200మందితో కలిసి జైలులో ఇంద్రాణి రచ్చ
ముంబయి: కన్నకూతురుని హత్య చేయించిన కేసులో జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జియా చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఆమె ప్రస్తుతం ఉంటున్న జైలులో నానా హంగామా చేశారు. 200మంది తోటి ఖైదీలతో కలిసి జైలులో ఆందోళనకు, అల్లరికి పాల్పడ్డారు. ఈ క్రమంలో జైలులోని సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని కూడా గాయపరిచారు. దీంతో ఆమెను ఇతర ఖైదీలను అదుపులోకి తీసుకొని మరోసారి తాజా అభియోగాలు నమోదు చేశారు.
కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం ఇంద్రాణి ముఖర్జియా ముంబయిలోని బైకుల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ జైలులోని మంజురా షెట్యే అనే ఒక ఖైదీని ఓ పోలీసు అధికారిణి తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ అంశంపై నిన్న శనివారం ఉదయం నుంచి జైలులోని మహిళా ఖైదీలంతా కూడా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. చాలామంది జైలు పైకి ఎక్కి వార్తా పేపర్లను తగులబెడుతూ జైలు అధికారుల వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. ఇందులో మొత్తం 251మంది ఖైదీలు ఉండగా వారిలో 200మంది ఆందోళనకు దిగారు. వీరిలో ఇంద్రాణి ముఖర్జియా కూడా ఉండటంతో ఆమెపై కూడా కేసులు నమోదు చేశారు.