సం‘కుల’ సమరమే...
కులాల సమీకరణలే కూటముల వ్యూహం
- రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఓబీసీ, ఈబీసీలే
- యాదవ-ముస్లిం సమ్మేళనంతో నాడు లాలు గెలుపు
- ఇప్పుడు అదే మంత్రం జపిస్తున్న మహాకూటమి
- బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏదీ అదే ప్రణాళిక
- అగ్రవర్ణాలతో పాటు.. బీసీ, ఓబీసీలకూ పెద్దపీట
సెంట్రల్ డెస్క్: బిహార్ శాసనసభ ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి? ఈ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల వ్యూహప్రతివ్యూహాలేమిటి?! మొన్నటివరకూ ఇటు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పక్షాలైనా.. అటు జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి అయినా.. రాష్ట్రంలో జరగని - జరిగిన - జరగబోయే ‘అభివృద్ధి’ అంశం మీదే ప్రధానంగా మాట్లాడాయి. బిహార్ ఎన్నికల అజెండాలోకి ‘అభివృద్ధి’ అంశాన్ని దిగ్విజయంగా తెచ్చామని బీజేపీ ఘనంగా ప్రకటించింది కూడా. కానీ.. అక్టోబర్ 12 నుంచి 5 విడతలుగా జరగనున్న ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అభివృద్ధి అంశం పక్కకుపోతోంది.
ఎప్పటిలాగానే కులాల సమీకరణలే తెరపైకి వచ్చాయి. మహాకూటమిలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ అయితే మొన్ననే ఏకంగా ‘ఈ ఎన్నికలు వెనుకబడిన కులాలు - అగ్రకులాల మధ్య పోరాటం’గా అభివర్ణించారు! ఆయన వ్యాఖ్యలను జేడీయూ కూడా సమర్థించింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఈ మాటలను తీవ్రంగా తప్పుపట్టాయి. ఎన్నికల్లో కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డాయి. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. పైకి అభివృద్ధి మంత్రం జపించినా.. బిహార్ ఎన్నికల్లో కూడా ఎప్పటిలాగానే అందరి అంతర్గత వ్యూహం మాత్రం కులాల బలాల సమీకరణేనన్నది స్పష్టమవుతోంది. మహా కూటమితో పాటు ఎన్డీఏ కూడా ఆ ప్రాతిపదికనే యుద్ధానికి సన్నద్ధమైనట్లు రెండు కూటముల అభ్యర్థుల జాబితాలు తేటతెల్లం చేస్తున్నాయి.
యాదవ-ముస్లిం సమ్మేళన మంత్రం...
స్వాతంత్య్రానంతరం కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన నిరాఘాటంగా కొనసాగుతున్న కాలంలో.. తొలిసారిగా బిహార్‌లోనే జయప్రకాశ్‌నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ పిలుపుతో ఉద్యమించారు. ఆ ఉద్యమం నుంచే లాలుప్రసాద్, నితీశ్‌కుమార్ వంటి నేతలు వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత వెనుకబడిన కులాల వారి దుస్థితిపై ఉద్యమాలతో కేంద్రం మండల్ కమిషన్ నియమించటం.. ఆ నేపథ్యంలో బిహార్‌లో బీసీలను చైతన్యపరచి ఏకం చేయటంలో లాలు విజయం సాధించారు. 1990 ఎన్నికల్లో జనతాదళ్ గెలుపుతో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం.. బిహార్‌లో బలమైన తన యాదవ కులస్తులను సంఘటిత పరచటంతో పాటు.. ముస్లింల మద్దతును కూడగట్టుకోవటంలో కృతకృత్యుడయ్యారు. యాదవ్ - ముస్లిం సమ్మేళనంతో మరో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చారు. అయితే.. పదిహేనేళ్ల ఆర్జేడీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించకపోగా.. ఒక కులం వారే బలపడ్డారన్న అసంతృప్తి మిగతా వర్గాల్లో పెరిగిపోయింది.
లాలును ఓడించిన
కుర్మీ యోధుడు నితీశ్: ఇటువంటి పరిస్థితుల్లో 2005 ఎన్నికల్లో జేడీయూ నేత, కుర్మీల ప్రతినిధి నితీశ్‌కుమార్.. బీజేపీతో జట్టుకట్టి ఎన్డీఏ కూటమిగా పోటీచేసి లాలును ఓడించి అధికారం చేపట్టారు. ఆ ఎన్నికల్లో 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏకు 143 స్థానాలు (జేడీయూ 88, బీజేపీ 55) లభించగా.. ఆర్జేడీకి 54 స్థానాలు మాత్రమే లభించాయి. 2010 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈసారి 206 స్థానాలు (జేడీయూ 115, బీజేపీ 91) కైవసం చేసుకుంది. ఆర్జేడీ 22 సీట్లకు పడిపోయింది. ఈ రెండు ఎన్నికల్లో జేడీయూ - బీజేపీ కూటమి గెలుపుకు ప్రధాన కారణం.. అగ్రకులాలు, వెనుకబడిన కులాలు, దళితులు, మహాదళితులు, ముస్లిం లు కలిసి రావటమేనని పరిశీలకుల విశ్లేషణ.
అనంతర పరిణామాల్లో బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకున్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా బిహార్ లోనూ దుమారం సృష్టించింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 22 సీట్లు గెలుచుకుంది. ఒంటరిగా పోటీచేసిన జేడీయూ కేవలం 2 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ 4 స్థానాలు గెలుచుకుంది. ఎల్జేపీ 6 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లలో గెలుపొందాయి. ఈ ఫలితాలు జేడీయూ, ఆర్జేడీల్లో గుబులు పుట్టించాయి. ఈ నేపథ్యంలో.. ఒకప్పటి బద్ధశత్రువులైన లాలు, నితీశ్‌లు ఇప్పుడు మిత్రులయ్యారు. తామిరువురమూ కలిసి పోటీ చేస్తే.. రాష్ట్రంలో సగం జనాభా ఉన్న ఓబీసీ, ఈబీసీ ఓట్లు చీలిపోకుండా చూసుకోవచ్చని.. ముస్లిం ఓట్లు కలిసి వస్తాయన్న లెక్కలతో బరిలోకి దిగారు.
ఇక రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా అత్యంత బలవంతులైన 15 శాతం అగ్రవర్ణాలు మొత్తం మరో మాటకు తావులేకుండా బీజేపీ వెనుకే నిలబడ్డారన్నది పరిశీలకుల మాట. దీనికి రామ్‌విలాస్‌పాశ్వాన్ ఎల్జేపీ, జితన్‌రామ్‌మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చాలు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 శాతం దళితులు, మహాదళితుల మద్దతుతో పాటు.. యాదవులు, కుర్మీలతో పాటు బీసీ, ఈబీసీ వర్గాల నుంచీ మద్దతు లభిస్తుందన్నది ఎన్డీఏ వ్యూహంగా చెప్తున్నారు. అందుకే.. ఎన్డీఏ పక్షాల సీట్ల కేటాయింపు కూడా అదే రీతిలో సాగిందని విశ్లేషిస్తున్నారు.
ఎం-వై వ్యూహం: బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి.
వీటిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమి 97 సీట్లను ‘ముస్లిం - యాదవ’ సమీకరణకు కేటాయించింది. అందులోనూ అత్యధికంగా 64 సీట్లు యాదవులకు, 33 సీట్లు ముస్లింలకు కేటాయించింది. యాదవులకు కేటాయించిన 64 సీట్లలో ఆర్జేడీ ఒక్కటే 48 సీట్లు ఇవ్వటం గమనార్హం. నితీశ్ సొంత కులమైన కుర్మీలకు మహాకూటమి 17 సీట్లు కేటాయించింది. ఇక గత ఎన్నికల్లో నితీశ్‌ను బలపరచిన బాగా వెనుకబడిన కులాల వారికి మరో 40 సీట్లు కేటాయించింది.
అగ్రకులాలతో పాటూ బీసీలకూ పీట...
ఎన్డీఏ పక్షాలన్నీ కలిపి 85 సీట్లను అగ్రవర్ణాల వారికి కేటాయించాయి. మొత్తం 85 సీట్లలో రాజ్‌పుట్‌లకు 36, భూమిహార్లకు 28 సీట్లు ఇచ్చాయి. బీజేపీ తన వాటా 160 సీట్లలో 22 సీట్లను యాదవులకు, 10 సీట్లను కుర్మీలకు, బనియాలకు 13 సీట్లు కేటాయించింది. బీసీలు, ఓబీసీలకు మరింత ప్రాతినిధ్యం ఇచ్చే పనిని బీజేపీ తన మిత్రపక్షాలకు అప్పగించింది.
జనాభాలో సగం మందికి పైగా బీసీలే...
బిహార్ జనాభా దాదాపు పది కోట్ల మంది. వీరిలో 25 శాతం మంది ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారు. ఇందులో దాదాపు వంద కులాలు ఉంటే.. వాటిలో లాలుప్రసాద్‌కు చెందిన యాదవులు, నితీశ్‌కుమార్‌కు చెందిన కుర్మీలదే అధిక్యం. సంఖ్యాపరంగా రాష్ట్ర జనాభాలో యాదవులు 14 శాతం, కుర్మీలు 5 శాతం మంది ఉన్నారు. జనాభాలో మరో 26 శాతం మంది చాలా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) వారు. అంటే.. రాష్ట్ర జనాభాలో సగం మందికి పైగా వెనుకబడిన వర్గాల వారే. రాజ్పుట్లు, భూమిహార్లు, బ్రాహ్మణులు వంటి అగ్రకులాల జనాభా సుమారు 15 శాతం వరకూ ఉంటుంది. జనాభాలో 17 శాతం మంది దళితులు, మహాదళితులు ఉన్నారు. దళితులకు రామ్‌విలాస్‌పాశ్వాన్, మహాదళితులకు జితన్రామ్మాంఝీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివాసీలు ఒక శాతం మంది ఉంటే.. మరొక శాతం మంది ముస్లిమేతర మైనారిటీ లు. మిగతా జనాభా.. అంటే దాదాపు 16 శాతం మంది ముస్లింలు.