సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్‌రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్‌సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్‌కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్‌రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు.
ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్‌రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్‌రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment