దళిత కూలీ రామయ్య పోరాటం
ట్రెండ్లు పట్టించుకోకుండా, ఫార్ములాలకు దూరంగా తను నమ్మిన సిద్ధాంతంతో గత మూడు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న ఏకైక కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన చేసిన ‘అర్ధరాత్రి స్వతంత్రం’, ‘ఎర్ర సైన్యం’ సినిమాలు ఏడాదికి పైగా ప్రదర్శితమయ్యాయి. ‘చీమలదండు’ రజతోత్సవం జరుపుకొంది. ‘దండోరా, అడవి దివిటీలు, దళం, ఊరు మనదిరా’ తదితర చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకొన్నాయి. ఇంకా ఆయన కెరీర్లో ఇలాంటివి ఎన్నో విజయాలు ఉన్నాయి. ఇన్ని విజయాలున్నా ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే ఆయన తీసిన తాజా సినిమా ‘రాజ్యాధికారం’.
ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘ఆనాటి నుంచి ఈనాటి వరకూ దళితులు వెనుకబడటానికి కారణమేమిటనే నేపథ్యంలో ఈ సినిమా తీశాను. అధికారం కోసం కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు చేసే అకృత్యాలను ఇందులో ఎండగడుతున్నా. ఇందులో నేను దళిత కూలీ రామయ్య పాత్ర పోషించా. అతను చేసే పోరాటమే ఈ సినిమా. తనికెళ్ల భరణి, స్వర్గీయ నటి తెలంగాణ శకుంతల నెగిటివ్ రోల్స్ చేశారు. ఇందులోని ఏడు పాటలూ జనాదరణ పొందాయి’’ అని తెలిపారు.