ఇచ్చట 'రిటైర్మెంట్' లేదు
- అధికారులకు సర్కారు బంపర్ ఆఫర్
- రిటైరైనా రెండు మూడేళ్లపాటు సర్వీసు పొడిగింపు
- అన్ని విభాగాలకు పాకిన కొత్త సంస్కృతి.. పలుచోట్ల రిటైర్డ్ అధికారులదే హవా
- ఎగ్జిక్యూటివ్, మెజిస్టీరియల్ అధికారులనూ కొనసాగించడంపై విమర్శలు
- పదోన్నతులు, కొత్త ఉద్యోగావకాశాలకు దెబ్బపడుతోందని వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్:
సీనియర్ ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు.. ఇంజనీర్లు.. విద్యాశాఖ అధికారులు.. ఎవరైతేం.. రిటైరైనా ఎంచక్కా సర్వీసులోనే కొనసాగుతున్నారు! పదవీ విరమణ తర్వాత కూడా అధికారుల సర్వీసును కొనసాగించే కొత్త సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. విశేష అనుభవం ఉన్న అధికారుల సేవలను వినియోగించుకోవడంలో తప్పేమీ లేకపోయినా.. రానురాను ఈ సంప్రదాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏకంగా ఎగ్జిక్యూటివ్, మెజిస్టీరియల్ అధికారాలున్న వారిని సైతం రిటైరయ్యాక అదే సీట్లో ఏళ్లకేళ్లు కొనసాగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి రెండ్రోజుల కిందట రిటైరయ్యారు. ఆయన సర్వీసును మరో రెండేళ్లు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే పోస్టులో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల సర్వీసు పొడిగింపు, కీలక పదవుల్లో వారిని కొనసాగిస్తున్న తీరు ఇప్పటికే అన్ని శాఖలకు విస్తరించింది. దీంతో తదుపరి కేడర్‌లో ఉన్న అధికారుల పదోన్నతి అవకాశాలకు గండి పడటంతోపాటు కొత్త ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయి. వీటికి తోడు ప్రజోపయోగమైన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలన్నింటా కీలకమైన ఎగ్జిక్యూటివ్, మెజిస్టీరియల్ అధికారాల దుర్వినియోగానికి దారి తీసే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక పదవుల్లో కొలువుదీరిన రిటైర్డ్ అధికారులకు.. వారికి వచ్చే పెన్షన్‌కు మించి ప్రభుత్వం చెల్లించే భారీ వేతనాల రూపంలో ప్రజాధనం సైతం హరించుకుపోతుంది. కొన్ని కీలక శాఖల్లో సర్వీసు పొడిగించిన రిటైర్డ్ అధికారులే కీలక బాధ్యతలు నిర్వహించటం గమనార్హం. తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్‌శర్మ రిటైరయ్యాక ప్రభుత్వ ప్రధాన సలహదారు హోదాలో ఉన్నారు. ఆయనతో పాటు రమణాచారి, ఏకే గోయల్, రామచంద్రుడు, జీఆర్ రెడ్డి, పాపారావు, విద్యాసాగర్‌రావు సలహాదారులుగా ఉన్నారు. ఇటీవల ఏసీబీ డీజీగా పదవీ విరమణ పొందని ఏకే ఖాన్‌ను ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా నియమించింది. రిటైరైనప్పటికీ సీనియర్ ఐఏఎస్ అధికారులు కావటంతో వీరికున్న అపారమైన అనుభవం దృష్ట్యా ప్రభుత్వం వీరి సేవలు వినియోగించుకుంటోంది. కానీ ఇటీవల కొన్ని శాఖల్లో రెగ్యులర్ అధికారులకు మించి సలహాదారులే పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
టెన్త్ పేపర్ వెనుక రిటైర్డ్..
ఇటీవల టెన్త్ ఫిజిక్స్ పరీక్షలో స్థాయిని మించిన ప్రశ్నలుండటం విద్యార్థులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రశ్నపత్రాల రూపకల్పనలో విద్యాశాఖలో తిష్ఠ వేసిన కన్సల్టెంట్లు కీలక పాత్ర పోషించిన ఆరోపణలున్నాయి. వీరందరూ రిటైర్డ్ అధికారులే కావటంతో ఆ శాఖ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి ప్రభుత్వ శాఖల్లో ఓఎస్‌డీలుగా, కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా నియమించడాన్ని నిషేధిస్తూ ఆర్థిక శాఖ 2015 మే 2న జీవో 55 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా పెన్షనర్లు విద్యాశాఖలో చక్రం తిప్పుతుండటం చర్చకు తెరదీసింది.
అన్ని శాఖల్లో అదే తీరు..
రహదారుల భవనాలు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాలన్నింటా ఇదే తీరు కొనసాగుతోంది. రాష్ట్ర రహదారుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఇన్‌చార్జి ఈఎన్‌సీ రవీందర్‌రావు గత సంవత్సరం జూన్‌లో పదవీ విరమణ చేశారు. వెంటనే ఆయన్ను అదే హోదాలో మరో మూడేళ్ల కాలానికి ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. జాతీయ రహదారులు, భవనాల విభాగాలను పర్యవేక్షిస్తున్న ఈఎన్‌సీ గణపతిరెడ్డి పదవీ విరమణ పొందారు. ఆయనను కూడా మరో మూడేళ్ల కాలానికి తిరిగి విధుల్లోకి తీసుకుంది. గ్రామీణాభివృద్ధి విభాగంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లుగా దాదాపు 15 మంది అటవీ శాఖకు చెందిన రిటైర్డ్ అధికారులే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి సర్వీసును ప్రభుత్వం పొడిగించింది. అదే శాఖలో పదవీ విరమణ చేసిన ఐదుగురు చీఫ్ ఇంజనీర్లు కన్సల్టెంట్లుగా కొనసాగుతున్నారు. ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేసి రిటైరైన రమణారావును ఏకంగా అదే సంస్థకు ఎండీగా నియమించారు. తొలుత ఒక సంవత్సరానికి పొడిగించి.. తర్వాత రెండేళ్లకు పొడిగించారు. ఐపీఎస్ అధికారిని ఎండీగా నియమించే ఆనవాయితీకి భిన్నంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ శాఖలోనూ..
పోలీస్ శాఖలోనూ రిటైర్డ్ అధికారులకే డిమాండ్ ఎక్కువగా ఉంది. 2002లో పదవీ విరమణ పొంది అప్పట్నుంచి ఇప్పటివరకు పలువురు అధికారులు ఓఎస్డీలుగా కొనసాగుతూనే ఉన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఐజీ సూర్యనారాయణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్‌డీగా నియామకం కాగా.. ఇంటెలిజెన్స్‌లో ఓఎస్డీలుగా కిషన్‌రావు, జగన్‌మోహన్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ఆర్టీసీ విజిలెన్స్‌లో వెంకట్‌రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అడిషనల్ ఎస్పీ మురళీధర్, గోవర్ధన్‌రెడ్డితోపాటు మరో పది మంది అధికారులు వివిధ పోస్టుల్లో ఉన్నారు.