rice seed
-
చిగురిస్తున్న ఆశలు
► రెండు రోజులుగా వర్షాలతో అన్నదాతకు ఊరట ► ఊపందుకున్న వరినాట్లు ► 33 వేల హెక్టార్లకు చేరుకున్న సాగు ► నెలాఖరుకు 80శాతం దాటుతుందని అంచనా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళనకు గురవుతున్న అన్నదాతకు రెండు రోజులుగాకురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. అదను దాటిపోతున్నా ఖరీఫ్ వరినాట్లు పడకదిగులు చెందుతున్న రైతాంగంలోఆశలు చిగురిస్తున్నాయి. ఈఏడాది ఖరీఫ్ లక్ష్యంలో 50శాతం నాట్లు పడతాయో, లేదోనన్నమీమాంసకు లోనైన వ్యవసాయశాఖ సైతం కాస్త తేరుకుంది. సాక్షి, విశాఖపట్నం: రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా నాట్లు ఊపందుకున్నాయి, ముఖ్యంగా మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం జిల్లాలో 22 వేల హెక్టార్లకు మించి నాట్లు పడలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యం లక్షా 93 వేల 267 హెక్టార్లు. లక్షా 819 హెక్టార్లలో వరి సాగుకు నిర్దేశించుకున్నారు. జూలైతో పాటు ఆగస్టు మొదటి రెండు వారాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు 20శాతానికి మించలేదు. ప్రత్యామ్నాయ పంటలే «ఆధారమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సుమారు లక్ష హెక్టార్లలో ఖరీఫ్ సాగు ఉండే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 50 వేల హెక్టార్లలో ప్రధాన పంట వరిని చేపట్టకుండా భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని అంచనాకు వచ్చింది. ఇందుకు భిన్నంగా ఏజెన్సీలో పరిస్థితి అనుకూలించడంతో వరి నాట్లు ఇప్పటికే అక్కడ 70 శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అన్ని పంటలు కలిపి 95,694 హెక్టార్లలో సాగయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయానికి లక్షా 15 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగయింది. వరి విషయానికొస్తే నాలుగు రోజుల క్రితం 22 వేల హెక్టార్లలో సాగయిన వరి, గత రెండు రోజులుగా నాట్లు ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 33,500 హెక్టార్లలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖ పేర్కొంది. వర్షాభావ పరిస్థితులతో తొలుత 40 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో తక్కువ స్థాయిలో ప్రత్యామ్నాయ పంటలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే రీతిలో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనాతో నెలాఖరుకు నిర్ణీత ఖరీఫ్ లక్ష్యంలో 80 శాతానికి పైగా నాట్లు పూర్తవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వర్షాలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ పంటల కోసం ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయశాఖ జేడీ శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతానికి కేవలం 15 వేల హెక్టార్లలో మాత్రమే ప్రత్యామ్నాయ పంటల కోసం అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం మీద రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో వ్యవసాయానికి ఊపు నిచ్చింది. -
రెక్కల కష్టం ఎగిరిపోయి...
ఆరుగాలం శ్రమించిన రైతన్న రెక్కల కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు పంట నష్టానికి కారణం కాగా... మరో వైపు చేతికొచ్చిన అరకొర దిగుబడికి గిట్టుబాటు ధర లభ్యం కాక అన్నదాత కుదేలయ్యాడు. దళారుల ప్రమేయంతో ధర పతనమైంది. ఖరీఫ్ పంట కాలంపై మట్టి మనిషి పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. వడ్లగింజలో చెమ్మను తొలగించేందుకు చెమ్మగిల్లిన కళ్లతో ఆరబెడుతూ... ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి ధర రాకపోతుందా అనే ఆశలు పెంచుకుంటున్నాడు శ్రమజీవి. అనంతపురం శివారులోని సోములదొడ్డి, నాగిరెడ్డిపల్లి, వడియంపేట గ్రామాల వద్ద నిత్యమూ కనిపిస్తున్న ఈ దృశ్యాలు వరి రైతు దైన్య స్థితికి అద్దం పడుతున్నాయి. -
కోదండరాముడికి కొండంత భక్తితో..
నరసాపురం (రాయపేట) : కోదండ రాముడికి.. కొండంత భక్తితో నరసాపురానికి చెందిన ఓ మహిళ రాములోరిపై భక్తిభావాన్ని చాటిచెబుతూ బియ్యపు గింజలపై శ్రీరామనామ లేఖనం చేపట్టారు. శ్రీరాముడిపై భక్తిభావాలను తెలియజేస్తూ రోజుకు ఎనిమిది గంటల పాటు వెయ్యి బియ్యపు గింజలపై రామనామాన్ని లిఖిస్తోంది. పట్టణానికి చెందిన కోట్ల రాజా కిరణ్మయి బియ్యపు గింజలపై శ్రీరామ కోటిని రాస్తున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణంలో తలంబ్రాలు పోయించే దృశ్యాన్ని చూసి భక్తి పరవశమయ్యానని కిరణ్మయి తెలిపారు. శ్రీరామ నామాన్ని రాసిన బియ్యపు గింజలను తలంబ్రాలుగా వినియోగిస్తే బాగుంటుందనే ఆలోచన మనసుకు తట్టిందన్నారు. ఆ ఆలోచనకు కార్యాచరణ చేపట్టినట్టు ఆమె చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాయడం ప్రారంభించానన్నారు. ఇందుకోసం పీఎల్ మసూరి రకం బియ్యాన్ని వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఎటువంటి పనిముట్లు లేకుండా రెండు వేళ్ల మధ్య మూడు, నాలుగు బియ్యపు గింజలను గట్టిగా పట్టుకుని స్కెచ్ పెన్‌తో శ్రీరామ నామాన్ని రాస్తున్నట్లు వివరించారు. ఇప్పటికి దాదాపు 60 వేల గింజలపై లిఖించినట్టు చెప్పారు. వచ్చే సీతారాముల కల్యాణానికి శ్రీరామనామం రాసిన లక్షా 108 బియ్యపు గింజలను భద్రాచలంలోని స్వామి వారికి తలంబ్రాలుగా వినియోగించేందుకు దేవాదాయ శాఖ అధికారుల అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నానని కిరణ్మయి పేర్కొన్నారు. అంతేగాక అయోధ్యలో వీటిని ప్రదర్శించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఆమెను పలువురు అభినందిస్తున్నారు. ఆమె చేపట్టిన ఈ భక్తి కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం. -
నార్లాపూర్‌లో వరి విత్తనం తయారీ
రైతుల సమష్టి సాగుతో అరుదైన రికార్డు పరకాల ఏడీఏ గంగారాం వెల్లడి పరకాల, న్యూస్‌లైన్ : జిల్లాలోనే తొలిసారిగా పరకాల మండలం నార్లాపూర్‌లో రైతులు వరి విత్తనం తయారు చేశారని పరకాల ఏడీఓ బి.గంగారాం తెలిపారు. శుక్రవారం వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఓ నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. విత్తన తయారీ కోసం ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో వ్యవసాయశాఖ నుంచి ‘గ్రామీణ విత్తనోత్పత్తి’ కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో భాగంగా నార్లాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక ఆదర్శ రైతు క్లబ్ ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో విత్తనాల కోసం వరి సాగును చేపట్టినట్లు చెప్పారు. క్లబ్ కన్వీనర్ చేపూరి సాంబయ్యతోపాటు కొందరు రైతులను ప్రోత్సహించి పంట వేయగా ఇప్పుడు చేతికి వచ్చిందని తెలిపారు. వరి విత్తనాలను పరీక్షకు పంపగా సరైనవేనని రిపోర్టు వచ్చిందని, నార్లాపూర్ ఈ ఘనత సాధించడం జిల్లానే ప్రథమని అన్నారు. ఈ విత్తనానికి డబ్ల్యూజీఎల్-32100 ఫౌండేషన్‌గా నామకరణం చేశారని, గ్రామంలో పండిన ఈ విత్తనాలు 1200 ఎకరాలకు సరి పోతుందన్నారు. క్వింటాల్‌కు రూ.2600లుగా ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే హసన్పర్తికి 60 బస్తాలు, జనగామకు 100 బస్తాలు విక్రయించినట్లు తెలిపారు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన(ఆర్కేవీవై) పథకం ద్వారా రూ.4.35 లక్షల మినీ మొబైల్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను 90శాతం సబ్సిడీపై క్లబ్ రైతులకు అందించినట్లు వివరించారు. రైతులు పండించిన వరి విత్తనాలకు బ్యాగులు, లేబులింగ్ అందించి త్వరలోనే మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు. విత్తన సాగుకు రైతులను ప్రోత్సహించిన ఏఓ నాగరాజును ఏడీఏ అభినందించారు.