రిజిస్ట్రేషన్లు ఢమాల్
పెద్దనోట్ల రద్దుతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా తగ్గిన ఆదాయం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెద్ద నోట్లను (రూ. 500, రూ. వెయ్యి నోట్లు) రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది రూ.4 వేల కోట్ల వార్షికాదాయమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రోజులుగా ఆదాయ పతనంతో సతమతమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల ఆదాయం అనూహ్యంగా 31.21 శాతం పెరగడం రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పెరుగుదల శాతం నమోదైందని ప్రభుత్వం కూడా ప్రకటించింది.
2015 ప్రథమార్ధంలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.1,495 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) ఆరు నెలల్లో ఇది రూ. 1,935 కోట్లకు పెరగడం విశేషం. ఇదే రీతిన రాబడి కొనసాగితే వార్షిక లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుతామని అధికారులు ఆశించారు. అయితే నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, రాబడిపై తీవ్ర ప్రభావం చూపింది. రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ నెల 2వ తేదీన రూ.14.97 కోట్ల ఆదాయం రాగా తాజాగా శుక్రవారం అది రూ.30 లక్షలకు పడిపోయింది. తాజా పరిణామంతో ప్రభుత్వ పెద్దలతోపాటు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు కూడా ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.
బ్లాక్మనీ చెలామణి కాకనేనా!
రిజిస్రేషన్ల శాఖ రాబడిలో ఆస్తుల క్రయ విక్రయాలే కీలకం. వాస్తవానికి భూములు, ఇతర ఆస్తుల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించిన విలువ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల అధికారులు నిర్దేశించిన ధర ప్రకారమే కొనుగోలు చేసినట్లు క్రయ, విక్రయదారులు పత్రాల్లో చూపుతుంటారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం మిగిలిన మొత్తాన్ని బ్లాక్లో చెల్లిస్తుంటారు. అయితే కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం వారం ముందుగానే డబ్బు డ్రా చేసిన వారు...ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఆ సొమ్మును విక్రయదారులకు చెల్లించేందుకు వీల్లేకుండా పోయింది. కొనుగోలుదారులిచ్చే సొమ్ముకు లీగల్ టెండర్ వాల్యూ లేదని తెలిసిన అమ్మకందారులు సహజంగానే పాతనోట్లను స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఎక్కువ మంది కొనుగోలుదారులకు తమ వద్ద రూ.లక్షలు, కోట్లలో ఉన్న (బ్లాక్మనీ) సొమ్మును బ్యాంకుల్లో జమ చేయడం సాధ్యం కాకపోవడం, పాత నోట్లను జమ చేసిన వారికి బ్యాంకుల నుంచి అంతే మొత్తంలో కొత్త నోట్లు తెచ్చుకునే అవకాశం లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో తదనుగుణంగా రాబడి కూడా పడిపోయింది.
గత 10 రోజులుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు/రాబడి ఇలా..
తేదీ రిజిస్ట్రేషన్లు రాబడి (రూ. కోట్లలో)
01 2,465 05.08
02 3,694 14.98
03 3,273 11.02
04 3,597 14.86
05 2,887 15.35
07 2,900 09.28
08 2,201 04.23
09 977 3.20
10 738 2.29
11 77 0.30
చలాన్లు ఫుల్...రిజిస్ట్రేషన్లు డల్..!
కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు స్థిరాస్తుల కొనుగోలుదారుల నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నిమిత్తం చలాన్ల ద్వారా పాత నోట్లను స్వీకరిస్తున్నప్పటికీ సొమ్ము చెల్లించిన వారు కూడా వెంటనే రిజిస్ట్రేషన్లకు ముందుకు రావడం లేదు. భూములు, ఇతర ఆస్తులను విక్రయించిన వారికి కొనుగోలుదారులు మొత్తం సొమ్మును (వైట్ మనీ) చెల్లించలేకపోతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు తాజా పరిణామంపై రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ ఇప్పటికీ నిత్యం చలాన్ల ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్న మొత్తాల్లో భారీ వ్యత్యాసమేమీ కనిపించడం లేదంటున్నారు. కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ నిమిత్తం చలాన్ల ద్వారా సొమ్ము చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే దాన్ని తమకు వచ్చిన ఆదాయంగా పరిగణిస్తామని చెబుతున్నారు. పాత నోట్ల స్థానంలో ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోట్లు అందరికీ అందుబాట్లోకి వస్తే రిజిస్ట్రేషన్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.