
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపకం జరగాల్సి ఉంది. పోలీస్ శాఖలో మూడున్నరేళ్లుగా డీఎస్పీ స్థాయి అధికారుల పంపకం పెండింగ్‌లోనే ఉంది. సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో కొంత మంది అధికారులు హైకోర్టు నుంచి స్టే తీసుకురావడమే ఇందుకు కారణం. సీనియారిటీ జాబితా సవరించిన తర్వాతే అధికారుల విభజన చేయాలని కమల్‌నాథన్ కమిటీతోపాటు ఏపీ, తెలంగాణ డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలిచ్చి రెండేళ్లు దాటింది. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీ వేసిన ఏపీ పోలీస్ శాఖ.. ఇప్పటివరకు సీనియారిటీ జాబితా సవరించకపోవడంతో కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితాకు వెళ్లాల్సిన ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. రాష్ట్ర విభజనలో తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కొరత ఏర్పడిందని ఆందోళన వ్యక్తమవుతుండగా, సమీక్షలు, సీనియారిటీ జాబితా సవరణ పేరుతో మరింత కాలయాపన చేయడం అధికారులను సతమతం చేస్తోంది.
కన్ఫర్డ్ ఐఏఎస్‌కు లైన్‌క్లియర్
ఇక రెవెన్యూ సర్వీసు అధికారుల విషయంలోనూ గందరగోళం నడిచింది. చివరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఓ కమిటీ వేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నా రు. పది రోజుల క్రితమే రెవెన్యూ సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు పంపకాలు కూడా పూర్తిచేశారు. దీంతో కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతి పొందేందుకు అర్హత కలిగిన అధికారుల పేర్లను కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఐపీఎస్‌ల సంగతేంటి?
రెవెన్యూ సర్వీసులో సీనియారిటీ జాబితా పూర్తయి చకచకా కన్ఫర్డ్ పదోన్నతికి ప్యానల్ వెళ్తుండటంతో తమ పరి స్థితి ఏంటని ఐపీఎస్ పదోన్నతి పొందాల్సిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి సీనియారిటీ జాబితా సవరణ పేరుతో కాలయాపన తప్ప ఒరిగిందేమీ లేదన్న వాదన రెండు రాష్ట్రాల పోలీస్ అధికారుల్లో వినిపిస్తోంది. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన 12 కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానళ్ల ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లకుం డా సీనియారిటీ సమస్యతో పెండింగ్‌లో ఉండిపోయాయి. రెండు రాష్ట్రాల డీజీపీలు త్వరితగతిన నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు. సవరణపై తుది చర్చలు జరిపి సీనియారిటీ జాబితాను విడుదల చేయాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment