సినిమా చూస్తూ... ఎందుకు ఏడుస్తారు?
పరిశోధన
‘‘ఇక నేను ఎలా బతికేది తల్లీ’’ అంటూ అత్తగారింటికి వెళుతున్న చెల్లి తల మీద చేయి వేసి హీరో ఏడుస్తుంటాడు.
ప్రేక్షకుల్లో కొందరు...ఇది చూసి కన్నీరు పెట్టుకుంటారు. కర్చీఫ్ వెదుక్కుంటారు. తమ చెల్లిని గుర్తు తెచ్చుకుంటారు. మరోసారి, చిన్నగా తమలో తాము ఏడుస్తుంటారు. సినిమా దాటి ఎక్కడికో వెళ్లిపోతుంటారు. ఇది కొందరి సంగతి!
మరి కొందరు... ‘‘మీ పక్కింటి మీద పది బాంబులు పడ్డాయి’’ అని ఆందోళనగా చెప్పినా - ‘అలాగా’ అని నింపాదిగా తమ పనిలో తాము నిమగ్నమవుతారు. ‘రేసుగుర్రం’ సినిమాలో హీరోయిన్ మాదిరిగా స్పందనరహితంగా ఉంటారు. సినిమా అని తెలిసినా...అతిగా స్పందించడానికి, వాస్తవం అని తెలిసినా...ఏ స్పందన లేకపోవడానికి ‘ప్రత్యేక కారణం’ అంటూ ఏదైనా ఉందా?
ఉందనే అంటున్నారు శాస్త్రవేత్తలు.
సినిమాల్లో విషాద సన్నివేశాలు చూసినా, విషాద వార్తలు చదివినా... కొందరు అతిగా స్పందించి దుఃఖితులు కావడానికి వారిలోని ‘యస్‌పియస్’ (సెన్సరి ప్రాసెసింగ్ సెన్సిటివిటీ) కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. వందలో ఇరవై మందిపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. బ్రెయిన్ హైలీ సెన్సిటివ్‌గా మారడమే యస్‌పియస్. ‘యస్‌పియస్’ ప్రభావం ఉండడానికి జీన్స్ కారణం అనేది శాస్త్రవేత్తల అంచనా. ‘‘యస్‌పియస్ ప్రభావాన్ని ప్రతికూల దృష్టితో చూడాల్సిన పని లేదు.
ఒకవిధంగా చెప్పాలంటే మనసు తేలిక అవుతుంది’’ అంటున్నాడు అమెరికాలోని స్టానీ బ్రూక్ యూనివర్శిటీ సైకాలజిస్ట్ అర్ధర్. యస్‌పియస్ ప్రభావం ఉన్నవాళ్లు అతి సున్నిత మనస్కులుగా ప్రవర్తించినా, రకరకాల సమస్యలను ఎదుర్కోవడంలో మాత్రం గట్టిగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఆల్బర్ట్ ఐన్‌స్టిన్ కాలేజీ ఆఫ్ మెడిసిన్, మన్‌మౌత్ యూనివర్శిటీలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. దీని తాలూకు వివరాలను ‘బ్రెయిన్ అండ్ బిహేవియర్’ పుస్తకంలో ప్రచురించాయి.