చిగురిస్తున్న ఆశలు
► రెండు రోజులుగా వర్షాలతో అన్నదాతకు ఊరట
► ఊపందుకున్న వరినాట్లు
► 33 వేల హెక్టార్లకు చేరుకున్న సాగు
► నెలాఖరుకు 80శాతం దాటుతుందని అంచనా
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళనకు గురవుతున్న అన్నదాతకు రెండు రోజులుగాకురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. అదను దాటిపోతున్నా ఖరీఫ్ వరినాట్లు పడకదిగులు చెందుతున్న రైతాంగంలోఆశలు చిగురిస్తున్నాయి. ఈఏడాది ఖరీఫ్ లక్ష్యంలో 50శాతం నాట్లు పడతాయో, లేదోనన్నమీమాంసకు లోనైన వ్యవసాయశాఖ సైతం కాస్త తేరుకుంది.
సాక్షి, విశాఖపట్నం:
రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా నాట్లు ఊపందుకున్నాయి, ముఖ్యంగా మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం జిల్లాలో 22 వేల హెక్టార్లకు మించి నాట్లు పడలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యం లక్షా 93 వేల 267 హెక్టార్లు. లక్షా 819 హెక్టార్లలో వరి సాగుకు నిర్దేశించుకున్నారు. జూలైతో పాటు ఆగస్టు మొదటి రెండు వారాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు 20శాతానికి మించలేదు. ప్రత్యామ్నాయ పంటలే «ఆధారమని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
సుమారు లక్ష హెక్టార్లలో ఖరీఫ్ సాగు ఉండే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 50 వేల హెక్టార్లలో ప్రధాన పంట వరిని చేపట్టకుండా భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని అంచనాకు వచ్చింది. ఇందుకు భిన్నంగా ఏజెన్సీలో పరిస్థితి అనుకూలించడంతో వరి నాట్లు ఇప్పటికే అక్కడ 70 శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అన్ని పంటలు కలిపి 95,694 హెక్టార్లలో సాగయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది.
గతేడాది ఇదే సమయానికి లక్షా 15 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగయింది. వరి విషయానికొస్తే నాలుగు రోజుల క్రితం 22 వేల హెక్టార్లలో సాగయిన వరి, గత రెండు రోజులుగా నాట్లు ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 33,500 హెక్టార్లలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖ పేర్కొంది. వర్షాభావ పరిస్థితులతో తొలుత 40 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో తక్కువ స్థాయిలో ప్రత్యామ్నాయ పంటలకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇదే రీతిలో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనాతో నెలాఖరుకు నిర్ణీత ఖరీఫ్ లక్ష్యంలో 80 శాతానికి పైగా నాట్లు పూర్తవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వర్షాలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ పంటల కోసం ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయశాఖ జేడీ శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతానికి కేవలం 15 వేల హెక్టార్లలో మాత్రమే ప్రత్యామ్నాయ పంటల కోసం అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం మీద రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో వ్యవసాయానికి ఊపు నిచ్చింది.