జలపంపిణీతో జిల్లాలన్నీ డెల్టాలే
రాష్ట్రమంతటా ప్రాజెక్టులు, అలుగులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, కుంటలు నిత్యం నీటి నిల్వలతో నింపితే, అన్ని జిల్లాల్ని డెల్టా జిల్లాలుగా మార్చి, జనానికి ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. భారత రాజ్యాంగం దాని ఆదేశ సూత్రాలు సమానతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాయి. భారత సుప్రీం కోర్టు కూడా 1/97, 2/97 కేసు విషయంలో ఏప్రిల్ 25, 2000న తీర్పు ఇస్తూ ఒక రాష్ట్రా నికి కేటాయించిన నదీ జలాలు సాగునీటి ప్రాజెక్టుల వారీగా పంపకాలు అయి ఉన్నప్పటికీ మొత్తం నదీ జలాల్ని పునఃపంపిణీ చేసుకునే స్వేచ్ఛ ఆ రాష్ట్రానికి ఉంది అని చెప్పడం ద్వారా, ప్రాజెక్టుల వారీ బదులు ప్రాంతాలు, జిల్లాల వారీ సమానత్వం సాగునీటి పంపకాల్లో జరగాలని పరోక్షంగా కోరింది. కృష్ణా నదీజలాల కేటాయింపులు చేసిన బచావత్ ట్రిబ్యునల్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.
ఇక కృష్ణానదిలో లభించే మొత్తం నీటిలో (2393 టీఎంసీలు) 75 శాతం నికరజలాలు లభ్యత ప్రాతి పదికగా (2060 టీఎంసీలు) ఆంధ్ర ప్రదేశ్‌కు బచావత్ కమిషన్ 811 టీఎంసీల నీటిని కేటాయించగా, తర్వాతి కాలపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నికర జలాలు లభ్యత ప్రాతి పదికగా ఆంధ్రప్రదేశ్‌కు బచా వత్ కేటాయింపుల కంటే అదనంగా 190 టీఎంసీలను కేటాయిం చింది. అంటే కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నికర జలాల్ని అంచనా వేసే బచా వత్ సంప్రదాయానికి బదులు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ 65 శాతం నీటి లభ్యత ఆధారంగా నికర జలాలన్ని అంచనా వేసి, ఆ ప్రకారం నీటి కేటాయింపులు జరప డంతో అవసరాలను బట్టి సాంప్ర దాయాలను మార్చు కోవచ్చని బ్రిజేష్ ట్రిబ్యునల్ నిరూపించింది. కాబట్టి ఏపీలో నదీజలాల పునఃపంపిణీ చేసి అన్ని జిల్లాలు డెల్టాలుగా మార్చడానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు.
మరోవైపు, ఏడు జిల్లాలతో కూడిన సర్కారు ప్రాంత నాయకులు, ఆరు జిల్లాలతో కూడిన దక్షి ణాంధ్ర జిల్లాల నాయకుల మధ్య జరిగిన (నేటి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కూడి ఉండిన పాత -ఉమ్మడి- నెల్లూరు జిల్లా ప్రతినిధితో బాటు) 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడికలోనైతే రాయల సీమ-పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు (నేటి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) అవసరమైన సాగు నీటి ప్రాజెక్టుల్ని పదేండ్ల లోనైనా అంతకు మించిన సమయంలోనైనా పూర్తి చేసి, ఆ జిల్లాలన్నింటినీ ఆర్థికంగా సర్కారు జిల్లాల స్థాయికి తెచ్చిన తర్వాతనే సర్కారు జిల్లాల్లో సాగునీటి ప్రాజె క్టులు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించడం ద్వారా అన్ని ప్రాంతాలూ సమాన స్థాయి ఆర్థిక స్థితిని కలిగి ఉండటానికి కృషి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఐతే ఈ ఒడంబడికను ఉల్లంఘించి నాగార్జున సాగర్ సాగునీటి ప్రాజెక్టు, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు, పోలవరం, పట్టిసీమ, ప్రకాశం బ్యారేజ్ వంటి పలు నిర్మాణాలన్ని సర్కారు జిల్లాల్లోని కృష్ణ, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి నాలుగు జిల్లాలకు మేలు చేసే ప్రాజెక్టులనే నిర్మిస్తున్నారు తప్ప తక్కిన జిల్లాలకు నీరు ఇచ్చే ప్రాజె క్టులు ఒక్కటి కూడా నిర్మించడం లేదు. అందుకే ఈ మధ్య సిద్ధేశ్వరం అలుగు/చెక్‌డ్యాం నిర్మాణం వంటివాటికై ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటివి మరెన్నో దక్షిణాంధ్రలో, ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఉద్భవించే అవకాశాలు స్పష్టంగా అగుపడుతున్నాయి.
పాత ఆంధ్రప్రదేశ్‌లో గానీ, కొత్త ఏపీలో గానీ అన్ని జిల్లాలను డెల్టా జిల్లాలుగా మార్చడానికి సరిపడేంత నీరుంది. (వైఎస్ రాజశేఖరరెడ్డి పలు ప్రాజె క్టులను చేపట్టడానికి ఇదే కారణం). కానీ నేడు సమర్థ నీటి యాజమాన్యం లేమితో ఏడు సర్కారు జిల్లాల్లోని మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు, పూర్తిగా ఆరు దక్షిణాంధ్ర జిల్లాలు సాగునీటి కోసం అల్లాడుతున్నాయి.
ఈ లోపాన్ని సరిదిద్ది రాష్ట్రమంతటా ప్రాజెక్టులు, అలుగులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, కుంటలు ఎల్లప్పుడూ నీటి నిల్వలతో నింపి, భూగర్భ జలాలు పెరిగేటట్టు చేసి, అన్ని జిల్లాల్ని డెల్టా జిల్లా లుగా మార్చి, జనానికి ఉపాధి అవకాశాలు పెంచా ల్సిన అవసరముంది. ప్రభుత్వంపై ఆధారపడి జనం జీవించే పరిస్థితి లేకుండా చేయాల్సి ఉంది. ఈ విజన్ వైఎస్సార్‌కి ఉండగా ఆయన తర్వాత వచ్చిన ప్రభు త్వాలు దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అత్యవసర చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. ఇది సాధ్యం కూడాను.
ఇప్పటి కొత్త వంగడాలు, పంటల సాగుకాలం మూడింట ఒకవంతు తగ్గినందున కొత్త రాజధాని, ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టు భూముల్లోని దాదాపు 80 వేల ఎకరాలు సాగులేని భూములుగా మారినందున ఒక టీఎంసీ నీటితో దాదాపు 10 వేల ఎకరాల మాగాణి, 15 వేల ఎకరాల మెట్ట సాగు లెక్కన వెయ్యి టీఎంసీలతో దాదాపుగా కోటి ఎకరాలలో సాగు చేయవచ్చు. ఇక గోదావరి నుంచి సీమాంధ్రకు కేటా యింపు జరిగి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్ని నీటితో ముంచెత్తుతున్న నీరూ ఉంది కాబట్టి అన్ని జిల్లాల్లో ఒక మాగాణి, రెండు మెట్ట పంటలను సాగు చేసుకోవచ్చు.
చివరగా, కృష్ణానదిలోని నీటి ప్రవాహం కన్నా గోదావరిలోని నీటి ప్రవాహం (ధవళేశ్వరం) వద్ద సరా సరిన రెండింతలు ఉన్నందున కృష్ణానది నీటిలో ఏపీకి కేటాయించిన మొత్తం నీటిని ఆరు దక్షిణాంధ్ర జిల్లా లకు కేటాయించి, శ్రీశైలంను సాగునీటి ప్రాజెక్టుగా మార్చి, శ్రీశైలం పైభాగాన వీలైనన్ని అలుగులు నిర్మించి, లిఫ్టులతో, కాలువల్తో చెరువుల్ని నింపి ఆ జిల్లాల నీటి అవసరాల్ని తీర్చవచ్చు.
ఆంధ్రకు కేటా యించిన మొత్తం గోదావరి నీటిని ఏడు సర్కారు జిల్లాల సాగుకు వినియోగించేట్టు చేయాలి. సోలార్ పేనల్స్ని కాలువలపై నిర్మించి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చు. ఇలా చేస్తే నీటి సమస్యలు తీరుతాయి. రాష్ట్ర విభజన మరోసారి జరగకుండా చేయవచ్చు.
వ్యాసకర్త విశ్రాంత చరిత్ర ఆచార్యులు, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి
మొబైల్ : 98495 84324
- దేవిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి