Retired workers
-
పింఛన్ రాదట!
‘చేతిలో సంచి పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ఈయన పేరు సుంకర నారాయణరావు. వయస్సు 78 ఏళ్లు. 1963లో సింగరేణిలో జీడీకే-1వ గనిలో ఉద్యోగిగా చేరి వివిధ గనుల్లో 34 సంవ త్సరాలు పనిచేసి 1996లో ఉద్యోగ విరమణ చేశారు. అప్పుడు సీఎంపీఎఫ్‌లో జమచేసుకున్న రూ. 2.99 లక్షలు, గ్రాట్యూటీ రూ.లక్ష యాజమాన్యం చెల్లించింది. ఈ డబ్బుతో కూతురు పెళ్లి చేశాడు. ఆనాడు కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. 2003లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరితే రూ. 4,254 సీఎంపీఎఫ్ కార్యాలయంలో చెల్లించాడు. అప్పటి నుంచి అతనికి ప్రతీ నెలా రూ. 822 చెల్లిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న సీఎంపీఎఫ్ కార్యాలయం 2004లో గోదావరిఖనికి వచ్చిన సమయంలో సీఎంపీఎఫ్ అధికారులు అయోమయానికి గురై గతంలో చెల్లించిన బకాయిలను తిరిగి చెల్లించారు. ఆ తర్వాత నాలుక కరుచుకుని వాటిని నెలనెలా రికవరీ చేసుకుంటూ నేడు నారాయణరావుకు రూ.493 పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. పెన్షన్ పెరుగుదల లేకపోవడంతో ఈ మొత్తంతోనే దుర్బర పరిస్థితిలో బతుకుతున్నాడు.’ గోదావరిఖని : సింగరేణిలో రిటైర్డ్ కార్మికుల పరిస్థితి ఆసరా పింఛన్‌కు నోచుకునేలా లేదు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో దాదాపు ఐదారు వేల మంది రిటైర్డ్ కార్మికుల పరిస్థితి ఇలాగే ఉంది. 1998 వరకు సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు అసలు పెన్షన్ సౌకర్యం లేదు. దాంతో 1998లో 89 జీవోను విడుదల చేసి దాని ప్రకారం కార్మికుడు పొందే వేతనంలో బేసిక్‌పై 25 శాతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు రిటైర్డ్ అయిన వారు డబ్బులు చెల్లించాలని కోరడంతో చాలా మంది సీఎంపీఎఫ్ కార్యాలయంలో డబ్బులు జమచేసుకున్నారు. ఆనాటి నుంచి వారికి పెన్షన్ ఇవ్వడం మొదలైంది. ఈ క్రమంలో సీఎంపీఎఫ్ ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేసి ప్రతి మూడు సంవ త్సరాలకోసారి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా పెన్షన్ పెంపుదల చేయాలని జీవోలో పొందుపర్చారు. నాటి నుంచి నేటి వరకు పెన్షన్‌లో పెంపుదల చేయకపోవడం మూలంగా చాలా మంది కార్మికులు రూ. 300 నుంచి రూ. వెయ్యి వరకు మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం వీరంతా ఈ పెన్షన్ మీదనే ఆధారపడగా..వయస్సు మీద పడడంతో రోగాలతో ఇబ్బంది పడుడుతున్నారు. అన్యాయం చేస్తున్న ప్రభుత్వం సింగరేణిలో చాలా ఏళ్ల కిందట పనిచేసి ఉద్యోగ విరమణ చేసి తాము సీఎంపీఎఫ్‌లో జమచేసుకున్న సొంత డబ్బులనే పెన్షన్ రూపంలో పొందుతున్నారు. కనీసం వెయ్యి రూపాయల పెన్షన్‌ను కూడా పొందలేని వారు చాలా మంది ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సింగరేణి రిటైర్డ్ కార్మికుల మీద శీతకన్ను వేసింది. సింగరేణిలో పనిచేస్తే చాలు వారికి పెన్షన్ ఇవ్వమంటూ హుకూం జారీ చేసింది. దీంతో చాలా మంది రిటైర్డ్ కార్మికులు ప్రభుత్వ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా...సర్వేకు వచ్చిన అధికారులు వారికి పెన్షన్ రాయడంలో ముందుకు రాలేదు. ఈ విషయమై చాలా ప్రాంతాలలో వృద్ధులు రోడ్లపైకి చేరుకుని ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం కనికరించలేదు. తాము పొదుపు చేసుకున్న సొంత డబ్బులనే తిరిగి పెన్షన్ రూపంలో పొందుతున్నామని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వృద్ధులు గగ్గోలు పెట్టినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. జీవిత చరమాంకంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం తమకు ‘ఆసరా’గా ఉంటుందని భావిస్తే..కేవలం సింగరేణిలో పనిచేశారని వెయ్యి రూపాయల పెన్షన్‌కు దూరం చేయడం బాధాకరమని.. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని వృద్ధ కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిస్తా.. - గూడూరి శ్రీనివాసరావు, తహశీల్దార్, రామగుండం చాలా మంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందికి సింగరేణిలో పనిచేసినా వారికి పెన్షన్ రావడం లేదు. మరికొందరికి వెయ్యి లోపే పెన్షన్ ఉంటున్నది. వీళ్ల ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి నివేదిస్తా. -
రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : పెరుగుతున్న నిత్యావర సరుకుల ధరల కు అనుగుణంగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచడానికి కృషి చేయాలని ఆల్ పెన్షన ర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ జి.వివేక్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదివారం ఎంపీ ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయనను పెన్షనర్లు కలిసి సమస్యలు వివరించారు. కోల్‌మైనింగ్ పెన్షన్ స్కీం-98 అమలులోకి వచ్చి 15 ఏళ్లు గడిచినా పెన్షన్ పెరగలేదని, 1971 నుంచి అమలులో ఉన్న కోల్‌మైన్స్ ఫ్యామిలీ పెన్షన్ స్కీంను రద్దు చేసి అందులో పేరుకుపోయిన నిల్వ, నిధులను మూలధనంగా సీఎంపీఎఫ్-98లో విలీనం చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వద్ధాప్యలో భద్రత కల్పించలేకపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ మూడేళ్లకు విలువ కట్టి పెన్షన్ పెంచాలని చట్టంలో ఉన్నా అమలు చేయడంలేదని తెలిపారు. ధరలకు అనుగుణంగా కరువు భత్యం చెల్లించాలని, మినిమం పెన్షన్ రూ.6,500 ఇవ్వాలని, వేజ్‌బోర్డు వర్తింపజేయాలని, పెన్షనర్ మరణిస్తే డెత్రిలీఫ్ సౌకర్యం కింద రూ.10వేలు ఇవ్వాలని, సర్వీసును పూర్తిగా పెన్షనుగా పరిగణించాలని, అంగవైకల్యం చెందిన వారికి సర్వీసుతో నిమిత్తం లేకుండా పెన్షన్ చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు కుంబాల లక్ష్మ య్య, కష్ణారెడ్డి, రావుల ఓదెలు, సీహెచ్ సాంబ య్య, గజ్జెల వెంకటి తదితరులున్నారు.