ఈ ప్రపంచంలోనే బెస్ట్ కుక్ మా అమ్మ!! | This is the best cook in the world, mom !! | Sakshi
Sakshi News home page

ఈ ప్రపంచంలోనే బెస్ట్ కుక్ మా అమ్మ!!

Published Fri, Jul 25 2014 11:23 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

This is the best cook in the world, mom !!

 షంషుద్దీన్ ఇబ్రహీం... సినిమాలలో షామ్‌గా మారారు... కిక్ సినిమాతో కిక్ షామ్ అయిపోయారు...
 రేసుగుర్రం చిత్రంతో తెలుగువారి హృదయాలు దోచుకున్నారు... పంజాబీ అమ్మాయిని భార్యగా చేసుకున్నారు...
 ఇద్దరు కూతుళ్లు... అమ్మ చేసే దక్షిణాది వంటకాలు... భార్య చేసే ఉత్తరాది వంటకాలు...
 టు స్టేట్స్ వంటకాలనూ టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారు...
 షూటింగ్‌లలో బిజీగా ఉంటూ కూడా అప్పుడప్పుడు గరిటె పట్టుకుని టూ మినిట్స్ రుచులనూ చూపిస్తారు...
 కిక్ షామ్ చెప్పిన ముచ్చటైన ఇంటి కబుర్లు... వాటికి తోడుగా రంజాన్ పండుగకు వారి ఇంట్లో ఘుమఘుమలాడే వంటింటి కబుర్లు...

 
మీరు శాకాహారం ఇష్టపడతారా? మాంసాహారం ఇష్టపడతారా?
నాకు మాంసాహారం అంటే చాలా ఇష్టం. అయితే మా ఆవిడ కామ్నా... పంజాబీ హిందూ కావడంతో ఎక్కువగా పంజాబీ వంటకాలే చేస్తుంది. ముఖ్యంగా చోలే బటూరా చాలా బాగా చేస్తుంది.
 
మీ కుటుంబం గురించి...
నేను నటుడిని కాక ముందే నాన్నగారు మరణించారు. అమ్మకు మేం నలుగురు పిల్లలం. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మ అందరికీ కావాలి కనుక మా అందరి దగ్గర తలో మూడు నెలలు ఉంటారు. మాది ప్రేమ వివాహం. మేం తమిళులం. మొదట్లో మా పెళ్లిని మా అమ్మగారు అంగీకరించలేదు. కాని తరవాత అర్థం చేసుకున్నారు. ఉత్తరాది వంటకాలు మా ఆవిడ, దక్షిణాది వంటకాలు అమ్మ చేసి, వారిద్దరూ ఒకరి రుచులను ఒకరు ఆస్వాదిస్తున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పాప సమైరా. ఒకటో తరగ తి చదువుతోంది. రెండో పాప కియారాకు రెండేళ్లు. నాకు ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. బాగా ఆడతాను కూడా.
 
పండుగలెలా జరుపుకుంటారు?
మేం అన్ని పండుగలూ జరుపుకుంటాం. దీపావళి, రంజాన్ ఇంకా మిగతా పండుగలు కూడా. నా ప్రాణస్నేహితులు అజయ్ క్రిస్టియన్, అందుకని క్రిస్‌మస్ కూడా సెలబ్రేట్ చేస్తాం.
 
మీకు బాగా ఇష్టమైన వంటకం?
నాకు సాంబార్ అన్నం, అందులో వందలకొద్దీ అప్పడాలు ఉంటే చాలా చాలా చాలా ఇష్టం. అది ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు.
 
మీ కోసం మీ భార్య ప్రత్యేకంగా ఏయే వంటలు చేస్తారు?
చిల్లీ చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్ తయారుచేస్తుంది. అయితే గతంలో ఇవేవీ తనకు చేయడం రాదు. నా కోసమని ప్రత్యేకంగా వంటల పుస్తకాలు తెచ్చి చదివి నేర్చుకుంది. (నవ్వుతూ) ఏ ప్రయోగం చేసినా ప్రథమ బాధితుడిని నేనేగా!
 
మీ భార్య కోసం మీరు ప్రత్యేకంగా ఏం తయారుచేసి పెడతారు?
అత్యంత తేలికగా అయిపోయే మ్యాగీ నూడుల్స్, ఆమ్లెట్.
 
మీరు చిన్నతనంలో ఎప్పుడైనా వంట చేశారా? లేదంటే ఎప్పుడైనా మీ అమ్మగారికి వంటలో సాయం చేశారా?
నాకు తినడమంటే ఇష్టం! అప్పట్లో తినడమే తప్ప, వండింది ఎక్కడ! అయితే అప్పుడప్పుడు అమ్మకి ఉల్లిపాయలు, టొమాటోలు కట్ చేసి పెట్టేవాడిని.
 
మీరు చదువుకునే రోజుల్లో కనీసం మీ స్నేహితుల కోసం ఎప్పుడైనా వంట చేశారా?
చెయ్యకేం చక్కగా చేశాను. అదేంటో చెప్పమంటారా... బ్రెడ్ - జామ్ - బటర్. బావుంది కదూ!
 
పెళ్లయ్యాక అప్పుడప్పుడు వంట చేయడం తప్పుదు కదా! అలా మీరు చేసిన మొట్టమొదటి వంటకం? అలాగే వంటగదిలో మీ మొదటి అనుభవం?
నిజమే! తప్పదుగా! అందుకే చాలా తేలికగా తయారయ్యే మ్యాగీ టూ మినిట్స్ నూడిల్స్ చేశాను. నేను చక్కగా చేసిన నా మొదటి వంటకం అదే. అంతకు ముందు ఒకసారి కోడిగుడ్లు ఉడకపెట్టడం కోసం వంట గదిలోకి వెళ్లి గది మొత్తం గందరగోళం చేసేశాను. అనుభవం లేకపోతే అంతే కదా మరి!
 
మీ పిల్లలకు మీరు చేసిన వంట ఇష్టమా? మీ భార్య చేసిన వంట ఇష్టమా?
ఇద్దరి వంటా ఇష్టపడతారు. నేను మాత్రం పిల్లల కోసం ప్రత్యేకంగా కార్న్‌ఫ్లేక్స్, ఓట్స్ చేస్తాను. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.
 
పిల్లలతో పాటు ఎప్పుడైనా మీ అమ్మగారికి కాని, మీ భార్యకి కాని ప్రత్యేకమైన వంట ఏదైనా తయారుచేశారా?
అమ్మకోసం ఒకసారి రంజాన్ రోజున బాదం ఖీర్ చేశాను. అంతే! సాధారణంగా... అమ్మ చెన్నై వంటకాలు, మా ఆవిడ పంజాబీ వంటకాలు తయారుచేసి నాకే పెడతారు. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ వంటలు ఆరగిస్తుంటాను.
 
రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా ఏయే వంటకాలు తయారుచేస్తారు?
మటన్ బిర్యానీ మాత్రమే ప్రత్యేకంగా చేస్తాం. సినీ పరిశ్రమకు చెందిన నా మిత్రులు మా ఇంటికి బిర్యానీ తినడానికి తప్పకుండా వస్తారు. మా అమ్మగారే స్వయంగా వండుతారు.
 
మీ అమ్మగారే ఎందుకు తయారుచేస్తారు?
నా దృష్టిలో ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ కుక్ మా మదర్.
 
రంజాన్ సందర్భంగా మీరు మీ అమ్మగారికి ప్రత్యేక బహుమతి ఏదైనా ఇస్తుంటారా?
రంజాన్‌కి ఏమీ ఉండదు. కాని ప్రతి డిసెంబరు మాసంలోనూ అమ్మతో కలిసి ఎక్కడో ఒక చోటుకి వెళతాం. కిందటి సంవత్సరం సింగపూర్ వెళ్లాం. ఈ సంవత్సరం దుబాయ్ వెళ్లాలనుకుంటున్నాం.
 
 - సంభాషణ: పురాణపండ వైజయంతి
 
మటన్ బిర్యానీ
 
కావలసినవి:  
మటన్ - కేజీ;  బాస్మతి బియ్యం - అర కేజీ; పసుపు - చిటికెడు; కుంకుమపువ్వు - చిటికెడు; కొత్తిమీర - ఒక కట్ట; ఉప్పు - తగినంత; మిరప్పొడి - టేబుల్ స్పూను; నూనె - 5 టేబుల్ స్పూన్లు; ఉడికించిన కోడిగుడ్లు - 2; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు - 2 కప్పులు (గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి); పుదీనా - ఒక కట్ట; పచ్చి మిర్చి - 3 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); పెరుగు - రెండు కప్పులు; జీడిపప్పు - 50 గ్రా.; జీలకర్ర - టీ స్పూను; గరం మసాలా - 2 టేబుల్ స్పూను; మటన్ బిర్యానీ మసాలా - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు
 
తయారి:
ఒక పాన్‌లో మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, గరం మసాలా, పెరుగు, ఉల్లి తరుగు వేసి సుమారు గంటసేపు ఊరనివ్వాలి  
 
ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక... నూనె, ఉప్పు, బాస్మతి బియ్యం వేసి హాఫ్ బాయిల్ చేయాలి  
 
 మరొక పాన్‌లో ఊరబెట్టిన మటన్ మిశ్రమాన్ని కింద వేసి, ఆ పైన హాఫ్ బాయిల్డ్ అన్నం, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు వేయాలి  
 
 ఈ విధంగా అన్నం ఒక పొరలా, పైన మటన్ మిశ్రమం ఒక పొరలా వేయాలి  
 
 ఇలా మొత్తం మిశ్రమాన్ని పొరలుగా వేసి, సుమారు 30 నిమిషాలు ఉడికించి దింపాలి  
 
పూర్తిగా ఉడికిన తర్వాత పసుపు, కుంకుమ పువ్వు, మిరప్పొడి, ఉడికించిన కోడిగుడ్లు, జీడిపప్పు, నిమ్మరసం ఒక దాని తరవాత ఒకటి వేస్తూ కలపాలి చివరగా మటన్ బిర్యానీ మసాలా, కొత్తిమీద వేసి కలపాలి  
 
 వేడివేడిగా వడ్డించాలి.
 
 చిల్లీ చికెన్
 
 కావలసినవి:
 బోన్‌లెస్ చికెన్ - 500 గ్రా. (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కోడిగుడ్డు - 1
 కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు; సోయా సాస్ - 4 టేబుల్ స్పూన్లు; రిఫైన్‌డ్ ఆయిల్ - కప్పు; ఎండు మిర్చి - 4; ఉల్లిపాయలు - 2 (ముక్కలుగా కట్ చేయాలి); వెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు; టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు; వేడి నీళ్లు - 2 కప్పులు; క్యాప్సికమ్ - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), ఉప్పు - తగినంత
 
 తయారి:  
 చికెన్ ముక్కలలో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి  
 
 టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్, టేబుల్ స్పూను సోయా సాస్, కోడి గుడ్డు సొన జత చేసి అన్నీ బాగా కలిసేలా కలిపి సుమారు అరగంటసేపు ఊరనివ్వాలి  
 
 బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఎండు మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాక, వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం వేయించాలి
 
 సోయా సాస్, టొమాటో కెచప్ వేసి మరో నిమిషం పాటు క లిపి దించేయాలి  
 
 మరొక బాణలి స్టౌ మీద ఉంచి, మిగిలిన నూనె వేసి కాగాక, ఊరబెట్టుకున్న చికెన్  మిశ్రమంలో నాలుగో వంతు  వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇదే విధంగా మిగతా చికెన్‌ను కూడా వేయించి, వెంటవెంటనే ఉల్లి తరుగు వేయించుకున్న బాణలిలో జాగ్రత్తగా వేస్తుండాలి  
 
 అంతా పూర్తయ్యాక బాణలిని స్టౌ మీద ఉంచి మూడు నిమిషాలు బాగా కలపాలి  
 
 రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి, చికెన్ మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (సుమారు ఆరేడు నిమిషాలలో ఉడికిపోతుంది)  
 
 క్యాప్సికమ్ తరుగు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి  
 
 ఒక కప్పులో... టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్, ఆరు టేబుల్ స్పూన్ల చల్లటి నీళ్లు వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి, ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేసి కలిపి, గ్రేవీ కొద్దిగా చిక్కబడగానే దింపి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి.
 
 షీర్ కుర్మా

 కావలసినవి:
 సేమ్యా - 75 గ్రా. (సన్నగా ఉండే సేమ్యా); పాలు - అర లీటరు; కండెన్స్‌డ్ మిల్క్ - 200 గ్రా. (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది); క్రీమ్ - 200 గ్రా; నెయ్యి - టేబుల్ స్పూను; గింజలు తీసిన ఖర్జూరాలు - 3; కిస్‌మిస్‌లు - 7; జీడిపప్పు పలుకులు - 7; బాదం పప్పులు - 4; ఏలకులు - 4; పంచదార - రుచికి తగినంత
 
 తయారి:  
 పొడవుగా ఉన్న సేమ్యాను చిన్నచిన్న ముక్కలు గా చేయాలి  
 
 ఖర్జూరాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి  
 
 బాదంపప్పులను నీళ్లలో నానబెట్టి, పైన తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు చేయాలి  
 
 ఏలకులను పొడి చేసి పక్కన ఉంచాలి
 
 బాణలిలో నెయ్యి వేసి కాగాక, కిస్‌మిస్‌లు వేసి వేయించి తీసేయాలి  
 
 అదే బాణలిలో జీడిపప్పు పలుకులు వేసి వేయించి తీసేయాలి
 
 సేమ్యా వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి  
 
 పాలు పోసి ఆపకుండా కలుపుతుండాలి  
 
 పాలు మరిగిన తర్వాత కండెన్స్‌డ్ మిల్క్ వేసి మరో నిమిషం పాటు కలపాలి  
 
 క్రీమ్ వేసి మరో నిమిషం పాటు కలపాలి  
 
 పంచదార వేసి బాగా కలిపి, తీపి సరిపోయిందీ లేనిదీ రుచి చూసుకోవాలి  
 
 ఏలకుల పొడి, ఖర్జూరాల తరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్స్‌లోకి తీసుకోవాలి  
 
 వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, బాదం పప్పుల తరుగు వేసి అతిథులకు అందించాలి.
 
చెన్నై సాంబారు

సాంబారు దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన వంటకం. ఇది పప్పుతో తయారయ్యే వంటకం. దీనిని సాధారణంగా అన్నంతో తీసుకుంటారు. ఇడ్లీతో చాలా ఇష్టంగా తింటారు.
 
 కావలసినవి:
కందిపప్పు - కప్పు; కూరగాయ ముక్కలు - అర కప్పు; చింతపండు రసం - పావు కప్పు; సాంబారు ఉల్లిపాయలు - 10 (చిన్నవి, తొక్క తీయాలి); టొమాటో - సగం చెక్క; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేసుకోవాలి); పసుపు - పావు టీ స్పూను; సాంబారు పొడి - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత
 
 పోపు కోసం: ఆవాలు - పావు టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; మెంతులు - ఆరు గింజలు; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండు మిర్చి - 2 (ముక్కలు చేయాలి); నూనె - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారి  
 కందిపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించి, చల్లారాక గరిటెతో బాగా మెదపాలి   
 
 ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి  
 
 మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా వేయించాలి   తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి  
 
 చింతపండు రసం వేసి పచ్చి వాసన పోయేవరకు ఉడికించాలి  
 
 కొద్దిగా నీటిలో సాంబారు పొడి, ఇంగువ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి మరుగుతున్న సాంబారులో వేయాలి  
 
 ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి  
 
 కరివేపాకు వేసి అన్నంతో వేడివేడిగా అందించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement