retired officers
-
ఉంటుందా? పోతుందా?
సాక్షి, హైదరాబాద్ : పలు కీలక శాఖల్లో ఏళ్ల తరబడి కొనసాగిన రిటైర్డ్ అధికారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీరికి కొనసాగింపు ఉంటుందా..? సాగనంపుతారా ? అంటూ అప్పుడే చర్చ మొదలైంది. విద్యుత్, నీటిపారుదల, ఆర్థిక శాఖ, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, జలమండలి, పౌరసరఫరాలు, మెట్రో రైలు వంటి కీలక ప్రభుత్వశాఖలు, విభాగాల్లో ఇంతకాలం ఉద్యోగ విరమణ చేసిన వారంతా పెత్తనం చేశారు. అయితే రిటైర్డ్ అధికారులను కీలక పోస్టుల్లో కొనసాగించడంపై రేవంత్‌రెడ్డి గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వీరి విషయంలో ఆయన తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్యుత్ సంస్థల్లో రాష్ట్రఆవిర్భావం నుంచి వారే.. తెలంగాణ జెన్కో సీఎండీగా 2014 జూన్ 6 నుంచి, అదే ఏడాది అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతల్లో దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనసాగారు. ఎన్నికల ఫలితాలొచ్చాక మరుసటి రోజే ఆయన రెండు పోస్టులకు రాజీనామా చేయగా, ఇంకా కొత్త వారిని నియమించలేదు. 2014 జూలై నుంచి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా జి.రఘుమారెడ్డి, 2016 అక్టోబర్ నుంచి టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాల్‌రావు వ్యవహరిస్తున్నారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లలో అత్యధికశాతం మంది తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సీఎండీలు, డైరెక్టర్లు కొనసాగుతారని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈఎన్సీలు.. నీటిపారుదలశాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌రావు 2011లో ఉద్యోగ విరమణ చేసినా ఇంకా కొనసాగుతున్నారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సీఈ హమీద్ ఖాన్, అంతర్రాష్ట్ర వ్యవహారాల ఎస్ఈ కోటేశ్వర్రావు రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగుతున్నారు. 2016 జూలైలో ఉద్యోగ విరమణ చేసిన హైదరాబాద్ జలమండలి ఈఎన్సీ/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి, 2017 నవంబర్‌లో ఉద్యోగవిరమణ చేసిన ఆర్డబ్ల్యూఎస్ ఈఎస్సీ కృపాకర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీలో 2016 జూలైలో రిటైర్డ్ అయిన ఈఎన్సీ పి.రవీందర్రావు, 2017 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన బి.గణపతి రెడ్డి, ఈఎన్సీ (స్టేట్ రోడ్లు) ఇంకా కొనసాగుతున్నారు. ఆ అధికారుల్లో చిగురించిన ఆశలు గత ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులున్న కొందరు అధికారుల విషయంలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తొలుత రెండేళ్ల కాలానికి సర్వీసు పొడిగించారు. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చేవారు. చివరకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు(అన్టిల్ ఫర్దర్ ఆర్డర్) ఆ అధికారులే ఆయా పోస్టుల్లో కొనసాగుతారని జీఓలు సైతం జారీ చేశారు. రిటైర్డ్ అధికారులే కీలక పోస్టుల్లో కొనసాగుతుండడంతో సీనియారిటీ ప్రకారం అందాల్సిన అవకాశాలు కోల్పోతున్నామని సర్వీసు మిగిలి ఉన్న అధికారులు చాలా ఏళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. కొత్త సర్కారు వచ్చిన నేపథ్యంలో రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపిస్తే తమకు అవకాశాలు లభిస్తాయన్న ఆశతో ఉన్నారు. అ‘విశ్రాంత’ సేవలోమరికొందరు ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి 2017 నవంబర్‌లో రిటైర్డ్ కాగా ఇంకా కొనసాగుతున్నారు. దేవాదాయ శాఖ కార్యదర్శి/ కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అనీల్‌కుమార్ మూడేళ్లుగా కొనసాగుతుండగా, ఆయన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌గా రాజమౌళిని సైతం పునర్నియమించారు. ఇక పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అదర్ సిన్హా , యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, శిల్పారామం ప్రత్యేకాధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ కిషన్‌రావు, మెట్రో రైలు ఎండీగా రిటైర్డ్ ఐఆర్ఏఎస్ అధికారి ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీందర్, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి ముత్యంరెడ్డి సైతం రిటైర్మెంట్ తర్వాత కూడా అవే పోస్టుల్లో ఉన్నారు. -
సర్వీసు అధికారులు వెయిటింగ్లో.. రిటైర్డ్ అధికారులు పోస్టింగ్‌లో..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగమైనా ఉద్యోగానికి ఒక రిటైర్మెంట్ వయసు ఉంటుంది. కీలక విభాగాల్లో, ఉన్నతమైన స్థానాల్లో పనిచేసే అధికారుల పదవీ విరమణ వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందనుకుంటే సలహాదారుడి గానో లేదా ఓఎస్డీగానో కొద్ది రోజులు నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ పోలీస్ శాఖలో మాత్రం రిటైరై ఎన్నేళ్లయినా ఫర్వాలేదు.. ఓఎస్డీ, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ లాంటి పేర్లతో కీలక విభాగాలకు బాస్‌లుగా చలామణి అవ్వొచ్చు. రాష్ట్రం ఏర్పడకముందు ఇద్దరు, ముగ్గురు అధికారులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఏళ్లపాటు ఓఎస్డీలుగా పెత్తనం చెలాయించారు. తీరా తెలంగాణ ఏర్పడిన తర్వాత రిటైరైన అధికారులు పదవిలో కొనసాగుతున్న అధికారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా పోలీస్ శాఖలోని కీలక విభాగాలతోపాటు డిప్యుటేషన్ యూనిట్లలోనూ ఇదే రకమైన ఓఎస్డీల పెత్తనం పెరిగిపోయింది. అత్యంత కీలక విభాగంలో... రాష్ట్ర పోలీస్ శాఖకే కాదు, ప్రభుత్వానికీ ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకం. ప్రతీక్షణం శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు.. ఇలా ప్రతీ అంశాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి ప్రభుత్వానికి నివేదించాలి. ఇలాంటి విభాగంలోని కీలకమైన ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మొత్తం పదవీ విరమణ పొందిన అధికారుల పెత్తనంలోనే నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ పేరుతో రిటైర్డ్ ఐజీ, ఓఎస్డీల పేరుతో మరో ముగ్గురు నాన్‌కేడర్ అదనపు ఎస్పీలు ఎస్ఐబీని నడిపిస్తున్నారనే చర్చ పోలీస్ శాఖలో జరుగుతోంది. మరోవైపు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ (సీఐసెల్) విభాగంలో రిటైరైన ఇద్దరు అదనపు ఎస్పీలు, ట్రాన్స్‌కోలో ఓ రిటైర్డ్ అదనపు ఎస్పీ, పోలీస్ అకాడమీలో ఒక రిటైర్డ్ ఎస్పీ, ఏసీబీలో రిటైరైన ఓ ఐఈపెస్ అధికారి ఏళ్ల నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో కొలువులో ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే నగర కమిషనరేట్‌కు అత్యంత కీలకమైన టాస్క్‌ఫోర్స్ విభాగానికి డీసీపీగా నేతృత్వం వహిస్తున్న అధికారి సైతం ఏళ్ల నుంచి ఓఎస్డీగా పనిచేస్తుండటం గమనార్హం. ఇలా మొత్తం పోలీస్ శాఖలో 23 మంది పదవీ విరమణ పొందిన అధికారులు ఓఎస్డీ పేరుతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వెయిటింగ్లో 43 మంది అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్న సామెత రాష్ట్ర పోలీస్ శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు 43 మంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. వీరిని వివిధ విభాగాలకు అటాచ్మెంట్ల పేరుతో అంతర్గత ఆదేశాలు ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ కీలక విభాగాల్లో ఐపీఎస్‌లు చేయాల్సిన విధులను రిటైరైన అధికారులకు ఇచ్చి కూర్చోబెట్టడం వివాదాస్పదమవుతోంది. రిటైరై ఓఎస్డీగా ఉన్న అధికారులు ఎక్కడ కూడా అధికారికంగా సంతకాలు గానీ, ప్రతిపాదనలపై పెత్తనం గానీ చేయకూడదు. కానీ వీరు ఏకంగా అధికారిక ఉత్తర్వులపై సంత కాలు చేస్తూ వివాదానికి తెరలేపుతున్నారు. సర్వీస్‌లో ఉన్న ఐపీఎస్, నాన్‌కేడర్ అధికారులను కాదని రిటైరైన అధికారులకు పెత్తనం ఇవ్వడం వెనకున్న ఆంతర్యమేంటనే చర్చ జరుగుతోంది. -
పోలీస్ ఓఎస్డీలకు ఇక సెలవు!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో ఏళ్ల తరబడి ఓఎస్డీలుగా కొనసాగుతున్న రిటైర్డ్ పోలీసు అధికారులకు ప్రభుత్వం త్వరలో వీడ్కోలు పలకనున్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, పోలీస్ అకాడమీ, విజిలెన్స్, ఆర్టీసీ, పోలీస్ వెల్ఫేర్, సెక్యూరిటీ వంటి విభాగాల్లో 22 మంది ఓఎస్డీలుగా పనిచేస్తున్నారు. ఓఎస్డీలను తొలగించాలని కొద్ది రోజులుగా డిమాండ్ వస్తోంది. గతంలో అధికారుల కొరత ఉండేది. ప్రస్తుతం పోలీస్ శాఖలో పరిమితికి మించి సర్వీసు అధికారులున్నారు. వీరి సేవలను పూర్తిస్థాయిలో, కీలక స్థానాల్లో ఉపయోగించుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓఎస్డీల తొలగింపు ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఎదుట పెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మేం పనికిరామా? ఎస్ఐ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ హోదా వరకు పదోన్నతి పొందిన సమర్థులైన అధికారులు చాలామందే ఉన్నారు. గ్రూప్ వన్ అధికారులు కూడా తగిన సంఖ్యలోనే ఉన్నారు. అయినా వీరిని కాదని రిటైర్డ్ అధికారులను ఎక్స్టెన్షన్ పేరుతో ఏళ్ల తరబడి కొనసాగించడంపై పోలీస్ శాఖలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 22 మంది ఓఎస్డీలకు గౌరవంగా వీడ్కోలు పలకాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, కొంతమందికి మరో ఆరునెలల వరకు గడువు ఉన్నా ఎప్పుడైనా వారి ఉద్యోగాలను రద్దు చేసి ఇంటికి పంపించే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీనితో అందరినీ ఒకేసారి పంపిస్తే పక్షపాతం లేకుండా ఉంటుందని సీఎంకు వివరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మావోయిస్టు నియంత్రణ, గ్రేహౌండ్స్, ఎస్ఐబీ లాంటి కీలక యూనిట్లలో సూచనలు, సలహాలు ఇస్తున్నవారిని కూడా పంపించాలని భావిస్తున్నారు. వీరి స్థానంలో అదే విభాగంలోని అనుభవజ్ఞులను నియమించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారుల ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతుందా? లేదా అన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది. -
ఇచ్చట 'రిటైర్మెంట్' లేదు
- అధికారులకు సర్కారు బంపర్ ఆఫర్ - రిటైరైనా రెండు మూడేళ్లపాటు సర్వీసు పొడిగింపు - అన్ని విభాగాలకు పాకిన కొత్త సంస్కృతి.. పలుచోట్ల రిటైర్డ్ అధికారులదే హవా - ఎగ్జిక్యూటివ్, మెజిస్టీరియల్ అధికారులనూ కొనసాగించడంపై విమర్శలు - పదోన్నతులు, కొత్త ఉద్యోగావకాశాలకు దెబ్బపడుతోందని వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు.. ఇంజనీర్లు.. విద్యాశాఖ అధికారులు.. ఎవరైతేం.. రిటైరైనా ఎంచక్కా సర్వీసులోనే కొనసాగుతున్నారు! పదవీ విరమణ తర్వాత కూడా అధికారుల సర్వీసును కొనసాగించే కొత్త సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. విశేష అనుభవం ఉన్న అధికారుల సేవలను వినియోగించుకోవడంలో తప్పేమీ లేకపోయినా.. రానురాను ఈ సంప్రదాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏకంగా ఎగ్జిక్యూటివ్, మెజిస్టీరియల్ అధికారాలున్న వారిని సైతం రిటైరయ్యాక అదే సీట్లో ఏళ్లకేళ్లు కొనసాగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి రెండ్రోజుల కిందట రిటైరయ్యారు. ఆయన సర్వీసును మరో రెండేళ్లు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే పోస్టులో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల సర్వీసు పొడిగింపు, కీలక పదవుల్లో వారిని కొనసాగిస్తున్న తీరు ఇప్పటికే అన్ని శాఖలకు విస్తరించింది. దీంతో తదుపరి కేడర్‌లో ఉన్న అధికారుల పదోన్నతి అవకాశాలకు గండి పడటంతోపాటు కొత్త ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయి. వీటికి తోడు ప్రజోపయోగమైన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలన్నింటా కీలకమైన ఎగ్జిక్యూటివ్, మెజిస్టీరియల్ అధికారాల దుర్వినియోగానికి దారి తీసే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక పదవుల్లో కొలువుదీరిన రిటైర్డ్ అధికారులకు.. వారికి వచ్చే పెన్షన్‌కు మించి ప్రభుత్వం చెల్లించే భారీ వేతనాల రూపంలో ప్రజాధనం సైతం హరించుకుపోతుంది. కొన్ని కీలక శాఖల్లో సర్వీసు పొడిగించిన రిటైర్డ్ అధికారులే కీలక బాధ్యతలు నిర్వహించటం గమనార్హం. తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్‌శర్మ రిటైరయ్యాక ప్రభుత్వ ప్రధాన సలహదారు హోదాలో ఉన్నారు. ఆయనతో పాటు రమణాచారి, ఏకే గోయల్, రామచంద్రుడు, జీఆర్ రెడ్డి, పాపారావు, విద్యాసాగర్‌రావు సలహాదారులుగా ఉన్నారు. ఇటీవల ఏసీబీ డీజీగా పదవీ విరమణ పొందని ఏకే ఖాన్‌ను ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా నియమించింది. రిటైరైనప్పటికీ సీనియర్ ఐఏఎస్ అధికారులు కావటంతో వీరికున్న అపారమైన అనుభవం దృష్ట్యా ప్రభుత్వం వీరి సేవలు వినియోగించుకుంటోంది. కానీ ఇటీవల కొన్ని శాఖల్లో రెగ్యులర్ అధికారులకు మించి సలహాదారులే పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టెన్త్ పేపర్ వెనుక రిటైర్డ్.. ఇటీవల టెన్త్ ఫిజిక్స్ పరీక్షలో స్థాయిని మించిన ప్రశ్నలుండటం విద్యార్థులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రశ్నపత్రాల రూపకల్పనలో విద్యాశాఖలో తిష్ఠ వేసిన కన్సల్టెంట్లు కీలక పాత్ర పోషించిన ఆరోపణలున్నాయి. వీరందరూ రిటైర్డ్ అధికారులే కావటంతో ఆ శాఖ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి ప్రభుత్వ శాఖల్లో ఓఎస్డీలుగా, కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా నియమించడాన్ని నిషేధిస్తూ ఆర్థిక శాఖ 2015 మే 2న జీవో 55 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా పెన్షనర్లు విద్యాశాఖలో చక్రం తిప్పుతుండటం చర్చకు తెరదీసింది. అన్ని శాఖల్లో అదే తీరు.. రహదారుల భవనాలు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాలన్నింటా ఇదే తీరు కొనసాగుతోంది. రాష్ట్ర రహదారుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఇన్చార్జి ఈఎన్సీ రవీందర్రావు గత సంవత్సరం జూన్‌లో పదవీ విరమణ చేశారు. వెంటనే ఆయన్ను అదే హోదాలో మరో మూడేళ్ల కాలానికి ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. జాతీయ రహదారులు, భవనాల విభాగాలను పర్యవేక్షిస్తున్న ఈఎన్సీ గణపతిరెడ్డి పదవీ విరమణ పొందారు. ఆయనను కూడా మరో మూడేళ్ల కాలానికి తిరిగి విధుల్లోకి తీసుకుంది. గ్రామీణాభివృద్ధి విభాగంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లుగా దాదాపు 15 మంది అటవీ శాఖకు చెందిన రిటైర్డ్ అధికారులే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి సర్వీసును ప్రభుత్వం పొడిగించింది. అదే శాఖలో పదవీ విరమణ చేసిన ఐదుగురు చీఫ్ ఇంజనీర్లు కన్సల్టెంట్లుగా కొనసాగుతున్నారు. ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేసి రిటైరైన రమణారావును ఏకంగా అదే సంస్థకు ఎండీగా నియమించారు. తొలుత ఒక సంవత్సరానికి పొడిగించి.. తర్వాత రెండేళ్లకు పొడిగించారు. ఐపీఎస్ అధికారిని ఎండీగా నియమించే ఆనవాయితీకి భిన్నంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖలోనూ.. పోలీస్ శాఖలోనూ రిటైర్డ్ అధికారులకే డిమాండ్ ఎక్కువగా ఉంది. 2002లో పదవీ విరమణ పొంది అప్పట్నుంచి ఇప్పటివరకు పలువురు అధికారులు ఓఎస్డీలుగా కొనసాగుతూనే ఉన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఐజీ సూర్యనారాయణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీగా నియామకం కాగా.. ఇంటెలిజెన్స్‌లో ఓఎస్డీలుగా కిషన్‌రావు, జగన్మోహన్రెడ్డి, నర్సింగ్‌రావు, ఆర్టీసీ విజిలెన్స్‌లో వెంకట్రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అడిషనల్ ఎస్పీ మురళీధర్, గోవర్ధన్‌రెడ్డితోపాటు మరో పది మంది అధికారులు వివిధ పోస్టుల్లో ఉన్నారు.