ప్రభుత్వ మద్యం షాపులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్టంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. ఈ రెండు ఆర్డినెన్స్‌లను గెజిట్‌లో ప్రచురిస్తూ న్యాయ శాఖ ఇన్చార్జి కార్యదర్శి వి.సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం వచ్చేనెల 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మార్గదర్శకాలను రూపొందించి న్యాయ శాఖకు పంపారు. వీటికి న్యాయ శాఖ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గవర్నర్ అనుమతితో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ప్రస్తుతం శాసన సభ సమావేశాలు లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌లు చట్ట రూపం దాలుస్తాయి. దాదాపు 3,736 రిటైల్ షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.