ఆనందం నీలోనే!
ఆత్మ లేదా ఆత్మ చైతన్యం అని మనం వింటూ ఉంటాం. ఆత్మ అనేది కేవలం మనుషులకే ఉంటుందని చాలామంది అభిప్రాయం కూడా. అది పొరపాటు. ఆత్మ లేదా చైతన్యస్వరూపమనేది ప్రతిజీవిలోనూ ఉంటుంది. అయితే దానిని గుర్తించగలిగేవారు చాలా అరుదు. ఆనందం విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధాభిప్రాయంతో ఉంటారు. అదేమంటే ఈ లోకంలో ఉన్న ఆనందమంతా తమలోనే ఉంది. అయితే ఆ విషయం తమకు తెలియదు. ఆనందం కోసం లోకమంతా గాలిస్తారు. చివరకు దాన్ని అందిపుచ్చుకోలేక ఆందోళన పడతారు. మనుషుల తీరే అంత. తమలో ఉన్న దాన్ని తెలుసుకోలేరు.
లేనిదానికోసం ఆరాటపడతారు. కస్తూరి మృగం తనలోని పరిమళభరితమైన కస్తూరి తన బొడ్డులోనే ఉందని తెలుసుకోలేదు. ఆ సువాసన ఎక్కడినుంచి వస్తోందో తెలుసుకోవాలనే తహతహతో, తపనతో నలుదిక్కులకూ పరుగెడుతుందట. ఆత్మజ్ఞానం లేని జంతువుకూ, ఆత్మజ్ఞానం ఉన్న మనిషికీ కూడా ఆ వ్యత్యాసం తెలియకపోవడమే విచిత్రం. ఆ వ్యత్యాసం తెలియాలంటే అన్ని జీవులనూ తన, పర భేదం లేకుండా ప్రేమించగలగాలి. అలాంటి వారికే ఆత్మజ్ఞానస్వరూపం తెలుస్తుంది.