా జరుపుకుంటారు? మేం అన్ని పండుగలూ జరుపుకుంటాం. దీపావళి, రంజాన్ ఇంకా మిగతా పండుగలు కూడా. నా ప్రాణస్నేహితులు అజయ్ క్రిస్టియన్, అందుకని క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తాం. మీకు బాగా ఇష్టమైన వంటకం? నాకు సాంబార్ అన్నం, అందులో వందలకొద్దీ అప్పడాలు ఉంటే చాలా చాలా చాలా ఇష్టం. అది ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు. మీ కోసం మీ భార్య ప్రత్యేకంగా ఏయే వంటలు చేస్తారు? చిల్లీ చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్ తయారుచేస్తుంది. అయితే గతంలో ఇవేవీ తనకు చేయడం రాదు. నా కోసమని ప్రత్యేకంగా వంటల పుస్తకాలు తెచ్చి చదివి నేర్చుకుంది. (నవ్వుతూ) ఏ ప్రయోగం చేసినా ప్రథమ బాధితుడిని నేనేగా! మీ భార్య కోసం మీరు ప్రత్యేకంగా ఏం తయారుచేసి పెడతారు? అత్యంత తేలికగా అయిపోయే మ్యాగీ నూడుల్స్, ఆమ్లెట్. మీరు చిన్నతనంలో ఎప్పుడైనా వంట చేశారా? లేదంటే ఎప్పుడైనా మీ అమ్మగారికి వంటలో సాయం చేశారా? నాకు తినడమంటే ఇష్టం! అప్పట్లో తినడమే తప్ప, వండింది ఎక్కడ! అయితే అప్పుడప్పుడు అమ్మకి ఉల్లిపాయలు, టొమాటోలు కట్ చేసి పెట్టేవాడిని. మీరు చదువుకునే రోజుల్లో కనీసం మీ స్నేహితుల కోసం ఎప్పుడైనా వంట చేశారా? చెయ్యకేం చక్కగా చేశాను. అదేంటో చెప్పమంటారా... బ్రెడ్ - జామ్ - బటర్. బావుంది కదూ! పెళ్లయ్యాక అప్పుడప్పుడు వంట చేయడం తప్పుదు కదా! అలా మీరు చేసిన మొట్టమొదటి వంటకం? అలాగే వంటగదిలో మీ మొదటి అనుభవం? నిజమే! తప్పదుగా! అందుకే చాలా తేలికగా తయారయ్యే మ్యాగీ టూ మినిట్స్ నూడిల్స్ చేశాను. నేను చక్కగా చేసిన నా మొదటి వంటకం అదే. అంతకు ముందు ఒకసారి కోడిగుడ్లు ఉడకపెట్టడం కోసం వంట గదిలోకి వెళ్లి గది మొత్తం గందరగోళం చేసేశాను. అనుభవం లేకపోతే అంతే కదా మరి! మీ పిల్లలకు మీరు చేసిన వంట ఇష్టమా? మీ భార్య చేసిన వంట ఇష్టమా? ఇద్దరి వంటా ఇష్టపడతారు. నేను మాత్రం పిల్లల కోసం ప్రత్యేకంగా కార్న్‌ఫ్లేక్స్, ఓట్స్ చేస్తాను. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు ఎప్పుడైనా మీ అమ్మగారికి కాని, మీ భార్యకి కాని ప్రత్యేకమైన వంట ఏదైనా తయారుచేశారా? అమ్మకోసం ఒకసారి రంజాన్ రోజున బాదం ఖీర్ చేశాను. అంతే! సాధారణంగా... అమ్మ చెన్నై వంటకాలు, మా ఆవిడ పంజాబీ వంటకాలు తయారుచేసి నాకే పెడతారు. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ వంటలు ఆరగిస్తుంటాను. రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా ఏయే వంటకాలు తయారుచేస్తారు? మటన్ బిర్యానీ మాత్రమే ప్రత్యేకంగా చేస్తాం. సినీ పరిశ్రమకు చెందిన నా మిత్రులు మా ఇంటికి బిర్యానీ తినడానికి తప్పకుండా వస్తారు. మా అమ్మగారే స్వయంగా వండుతారు. మీ అమ్మగారే ఎందుకు తయారుచేస్తారు? నా దృష్టిలో ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ కుక్ మా మదర్. రంజాన్ సందర్భంగా మీరు మీ అమ్మగారికి ప్రత్యేక బహుమతి ఏదైనా ఇస్తుంటారా? రంజాన్‌కి ఏమీ ఉండదు. కాని ప్రతి డిసెంబరు మాసంలోనూ అమ్మతో కలిసి ఎక్కడో ఒక చోటుకి వెళతాం. కిందటి సంవత్సరం సింగపూర్ వెళ్లాం. ఈ సంవత్సరం దుబాయ్ వెళ్లాలనుకుంటున్నాం. - సంభాషణ: పురాణపండ వైజయంతి మటన్ బిర్యానీ కావలసినవి: మటన్ - కేజీ; బాస్మతి బియ్యం - అర కేజీ; పసుపు - చిటికెడు; కుంకుమపువ్వు - చిటికెడు; కొత్తిమీర - ఒక కట్ట; ఉప్పు - తగినంత; మిరప్పొడి - టేబుల్ స్పూను; నూనె - 5 టేబుల్ స్పూన్లు; ఉడికించిన కోడిగుడ్లు - 2; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు - 2 కప్పులు (గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి); పుదీనా - ఒక కట్ట; పచ్చి మిర్చి - 3 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); పెరుగు - రెండు కప్పులు; జీడిపప్పు - 50 గ్రా.; జీలకర్ర - టీ స్పూను; గరం మసాలా - 2 టేబుల్ స్పూను; మటన్ బిర్యానీ మసాలా - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు తయారి: ఒక పాన్‌లో మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, గరం మసాలా, పెరుగు, ఉల్లి తరుగు వేసి సుమారు గంటసేపు ఊరనివ్వాలి ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక... నూనె, ఉప్పు, బాస్మతి బియ్యం వేసి హాఫ్ బాయిల్ చేయాలి మరొక పాన్‌లో ఊరబెట్టిన మటన్ మిశ్రమాన్ని కింద వేసి, ఆ పైన హాఫ్ బాయిల్డ్ అన్నం, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు వేయాలి ఈ విధంగా అన్నం ఒక పొరలా, పైన మటన్ మిశ్రమం ఒక పొరలా వేయాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని పొరలుగా వేసి, సుమారు 30 నిమిషాలు ఉడికించి దింపాలి పూర్తిగా ఉడికిన తర్వాత పసుపు, కుంకుమ పువ్వు, మిరప్పొడి, ఉడికించిన కోడిగుడ్లు, జీడిపప్పు, నిమ్మరసం ఒక దాని తరవాత ఒకటి వేస్తూ కలపాలి చివరగా మటన్ బిర్యానీ మసాలా, కొత్తిమీద వేసి కలపాలి వేడివేడిగా వడ్డించాలి. చిల్లీ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - 500 గ్రా. (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కోడిగుడ్డు - 1 కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు; సోయా సాస్ - 4 టేబుల్ స్పూన్లు; రిఫైన్డ్ ఆయిల్ - కప్పు; ఎండు మిర్చి - 4; ఉల్లిపాయలు - 2 (ముక్కలుగా కట్ చేయాలి); వెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు; టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు; వేడి నీళ్లు - 2 కప్పులు; క్యాప్సికమ్ - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), ఉప్పు - తగినంత తయారి: చికెన్ ముక్కలలో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్, టేబుల్ స్పూను సోయా సాస్, కోడి గుడ్డు సొన జత చేసి అన్నీ బాగా కలిసేలా కలిపి సుమారు అరగంటసేపు ఊరనివ్వాలి బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఎండు మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాక, వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం వేయించాలి సోయా సాస్, టొమాటో కెచప్ వేసి మరో నిమిషం పాటు క లిపి దించేయాలి మరొక బాణలి స్టౌ మీద ఉంచి, మిగిలిన నూనె వేసి కాగాక, ఊరబెట్టుకున్న చికెన్ మిశ్రమంలో నాలుగో వంతు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇదే విధంగా మిగతా చికెన్‌ను కూడా వేయించి, వెంటవెంటనే ఉల్లి తరుగు వేయించుకున్న బాణలిలో జాగ్రత్తగా వేస్తుండాలి అంతా పూర్తయ్యాక బాణలిని స్టౌ మీద ఉంచి మూడు నిమిషాలు బాగా కలపాలి రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి, చికెన్ మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (సుమారు ఆరేడు నిమిషాలలో ఉడికిపోతుంది) క్యాప్సికమ్ తరుగు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ఒక కప్పులో... టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్, ఆరు టేబుల్ స్పూన్ల చల్లటి నీళ్లు వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి, ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేసి కలిపి, గ్రేవీ కొద్దిగా చిక్కబడగానే దింపి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి. షీర్ కుర్మా కావలసినవి: సేమ్యా - 75 గ్రా. (సన్నగా ఉండే సేమ్యా); పాలు - అర లీటరు; కండెన్స్డ్ మిల్క్ - 200 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); క్రీమ్ - 200 గ్రా; నెయ్యి - టేబుల్ స్పూను; గింజలు తీసిన ఖర్జూరాలు - 3; కిస్మిస్లు - 7; జీడిపప్పు పలుకులు - 7; బాదం పప్పులు - 4; ఏలకులు - 4; పంచదార - రుచికి తగినంత తయారి: పొడవుగా ఉన్న సేమ్యాను చిన్నచిన్న ముక్కలు గా చేయాలి ఖర్జూరాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి బాదంపప్పులను నీళ్లలో నానబెట్టి, పైన తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు చేయాలి ఏలకులను పొడి చేసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, కిస్మిస్లు వేసి వేయించి తీసేయాలి అదే బాణలిలో జీడిపప్పు పలుకులు వేసి వేయించి తీసేయాలి సేమ్యా వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి పాలు పోసి ఆపకుండా కలుపుతుండాలి పాలు మరిగిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసి మరో నిమిషం పాటు కలపాలి క్రీమ్ వేసి మరో నిమిషం పాటు కలపాలి పంచదార వేసి బాగా కలిపి, తీపి సరిపోయిందీ లేనిదీ రుచి చూసుకోవాలి ఏలకుల పొడి, ఖర్జూరాల తరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్స్‌లోకి తీసుకోవాలి వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పుల తరుగు వేసి అతిథులకు అందించాలి. చెన్నై సాంబారు సాంబారు దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన వంటకం. ఇది పప్పుతో తయారయ్యే వంటకం. దీనిని సాధారణంగా అన్నంతో తీసుకుంటారు. ఇడ్లీతో చాలా ఇష్టంగా తింటారు. కావలసినవి: కందిపప్పు - కప్పు; కూరగాయ ముక్కలు - అర కప్పు; చింతపండు రసం - పావు కప్పు; సాంబారు ఉల్లిపాయలు - 10 (చిన్నవి, తొక్క తీయాలి); టొమాటో - సగం చెక్క; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేసుకోవాలి); పసుపు - పావు టీ స్పూను; సాంబారు పొడి - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత పోపు కోసం: ఆవాలు - పావు టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; మెంతులు - ఆరు గింజలు; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండు మిర్చి - 2 (ముక్కలు చేయాలి); నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి కందిపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించి, చల్లారాక గరిటెతో బాగా మెదపాలి ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా వేయించాలి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి చింతపండు రసం వేసి పచ్చి వాసన పోయేవరకు ఉడికించాలి కొద్దిగా నీటిలో సాంబారు పొడి, ఇంగువ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి మరుగుతున్న సాంబారులో వేయాలి ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి కరివేపాకు వేసి అన్నంతో వేడివేడిగా అందించాలి. -
సినిమా చూస్తూ... ఎందుకు ఏడుస్తారు?
పరిశోధన ‘‘ఇక నేను ఎలా బతికేది తల్లీ’’ అంటూ అత్తగారింటికి వెళుతున్న చెల్లి తల మీద చేయి వేసి హీరో ఏడుస్తుంటాడు. ప్రేక్షకుల్లో కొందరు...ఇది చూసి కన్నీరు పెట్టుకుంటారు. కర్చీఫ్ వెదుక్కుంటారు. తమ చెల్లిని గుర్తు తెచ్చుకుంటారు. మరోసారి, చిన్నగా తమలో తాము ఏడుస్తుంటారు. సినిమా దాటి ఎక్కడికో వెళ్లిపోతుంటారు. ఇది కొందరి సంగతి! మరి కొందరు... ‘‘మీ పక్కింటి మీద పది బాంబులు పడ్డాయి’’ అని ఆందోళనగా చెప్పినా - ‘అలాగా’ అని నింపాదిగా తమ పనిలో తాము నిమగ్నమవుతారు. ‘రేసుగుర్రం’ సినిమాలో హీరోయిన్ మాదిరిగా స్పందనరహితంగా ఉంటారు. సినిమా అని తెలిసినా...అతిగా స్పందించడానికి, వాస్తవం అని తెలిసినా...ఏ స్పందన లేకపోవడానికి ‘ప్రత్యేక కారణం’ అంటూ ఏదైనా ఉందా? ఉందనే అంటున్నారు శాస్త్రవేత్తలు. సినిమాల్లో విషాద సన్నివేశాలు చూసినా, విషాద వార్తలు చదివినా... కొందరు అతిగా స్పందించి దుఃఖితులు కావడానికి వారిలోని ‘యస్పియస్’ (సెన్సరి ప్రాసెసింగ్ సెన్సిటివిటీ) కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. వందలో ఇరవై మందిపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. బ్రెయిన్ హైలీ సెన్సిటివ్‌గా మారడమే యస్పియస్. ‘యస్పియస్’ ప్రభావం ఉండడానికి జీన్స్ కారణం అనేది శాస్త్రవేత్తల అంచనా. ‘‘యస్పియస్ ప్రభావాన్ని ప్రతికూల దృష్టితో చూడాల్సిన పని లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మనసు తేలిక అవుతుంది’’ అంటున్నాడు అమెరికాలోని స్టానీ బ్రూక్ యూనివర్శిటీ సైకాలజిస్ట్ అర్ధర్. యస్పియస్ ప్రభావం ఉన్నవాళ్లు అతి సున్నిత మనస్కులుగా ప్రవర్తించినా, రకరకాల సమస్యలను ఎదుర్కోవడంలో మాత్రం గట్టిగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఆల్బర్ట్ ఐన్స్టిన్ కాలేజీ ఆఫ్ మెడిసిన్, మన్‌మౌత్ యూనివర్శిటీలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. దీని తాలూకు వివరాలను ‘బ్రెయిన్ అండ్ బిహేవియర్’ పుస్తకంలో ప్రచురించాయి. -
అవి నాకు కిక్ ఇవ్వలేదు...
తమిళంలో లవర్ బోయ్... తెలుగులో పోలీస్‌మేన్... యువతుల మనసు దోచే పాత్రలు ఒకచోట... యువ హీరోలకు దీటైన పాత్రలు మరోచోట... శామ్ కెరీర్ ఇవాళ మూడు క్లాప్‌లు, ఆరు షాట్లతో ఓ ‘రేసుగుర్రం’... తమిళ, తెలుగు సినీ రంగాల్లో అభిమానులనూ, అభిమానించే అగ్ర దర్శకులనూ సంపాదించుకోవడం, బాక్సాఫీస్ విజయాలు అందుకోవడం ఏ నటుడికైనా ‘కిక్’ కాక మరేమిటి? శామ్కు... కాదు... కాదు... ‘కిక్’ శామ్కు తరగని ఆస్తి అదే. ఇంట్లో ఒప్పించి మరీ సినీ హీరో అయిన ఈ ఫుట్‌బాల్ ఆటగాడి మనసులోని మాటల కచ్చేరీలోని కిక్కే వేరప్పా! హాయ్.. నేను ‘కిక్’ శామ్ని. మీకు కిక్ ఇచ్చే విషయాలు చాలా చెప్పాలని ఉంది. ముందు నా గురించి చెబుతా. నా అసలు పేరు ‘షంషుద్దీన్ ఇబ్రహీం’. సినిమాల కోసం ‘శామ్’ అని మార్చేసుకున్నాను. తెలుగులో మాత్రం నేను చేసిన ‘కిక్’ నా ఇంటి పేరైపోయింది. తమిళ పరిశ్రమలో అందరూ నన్ను సున్నితమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటారు. అందుకని ‘చాక్లెట్ బాయ్’ అంటారు. ఇక్కడేమో జోష్‌గా ‘కిక్ శామ్’ అని అంటారు. నేనిప్పటివరకు తెలుగులో ఆరేడు సినిమాల్లో నటించా. వాటిలో ఎక్కువగా సీరియస్‌గా ఉండే పోలీసు పాత్రలే. తమిళంలోనేమో సరదా సరదాగా ఉండే పాత్రలు చేస్తుంటా. ఏమైనా పోలీసు పాత్రలకు విరామం తీసుకోవాలనుకుంటున్నా. చేసిన పాత్రలే చేస్తే కిక్కేముంటుంది! అమ్మకు ఇష్టం లేదు! మీకో విషయం చెప్పనా? అసలు నేను సినిమా నటుణ్ణి కావాలనుకుంటున్నానని మా ఇంట్లో చెప్పినప్పుడు పెద్ద రాద్ధాంతమే చేశారు. మా అమ్మగారికి నేను సినిమాల్లోకి రావడం అస్సలిష్టం లేదు. నేను మంచి ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరుకీ, స్పోర్ట్స్ క్లబ్స్కీ మా కాలేజ్ తరఫున ఆడేవాణ్ణి. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ‘మా ఇంట్లో మంచి క్రీడాకారుడున్నాడు’ అని మా అమ్మ గర్వంగా చెప్పుకునేది. నా ధ్యాస మాత్రం సినిమాల మీదే. అమ్మని ఒప్పించారు నాన్నగారు. కానీ, నేను నటుణ్ణి కాకముందే ఆయన పోయారు. అది నా దురదృష్టం. నాలుగేళ్లు తెగ తిరిగా! సినిమాల్లో అవకాశాల కోసం కొన్నాళ్లు మోడల్‌గా చేసి, ఆ తర్వాత సినిమాలకు ప్రయత్నం చేయ సాగా. పరిశ్రమలో నాకంటూ ఎవరూ లేకపోవడంతో అంత సులువుగా అవకాశాలు రాలేదు. నాలుగైదేళ్లు తెగ తిరిగా. చివరకు తమిళ దర్శ కుడు జీవా గారి దృష్టిలో పడ్డాను. ‘12 బి’ ద్వారా ఆయన నన్ను హీరోను చేశారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కూడా ఆయన దర్శకత్వంలోనే ‘ఉళ్లమ్ కేక్కుదే’ సినిమా చేశాను. అదీ నా కెరీర్‌కు ఉపయోగపడింది. సినీ పరిశ్రమలో జీవా గారు నా గాడ్‌ఫాదర్. 2008లో ఆయన రష్యాలో గుండెపోటుతో చనిపోయారు. నాకైతే వెన్నెముక కోల్పోయినట్లనిపించింది. లవర్‌బోయ్‌గానే చేయమంటున్నారు కెరీర్‌పరంగా నాకెలాంటి అసంతృప్తీ లేదు. నాకు మహిళా అభిమానులెక్కువ. నేను గడ్డం, మీసాలతో కనిపిస్తే వాళ్లకు నచ్చడం లేదు. వాళ్ల ఇష్టాన్ని కాదనలేను. పరిశ్రమకు వచ్చి పదేళ్లయినా ఇంకా లవర్‌బోయ్‌గా చేయాలంటే నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకే అప్పుడప్పుడూ యాక్షన్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ క్రమంలోనే నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నాను. నేనిష్టపడే పాత్రలు చేయడం కోసం స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. ‘6’ సినిమా నిర్మించి, నటించాను. నాలుగైదు కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తీశాను. లాభం రాలేదు.. నష్టం కూడా తేలేదు. అయితే, ఆ సినిమాతో డబ్బు కన్నా పేరు బాగా వచ్చింది. ఆనందంగా ఉన్నా! తమిళంలో హీరోగా, తెలుగులో కీలక పాత్రలు చేస్తూ ఆనందంగా ఉన్నా. వాస్తవానికి ‘కిక్’ తర్వాత తెలుగులోసోలో హీరోగా చేసి ఉండ వచ్చు. కానీ, వచ్చిన అవకాశాలు అంత కిక్ ఇవ్వలేదు. అందుకే, కీలక పాత్రలకే పరిమితమయ్యా. ప్రేమ వివాహం నాది ప్రేమ వివాహం. నేను ముస్లిమ్. నా భార్య పంజాబీ హిందువు. పేరు - కామ్నా. ‘పంజాబీ అమ్మాయి కోడలుగా వస్తే, ఆమెతో ఏ భాషలో మాట్లాడాలిరా.. మన కుటుంబంతో తను సర్దుకు పోగలుగుతుందా? మన సంప్రదాయాలు వేరు, తనవి వేరు’ అని అమ్మ ససేమిరా అంది. కానీ, చివరకు ఒప్పించాను. ఇప్పుడు మా అమ్మ, నా భార్యతల్లీకూతుళ్లలా ఉంటున్నారు. నాకో వెసులుబాటు ఏమిటంటే.. ఉత్తరాది వంటకాలు తినాలంటే మా ఆవిడ, దక్షిణాది వంటకాలంటే మా అమ్మ చేస్తారు. పెళ్లికి ముందే మేము ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకోవడంతో పెళ్లి తర్వాత మా జీవితం సాఫీగా సాగుతోంది. ‘సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి కనబరచడు’ అనే నమ్మకం కామ్నాకి ఉంది. ఎలాంటి పరిస్థితిలోనూ చేయి వదలననే నమ్మకం ఆమెకు ఉంది. వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ‘నమ్మకం’ అవసరం. మేమిద్దరం... మాకిద్దరు పిల్లలున్నారు. పెద్దమ్మాయి పేరు సమైరా. రెండో పాప పేరు కియారా. సమైరా ఒకటో తరగతి చదువుతోంది. కియారాకి రెండేళ్లు. అందరూ మారతారో లేదో నాకు తెలియదు కానీ, తండ్రయిన తర్వాత నాలో చాలా మార్పొచ్చేసింది. నా భార్యకూ, కూతుళ్లకూ నేనే హీరోని. అందుకే సినిమాలు, కుటుంబం తప్ప నాకు వేరే ధ్యాస లేదు. - గోల్డీ -
సినిమా రివ్యూ: రేసుగుర్రం
ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్ శృతి హాసన్ గ్లామర్ సాంగ్స్, కామెడీ మైనస్ పాయింట్స్: రొటీన్ కథ ఫైట్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం' ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దానికి తోడుగా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకోవాల్సిందే. లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ. పెర్ఫార్మెన్స్: అల్లు అర్జున్‌లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్‌లో నటించడం అర్జున్‌కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు. కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్‌గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్‌గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్‌పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు. మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్‌లో హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్‌గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు. టెక్నికల్: తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి. టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్‌గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి. డైరెక్షన్: టేకింగ్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్‌లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్‌ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్‌లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్‌కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు. ట్యాగ్: బ్రహ్మీ బలంతో పరుగెత్తిన రేసుగుర్రం