Delight
-
చిగురిస్తున్న ఆశలు
► రెండు రోజులుగా వర్షాలతో అన్నదాతకు ఊరట ► ఊపందుకున్న వరినాట్లు ► 33 వేల హెక్టార్లకు చేరుకున్న సాగు ► నెలాఖరుకు 80శాతం దాటుతుందని అంచనా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళనకు గురవుతున్న అన్నదాతకు రెండు రోజులుగాకురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. అదను దాటిపోతున్నా ఖరీఫ్ వరినాట్లు పడకదిగులు చెందుతున్న రైతాంగంలోఆశలు చిగురిస్తున్నాయి. ఈఏడాది ఖరీఫ్ లక్ష్యంలో 50శాతం నాట్లు పడతాయో, లేదోనన్నమీమాంసకు లోనైన వ్యవసాయశాఖ సైతం కాస్త తేరుకుంది. సాక్షి, విశాఖపట్నం: రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా నాట్లు ఊపందుకున్నాయి, ముఖ్యంగా మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం జిల్లాలో 22 వేల హెక్టార్లకు మించి నాట్లు పడలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యం లక్షా 93 వేల 267 హెక్టార్లు. లక్షా 819 హెక్టార్లలో వరి సాగుకు నిర్దేశించుకున్నారు. జూలైతో పాటు ఆగస్టు మొదటి రెండు వారాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు 20శాతానికి మించలేదు. ప్రత్యామ్నాయ పంటలే «ఆధారమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సుమారు లక్ష హెక్టార్లలో ఖరీఫ్ సాగు ఉండే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 50 వేల హెక్టార్లలో ప్రధాన పంట వరిని చేపట్టకుండా భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని అంచనాకు వచ్చింది. ఇందుకు భిన్నంగా ఏజెన్సీలో పరిస్థితి అనుకూలించడంతో వరి నాట్లు ఇప్పటికే అక్కడ 70 శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అన్ని పంటలు కలిపి 95,694 హెక్టార్లలో సాగయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయానికి లక్షా 15 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగయింది. వరి విషయానికొస్తే నాలుగు రోజుల క్రితం 22 వేల హెక్టార్లలో సాగయిన వరి, గత రెండు రోజులుగా నాట్లు ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 33,500 హెక్టార్లలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖ పేర్కొంది. వర్షాభావ పరిస్థితులతో తొలుత 40 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో తక్కువ స్థాయిలో ప్రత్యామ్నాయ పంటలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే రీతిలో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనాతో నెలాఖరుకు నిర్ణీత ఖరీఫ్ లక్ష్యంలో 80 శాతానికి పైగా నాట్లు పూర్తవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వర్షాలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ పంటల కోసం ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయశాఖ జేడీ శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతానికి కేవలం 15 వేల హెక్టార్లలో మాత్రమే ప్రత్యామ్నాయ పంటల కోసం అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం మీద రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో వ్యవసాయానికి ఊపు నిచ్చింది. -
ఆనందం నీలోనే!
ఆత్మ లేదా ఆత్మ చైతన్యం అని మనం వింటూ ఉంటాం. ఆత్మ అనేది కేవలం మనుషులకే ఉంటుందని చాలామంది అభిప్రాయం కూడా. అది పొరపాటు. ఆత్మ లేదా చైతన్యస్వరూపమనేది ప్రతిజీవిలోనూ ఉంటుంది. అయితే దానిని గుర్తించగలిగేవారు చాలా అరుదు. ఆనందం విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధాభిప్రాయంతో ఉంటారు. అదేమంటే ఈ లోకంలో ఉన్న ఆనందమంతా తమలోనే ఉంది. అయితే ఆ విషయం తమకు తెలియదు. ఆనందం కోసం లోకమంతా గాలిస్తారు. చివరకు దాన్ని అందిపుచ్చుకోలేక ఆందోళన పడతారు. మనుషుల తీరే అంత. తమలో ఉన్న దాన్ని తెలుసుకోలేరు. లేనిదానికోసం ఆరాటపడతారు. కస్తూరి మృగం తనలోని పరిమళభరితమైన కస్తూరి తన బొడ్డులోనే ఉందని తెలుసుకోలేదు. ఆ సువాసన ఎక్కడినుంచి వస్తోందో తెలుసుకోవాలనే తహతహతో, తపనతో నలుదిక్కులకూ పరుగెడుతుందట. ఆత్మజ్ఞానం లేని జంతువుకూ, ఆత్మజ్ఞానం ఉన్న మనిషికీ కూడా ఆ వ్యత్యాసం తెలియకపోవడమే విచిత్రం. ఆ వ్యత్యాసం తెలియాలంటే అన్ని జీవులనూ తన, పర భేదం లేకుండా ప్రేమించగలగాలి. అలాంటి వారికే ఆత్మజ్ఞానస్వరూపం తెలుస్తుంది. -
పార్కుల ఆహ్లాదం ఎక్కడ..
–పార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టని పాలకవర్గం –గాంధీ పార్కులో సైతం కానరాని పచ్చదనం కోదాడఅర్బన్: సుమారు 65వేల జనాభా, ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కోదాడ పట్టణ ంలో ప్రజల ఆహ్లాదం కోసం కనీసం ఒక్క పార్కు కూడా లేదు. సాయంత్రం వేళల్లో సరదాగా కాసేపు గడిపేందుకు అనువైన స్థలాలు పట్టణ వాసులకు కరువువయ్యాయి. మున్సిపాలిటీగా ఏర్పడి 5సంవత్సరాలు గడుస్తున్నా నేటివరకు ఒక్క కొత్త పార్కు కూడా రూపొందలేదు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతీ సందర్భంలోనూ చెప్పే పాలకవర్గం కూడా నేటివరకు పార్కుల ఏర్పాటుపై ఏ సమావేశంలోనూ చర్చించిన దాఖలాలు లేవు. పార్కుల అభివృద్ధిపై శీత కన్ను.. పట్టణంలో ప్రస్తుతం ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. పేరుకు ఇది పార్కే కానీ ఇందులో పచ్చదనం మాత్రం కానరాదు. ఈ పార్కు స్థలంలో గ్రంథాలయం, మండల సమాఖ్యల కార్యాలయాలు నిర్మించడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన తరువాత బైపాస్‌రోడ్‌లోని ఓ వెంచర్లో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర గడిచినా, నేటివరకు పనులు పూర్తికాలేదు. ఈ పార్కును అక్కడి రియల్ ఎస్టేట్ వెంచర్ అభివృద్ధి కోసమే ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పట్టణంలో ఖళీగా ఉన్న మున్సిపల్ స్థలాలను మినీ పార్కులుగా అభివృద్ధి చేస్తే అవి కొంత మేరకైనా ఉపయోగపడతాయని పలువురు బావిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్కులు అభివృద్ధి చేయాలని పలవురు పట్టణ వాసులు కోరుతున్నారు. పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: వంటిపులి అనిత, చైర్పర్సన్ కోదాడ పట్టణంలోని ప్రజల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గాంధీపార్కుని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించాం. మున్సిపాలిటీకి రావాల్సిన లేఅవుట్ స్థలాలను స్వాధీనం చేసుకుని పార్కులను అభివృద్ధి చేస్తాం. -
పువ్వులు ఆహ్లాదం... గింజలు ఆరోగ్యం!
తెలుసా? అందానికీ, ఆహ్లాదానికీ తామర పువ్వుల గురించి చెబుతూ ఉంటాం. కానీ, ఆరోగ్యానికి కూడా అవి కీలకమంటున్నారు నిపుణులు. మీకు తెలుసో తెలియదో తామర పువ్వుల్లో ఉండే గింజలు తినవచ్చు. అవి ఆరోగ్యాన్ని అందిస్తాయట! తామర గింజల నిండా బోలెడన్ని పోషక పదార్థాలు ఉంటాయట! పచ్చిగా, తాజాగా ఉన్నప్పుడు గింజలు ఆకుపచ్చగా ఉంటాయి. కొద్దిగా ముదిరితే, గట్టిగా తయారవుతాయి. వీటి ఔషధ గుణాల గురించి చైనీయులకు తెలుసు. అందుకే, వాళ్ళు వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. ఆగస్ట్, సెప్టెంబరుల్లో ఎక్కువగా తామర పూలొస్తాయి. వీటిలోని గింజల్ని పచ్చిగా కానీ, ఉడకబెట్టి కానీ తినవచ్చు. నిల్వ చేయడమెలా? ఈ గింజల్ని ఎండబెట్టి, గాలి చొరబడని ప్లాస్టిక్ సీసాల్లో వేసి, తడి తగలని చోట ఉంచాలి. అదే గనక పచ్చి గింజలైతే, వాటిని పొడిగా ఉండే, జిప్ లాక్ బ్యాగ్‌లలో వేసి, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఔషధ ప్రయోజనాలు ఎన్నో... * తామర పూలగింజలు తింటే యౌవనంతో, నాజూగ్గా కనిపిస్తారు. దానికి కారణం ఉంది. ఈ గింజల్లో ‘ఎల్-ఐసో యాస్పర్టిల్ మిథైల్ ట్రాన్స్‌ఫెరేస్’ ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను సరిదిద్ది, వయసు మీద పడకుండా చేస్తుందట! అందుకే, సౌందర్య ఉత్పత్తుల్లో ఈ గింజల్ని వాడుతున్నారు. * వీటిలో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని తినగానే కడుపు నిండినట్లనిపిస్తుంది. దాంతో, పొట్ట తగ్గుతుంది. బరువు తగ్గుతాం. * గర్భిణులు ఈ గింజలు తింటే పోషక విలువల వల్ల గర్భంలోని పిండం తాలూకు నాడీ వ్యవస్థ, మెదడు వృద్ధి చెందుతాయి. * అలాగే, గర్భిణుల్లో రక్తస్రావాన్ని అరికట్టి, గర్భస్రావం కాకుండా చూడడంలో కూడా ఈ గింజల పనితనం భేష్. కాన్పు అయ్యాక ఉండే శారీరక బలహీనతను అరికడతాయి. * మనసుకు ప్రశాంతతనిచ్చి, నిద్రపుచ్చే గుణం వీటికుంది. * తామరగింజల మధ్యలో ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్స్‌తో చేదు పదార్థం ఉంటుంది. అది రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్తపోటు తగ్గిస్తుంది. అలా ఇవి గుండెకు మేలైనవన్న మాట! * ఈ గింజలు దంతాలు, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. డయేరియాను నివారిస్తాయి. అలాగే, నోటిలో పుండ్లను తగ్గిస్తాయి. మొత్తం మీద, సాధారణ ఆరోగ్యం మెరుగవుతుంది. జాగ్రత్తలు కొన్ని... * ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ రావచ్చు. * కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి. * ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్థులు జాగ్రత్త వహించాలి. ఎలా తినవచ్చంటే... కొద్దిగా నూనె, లేదంటే నెయ్యి బాణలిలో వేసి, వేడి చేయండి. తామర గింజలను దానిలో వేసి, కరకరలాడేలా సన్నటి సెగ మీద 10 నిమిషాలు వేయించండి. మంట ఆపాక, తగినంత ఉప్పు, మసాలా దినుసులు కలపాలి. బాగా కలుపుకొన్నాక, వేడి వేడిగా తినవచ్చు. ఈ గింజలతో సాస్‌లు, పాల పాయసం చేసుకోవచ్చు.