తెలుసా?
అందానికీ, ఆహ్లాదానికీ తామర పువ్వుల గురించి చెబుతూ ఉంటాం. కానీ, ఆరోగ్యానికి కూడా అవి కీలకమంటున్నారు నిపుణులు. మీకు తెలుసో తెలియదో తామర పువ్వుల్లో ఉండే గింజలు తినవచ్చు. అవి ఆరోగ్యాన్ని అందిస్తాయట! తామర గింజల నిండా బోలెడన్ని పోషక పదార్థాలు ఉంటాయట! పచ్చిగా, తాజాగా ఉన్నప్పుడు గింజలు ఆకుపచ్చగా ఉంటాయి. కొద్దిగా ముదిరితే, గట్టిగా తయారవుతాయి.
వీటి ఔషధ గుణాల గురించి చైనీయులకు తెలుసు. అందుకే, వాళ్ళు వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. ఆగస్ట్, సెప్టెంబరుల్లో ఎక్కువగా తామర పూలొస్తాయి. వీటిలోని గింజల్ని పచ్చిగా కానీ, ఉడకబెట్టి కానీ తినవచ్చు.
నిల్వ చేయడమెలా?
ఈ గింజల్ని ఎండబెట్టి, గాలి చొరబడని ప్లాస్టిక్ సీసాల్లో వేసి, తడి తగలని చోట ఉంచాలి. అదే గనక పచ్చి గింజలైతే, వాటిని పొడిగా ఉండే, జిప్ లాక్ బ్యాగ్‌లలో వేసి, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
ఔషధ ప్రయోజనాలు ఎన్నో...
* తామర పూలగింజలు తింటే యౌవనంతో, నాజూగ్గా కనిపిస్తారు. దానికి కారణం ఉంది. ఈ గింజల్లో ‘ఎల్-ఐసో యాస్పర్టిల్ మిథైల్ ట్రాన్స్‌ఫెరేస్’ ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను సరిదిద్ది, వయసు మీద పడకుండా చేస్తుందట! అందుకే, సౌందర్య ఉత్పత్తుల్లో ఈ గింజల్ని వాడుతున్నారు.
* వీటిలో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని తినగానే కడుపు నిండినట్లనిపిస్తుంది. దాంతో, పొట్ట తగ్గుతుంది. బరువు తగ్గుతాం.
* గర్భిణులు ఈ గింజలు తింటే పోషక విలువల వల్ల గర్భంలోని పిండం తాలూకు నాడీ వ్యవస్థ, మెదడు వృద్ధి చెందుతాయి.
* అలాగే, గర్భిణుల్లో రక్తస్రావాన్ని అరికట్టి, గర్భస్రావం కాకుండా చూడడంలో కూడా ఈ గింజల పనితనం భేష్.
కాన్పు అయ్యాక ఉండే శారీరక బలహీనతను అరికడతాయి.
* మనసుకు ప్రశాంతతనిచ్చి, నిద్రపుచ్చే గుణం వీటికుంది.
* తామరగింజల మధ్యలో ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్స్‌తో చేదు పదార్థం ఉంటుంది. అది రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్తపోటు తగ్గిస్తుంది. అలా ఇవి గుండెకు మేలైనవన్న మాట!
* ఈ గింజలు దంతాలు, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. డయేరియాను నివారిస్తాయి. అలాగే, నోటిలో పుండ్లను తగ్గిస్తాయి. మొత్తం మీద, సాధారణ ఆరోగ్యం మెరుగవుతుంది.
జాగ్రత్తలు కొన్ని...
* ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ రావచ్చు.
* కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి.
* ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్థులు జాగ్రత్త వహించాలి.
ఎలా తినవచ్చంటే...
కొద్దిగా నూనె, లేదంటే నెయ్యి బాణలిలో వేసి, వేడి చేయండి. తామర గింజలను దానిలో వేసి, కరకరలాడేలా సన్నటి సెగ మీద 10 నిమిషాలు వేయించండి. మంట ఆపాక, తగినంత ఉప్పు, మసాలా దినుసులు కలపాలి. బాగా కలుపుకొన్నాక, వేడి వేడిగా తినవచ్చు. ఈ గింజలతో సాస్‌లు, పాల పాయసం చేసుకోవచ్చు.
పువ్వులు ఆహ్లాదం... గింజలు ఆరోగ్యం!
Published Sun, Dec 6 2015 5:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement