revenue service
-
‘పంపకం’ ఇంకా పెండింగ్‌లోనే!
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపకం జరగాల్సి ఉంది. పోలీస్ శాఖలో మూడున్నరేళ్లుగా డీఎస్పీ స్థాయి అధికారుల పంపకం పెండింగ్‌లోనే ఉంది. సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో కొంత మంది అధికారులు హైకోర్టు నుంచి స్టే తీసుకురావడమే ఇందుకు కారణం. సీనియారిటీ జాబితా సవరించిన తర్వాతే అధికారుల విభజన చేయాలని కమల్‌నాథన్ కమిటీతోపాటు ఏపీ, తెలంగాణ డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలిచ్చి రెండేళ్లు దాటింది. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీ వేసిన ఏపీ పోలీస్ శాఖ.. ఇప్పటివరకు సీనియారిటీ జాబితా సవరించకపోవడంతో కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితాకు వెళ్లాల్సిన ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. రాష్ట్ర విభజనలో తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కొరత ఏర్పడిందని ఆందోళన వ్యక్తమవుతుండగా, సమీక్షలు, సీనియారిటీ జాబితా సవరణ పేరుతో మరింత కాలయాపన చేయడం అధికారులను సతమతం చేస్తోంది. కన్ఫర్డ్ ఐఏఎస్‌కు లైన్‌క్లియర్ ఇక రెవెన్యూ సర్వీసు అధికారుల విషయంలోనూ గందరగోళం నడిచింది. చివరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఓ కమిటీ వేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నా రు. పది రోజుల క్రితమే రెవెన్యూ సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు పంపకాలు కూడా పూర్తిచేశారు. దీంతో కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతి పొందేందుకు అర్హత కలిగిన అధికారుల పేర్లను కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఐపీఎస్‌ల సంగతేంటి? రెవెన్యూ సర్వీసులో సీనియారిటీ జాబితా పూర్తయి చకచకా కన్ఫర్డ్ పదోన్నతికి ప్యానల్ వెళ్తుండటంతో తమ పరి స్థితి ఏంటని ఐపీఎస్ పదోన్నతి పొందాల్సిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి సీనియారిటీ జాబితా సవరణ పేరుతో కాలయాపన తప్ప ఒరిగిందేమీ లేదన్న వాదన రెండు రాష్ట్రాల పోలీస్ అధికారుల్లో వినిపిస్తోంది. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన 12 కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానళ్ల ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లకుం డా సీనియారిటీ సమస్యతో పెండింగ్‌లో ఉండిపోయాయి. రెండు రాష్ట్రాల డీజీపీలు త్వరితగతిన నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు. సవరణపై తుది చర్చలు జరిపి సీనియారిటీ జాబితాను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. -
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖకు ప్రభుత్వం 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను మంజూరు చేసినట్లు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని తహసీల్దారు కార్యాలయాలకు ఒక్కో పోస్టు రానుందన్నారు. ప్రస్తుతం తహసీల్దారు కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు హవా నడుపుతున్నారని.. అనేక అక్రమాలకు వీరే బాధ్యులు అవుతున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం తహసీల్దార్లకు సహాయకంగా ఉండేందుకు కొత్త పోస్టులు మంజూరు చేసిందన్నారు. ఇన్ని పోస్టుల మంజూరుకు రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి కారణమని వివరించారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా నాయకులు రామన్న, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ :రెవెన్యూ వ్యవస్థలను ఉద్యోగులు బలోపేతం చేయాలని రెవెన్యూ సర్వీసుల సంఘ నాయకులు పిలుపునిచ్చారు.ఈ నెల 16న రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బొబ్బరాదు వెంకటేశ్వర్లు నాయకత్వాన్ని మరోసారి సమర్ధించాలని జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రెవెన్యూ సర్వీసుల సంఘం ఆదివారం రెవెన్యూ వసతిగృహంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థను బలపరిచేందుకు పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మరోమారు వెంకటేశ్వర్లను ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్, సెట్‌కాన్ఫరెన్స్, సమావేశాలు నిర్వహణ రాత్రి వేళల్లో నిర్వహించకుండా చూడాలన్నారు. సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలని వారు తీర్మానంలో పేర్కొన్నారు. ఇటీవల, గతంలో జరిగిన జెమినీ ఎన్నికల్లో రెవెన్యూ ఉద్యోగులు చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూశాఖలో వీఆర్ఓ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకు అన్ని క్యాడర్లలో సీనియార్టీ జాబితాలో శాశ్వత ప్రాతిపదికన నడిపించాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఆ విధానాన్ని వెంటనే నిలుపుదల చేయాలని వారు తీర్మానించారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో కంప్యూటర్, నెట్, ఇతర వసతులు కల్పించాలన్నారు. తహశీల్దార్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున మీసేవ, ఇతర సేవలకు ఉపయోగించే డిజిటల్ కీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు డేటా ఏంట్రీ ఆపరేటర్లు ఔట్సోర్సింగ్ విధానం కాకుండా శాశ్వత పద్ధతిలో నియమించాలని తీర్మానించారు. ఔట్సోర్సింగ్ విధానంలో నియమించిన ఆపరేటర్లు చేసిన పొరపాట్లకు తహశీల్దార్లు బలయ్యే ప్రమాదముందన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఎం.శ్రీకాంత్, ఎన్.వెంకటరావు, శ్రీహరి, సతీష్‌బాబు, రాంబాబు, మోహన్‌బాబు, మహంకాళి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.