retired engineers form
-
‘ఇరిగేషన్ డే’గా విద్యాసాగర్‌రావు జన్మదినం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్‌రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్‌సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్‌కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్‌రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్‌రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్‌రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు. -
ఎక్కువ సంఖ్యలో రిజర్వాయర్లు తప్పనిసరి
కాంగ్రెస్ ప్రజెంటేషన్‌పై స్పందించిన రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నీటి నిల్వకు, వినియోగానికి రిజర్వాయర్లు అవసరం అందుకే కాళేశ్వరం, పాలమూరులో అధిక సామర్థ్యంతో చేపడుతున్నారు సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను మళ్లించడం.. అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం కోసం రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరని సాగునీటి శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం స్పష్టం చేసింది. సాగు, తాగు, విద్యుత్, ఇతర అవసరాలకు నీటిని అందుబాటులో ఉం చడానికి.. రెండో పంటకు నీరందించాలంటే నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ల అవసరం ఎక్కువని పేర్కొంది. అందువల్లే ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఎక్కువ రిజర్వాయర్లను ప్రతిపాదించిందని తెలిపింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సాంబయ్య, సత్తిరెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజెంటేషన్‌లో చెప్పిన అంశాలను వారు తప్పుపట్టారు. 148మీటర్ల ఎత్తులో నీటి లభ్యత 40 టీఎంసీలే ప్రాణహిత -చేవెళ్ల పథకంలో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత పుష్కలంగా లేనందునే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకునే కాళేశ్వరం పథకాన్ని ప్రభుత్వం మొదలుపెట్టినట్లు రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టం చేశారు. ‘‘తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 160 టీఎంసీల లభ్యత ఉంటుంది. అందులో 75 డిపెండబులిటీ లెక్కన 120 టీఎంసీలను తీసుకోవచ్చు. కానీ ఎత్తును 148 మీటర్లకు తగ్గిస్తే లభ్యమయ్యే నీరు 40 టీఎంసీలే. అందువల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నికర జలాలతో పాటు 120 టీఎంసీల మిగులు జలాలు లభ్యతగా ఉన్నాయి. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు గోదావరి పరీవాహకాన్నే వాడుకుంటున్నందున ముంపు ఉండదు. ఇదే సమయంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డల ద్వారా 30 టీఎంసీల అదనపు నిల్వకు అవకాశం ఏర్పడింది..’’ అని వారు వివరించారు. ఇక తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరామని, దానిపై ఆయ న సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. పైప్‌లైన్ వ్యవస్థపై అధ్యయనం ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తెచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని పరిశీలించాలని తాము సూచించగా ప్రభుత్వం సమ్మతించిందని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్ నిర్మాణ ఖర్చు తక్కువగా ఉండడం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలు, నీటి ఆదా నేపథ్యంలో దానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూసేకరణ అవసరం తక్కువగా ఉంటుందని వివరించారు. ఈ విధానాన్ని పాలమూరు, డిండి ప్రాజెక్టుల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర డ్యామ్‌ను ప్రతిపక్ష నేత జానారెడ్డి సందర్శించి.. పైప్‌లైన్ వ్యవస్థను స్వాగతించారని పేర్కొన్నారు.