ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణం!!
ఇళ్లలో ప్లాస్టిక్ కుర్చీలు, బకెట్లు, మగ్గులు.. ఇలా అనేక ప్లాస్టిక్ వస్తువులుంటాయి. అవి విరిగిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక చెత్తలో పారేస్తుంటాం. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెను ముప్పు పొంచి ఉంటుందని పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఈ వ్యర్థాలకు కూడా ఓ అర్థం కల్పించాలని ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అధికారులు భావించారు. ఇందుకోసం ఇంటింటికీ సిబ్బందిని తిప్పి, ఇళ్లలో పనికిరాని, విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులన్నింటినీ సేకరించారు. వాటిని కరిగించి గ్రాన్యూల్స్‌గా మార్చారు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 క్వింటాళ్ల గ్రాన్యూల్స్‌ను ఇప్పటివరకు సిద్ధం చేశారు. వీటిని ఉపయోగించి అంబికాపూర్‌కు సమీపంలోని భగవాన్‌పూర్ ప్రాంతంలో 400 మీటర్ల పొడవైన రేడియల్ రోడ్డును రూపొందిస్తున్నారు.
ఈ ఆలోచన ఆ జిల్లా కలెక్టర్ రీతు సేన్‌కు వచ్చింది. 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె, ముందుగా ఈ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని భావించారు. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించి.. చివరకు రోడ్డు వేస్తే బాగుంటుందని అనుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు సేకరించగా.. తారు రోడ్ల కంటే ప్లాస్టిక్ రోడ్లే మరింత నాణ్యంగా, మన్నికగా ఉంటాయని తెలిసింది. అంతే, వెంటనే ప్రజలకు అవగాహన కలిగించి, వారి వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రోడ్డు వేయించడానికి సిద్ధమైపోయారు. అక్కడ ప్లాస్టిక్ రోడ్డు వచ్చిందంటే.. ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని అటు కాలుష్యం నుంచి విముక్తి పొందడంతోపాటు, ఇటు రోడ్డు నిర్వహణ వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు.