ఎక్కువ సంఖ్యలో రిజర్వాయర్లు తప్పనిసరి | retired engineers form replys on congress presentation | Sakshi
Sakshi News home page

ఎక్కువ సంఖ్యలో రిజర్వాయర్లు తప్పనిసరి

Published Fri, Aug 19 2016 2:42 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఎక్కువ సంఖ్యలో రిజర్వాయర్లు తప్పనిసరి - Sakshi

ఎక్కువ సంఖ్యలో రిజర్వాయర్లు తప్పనిసరి

     కాంగ్రెస్ ప్రజెంటేషన్‌పై స్పందించిన రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం
     నీటి నిల్వకు, వినియోగానికి రిజర్వాయర్లు అవసరం
     అందుకే కాళేశ్వరం, పాలమూరులో అధిక సామర్థ్యంతో చేపడుతున్నారు


సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను మళ్లించడం.. అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం కోసం రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరని సాగునీటి శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం స్పష్టం చేసింది. సాగు, తాగు, విద్యుత్, ఇతర అవసరాలకు నీటిని అందుబాటులో ఉం చడానికి.. రెండో పంటకు నీరందించాలంటే  నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ల అవసరం ఎక్కువని పేర్కొంది. అందువల్లే ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఎక్కువ రిజర్వాయర్లను ప్రతిపాదించిందని తెలిపింది.  ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సాంబయ్య, సత్తిరెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజెంటేషన్‌లో చెప్పిన అంశాలను వారు తప్పుపట్టారు.

148మీటర్ల ఎత్తులో నీటి లభ్యత 40 టీఎంసీలే
 ప్రాణహిత -చేవెళ్ల పథకంలో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత పుష్కలంగా లేనందునే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకునే కాళేశ్వరం పథకాన్ని ప్రభుత్వం మొదలుపెట్టినట్లు రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టం చేశారు. ‘‘తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 160 టీఎంసీల లభ్యత ఉంటుంది. అందులో 75 డిపెండబులిటీ లెక్కన 120 టీఎంసీలను తీసుకోవచ్చు. కానీ ఎత్తును 148 మీటర్లకు తగ్గిస్తే లభ్యమయ్యే నీరు 40 టీఎంసీలే. అందువల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నికర జలాలతో పాటు 120 టీఎంసీల మిగులు జలాలు లభ్యతగా ఉన్నాయి. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు గోదావరి పరీవాహకాన్నే వాడుకుంటున్నందున ముంపు ఉండదు. ఇదే సమయంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డల ద్వారా 30 టీఎంసీల అదనపు నిల్వకు అవకాశం ఏర్పడింది..’’ అని వారు వివరించారు. ఇక తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరామని, దానిపై ఆయ న సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు.

పైప్‌లైన్ వ్యవస్థపై అధ్యయనం
 ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తెచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని పరిశీలించాలని తాము సూచించగా ప్రభుత్వం సమ్మతించిందని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్ నిర్మాణ ఖర్చు తక్కువగా ఉండడం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలు, నీటి ఆదా నేపథ్యంలో దానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూసేకరణ అవసరం తక్కువగా ఉంటుందని  వివరించారు. ఈ విధానాన్ని పాలమూరు, డిండి ప్రాజెక్టుల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర డ్యామ్‌ను ప్రతిపక్ష నేత జానారెడ్డి సందర్శించి.. పైప్‌లైన్ వ్యవస్థను స్వాగతించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement